Yevam Movie Review: చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, అషురెడ్డి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘యేవమ్’ సినిమా జూన్ 14న యేవమ్ సినిమా థియేటర్స్ లో రిలీజయింది. నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాందిని చౌదరి మొదటిసారిగా పోలీసాఫీసర్ రోల్ లో నటించింది. ఇప్పటి వరకు పక్కింటమ్మాయి పాత్రలకే పరిమితం అయిన చాందిని పోలీస్ ఆఫీసర్ రోల్ అనగానే ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం పదండి.
యేవమ్ కథ: వికారాబాద్ లో పోలీస్ స్టేషన్ లో సౌమ్య(చాందిని చౌదరి)ని ప్రొబేషనరీ ఎస్సైగా పోస్టింగ్ వస్తుంది. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆమెని ప్రధాన్యత లేని సెక్షన్లో పడేస్తారు. ఎస్సై అభి(భరత్ రాజ్) అంటే సౌమ్యకు అభిమానం, ఆయనని మెప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక మరో పక్క అదే పోలీస్ స్టేషన్ పరిధిలో యుగంధర్(వశిష్ట సింహ) హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలని ట్రాప్ చేసి కలుస్తూ ఉంటాడు. అయితే ఒక అమ్మాయి హత్యకు గురి కావడంతో పోలీసులు సీరియస్ అయి జాగ్రత్తగా ఉండమని మీడియా ద్వారా హెచ్చరిస్తారు. ఓ అమ్మాయిని మహేష్ బాబు పేరుతో ట్రాప్ చేయాలని చూడగా సౌమ్య ఆ అమ్మాయి బదులు వెళ్లి యాక్సిడెంట్ కు గురవుతుంది. ముందు నుంచి దూరంగా ఉంటూ వచ్చిన అభి యాక్సిడెంట్ తరువాత దగ్గరవుతాడు. అయితే అభికి పెళ్ళయిపోయిందని, భార్య హారిక(అషురెడ్డి) వదిలేసి వెళ్లిపోయిందని తెలియడంతో సౌమ్యకు హారిక ఎందుకు వదిలేసి వెళ్ళింది అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఈ క్రమంలో పోలీసులు యుగంధర్ ని పట్టుకున్నారా? హారిక వ్యవహారాన్ని సౌమ్య కనిపెట్టిందా? అసలు యుగంధర్, అభికి సంబంధం ఏంటి? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
యేవమ్ విశ్లేషణ సినిమా ఓపెనింగ్ లోనే కథ ఏమిటి అనే విషయం మీద కొంత క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. సౌమ్య పోలీస్ స్టేషన్లో అవ్వడం, సౌమ్య – అభి మధ్య చిన్నపాటి కెమిస్ట్రీతో కథ నడిపిస్తూనే యుగంధర్ అమ్మాయిలని ట్రాప్ చేయడం చూపించి ఇంటర్వెల్ కి ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ మొదట్లోనే యుగంధర్ ని పట్టుకునే ప్రయత్నాలు ఆసక్తిరకంగా ఉంటాయి. ఒక ఆడపిల్ల పోలీస్ అయితే పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తికరంగా చూపించారు. ఇక సినిమాలో విలన్ ఎవరో ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ లోనే కన్ఫ్యూషన్ లో పరిచయం చేసినా పోలీసులు ఎలా పట్టుకుంటారు అనేది ఆసక్తికరం అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూనే యాక్షన్ సీన్స్ లో కూడా తన మార్క్ చాటుకుంది చాందిని చౌదరి. యుగంధర్ పాత్రలో వశిష్ట సింహ నటన కూడా బాగుంది. భరత్ రాజ్ కూడా తన నటనతో మెప్పించాడు. అషురెడ్డి కాసేపే కనిపించినా తన అందంతో అలరించింది. ఇక గోపరాజు రమణ సహా మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు బాగానే నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ మీద ఫోకస్ పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.
ఫైనల్లీ యేవమ్ ఒక అండర్ డాగ్ మహిళా పోలీసు అధికారి కథ.