Bigg Boss Srihan Maa Awara Zindagi Review: ఈ మధ్య కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అయితే 100% ఫన్ 0% లాజిక్‌తో ఒక సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ అందుకున్న బిగ్‌బాస్ శ్రీహాన్ ముక్కు అజయ్ తో పాటు ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే నటీ నటులుగా రూపొందిన ‘మా ఆవారా జిందగి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
కథ ఏమిటంటే:
ఎలాంటి పనులు చేయకుండా సంపాదించి పెడుతుంటే ఖర్చు పెడుతూ బిందాస్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన నలుగురు ఆవారా కుర్రాళ్ళు నాలుగేళ్లు చదవాల్సిన బి.టెక్ ను ఎనిమిదేళ్లు చదివి బయటికి వస్తారు. వారే బట్టి(శ్రీహన్), క్రైమ్ బ్రాంచ్-సీబీ(అజయ్), లవర్ బాయ్-ఎల్బీ(చెర్రీ), లంబూ(జస్వంత్). బీటెక్ చదివినా వారికి జాబ్స్ దొరకక ఇంట్లో వారికి సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అనుకోకుండా ఒక పోలీసు కేసులో ఇరుక్కుని బయటకు వచ్చాక సీబీ ఒక ఫకీరును ఇబ్బంది పెడతాడు, దీంతో అతను శపించడంతో మగతనం పోయిందని అర్ధమై కాళ్లా వేళ్ళా పడి మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాడు. అయితే ఆ తర్వాత మగతనం సెట్ అయిందా లేదా అని టెస్ట్ చేసేందుకు వెళతారు. అలా వెళ్లిన సమయంలో అనుకోకుండా ఒక కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటారు. అలా ఇరుక్కున్న అనంతరం ఆ నలుగురు ఈ కేసు నుంచి ఎలా తప్పించుకున్నారు? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
ఈ మధ్య కాలంలో యూత్ ఫుల్ స్టోరీస్ కి మంచి డిమాండ్ ఉంది, ఈ సినిమా కూడా అలాంటి కోవలోనే తెరకెక్కింది. 100% ఫన్ 0% లాజిక్‌తో సినిమా చేశామని ముందే చెప్పేసిన దర్శకుడు ఫస్ట్ హాఫ్ అంతా నలుగురి లైఫ్ స్టైల్ వారి క్యారెక్టర్లను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. రోజూ మన ఇంటి పక్కనో లేక మన చుట్టుపక్కల ఆవారాగా తిరిగే వాళ్ళని చూస్తూనే ఉంటాము, అలాంటి వారి కథతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. వారంతా ఏమీ చేయకుండానే ఒక కిడ్నాప్ కేసులో చిక్కుకోవడం, ఆ తర్వాత వారు ఎలా తప్పించుకున్నారు? అనే విషయాన్ని కామెడీవేలో యూత్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో సఫలం అయ్యాడు దర్శకుడు. ఇక హీరోయిన్ ఉండి ఉంటే సినిమా పక్కదారి పడుతుంది అనుకున్నాడో ఏమో అసలు ఆ జోలికే పోలేదు. ముందే లాజిక్ కోసం చూడొద్దని చెప్పేసి జాగ్రత్త పడ్డ డైరెక్టర్ ఆద్యంతం యూత్ ను ఆకట్టుకునే సీన్లు, కామెడీ సీన్లతో నింపేశారు. ఈ మధ్య బోల్డ్ కంటెంట్ తో వచ్చి కొందరు డైరెక్టర్లు తిట్టించుకుంటుంటే ఈ డైరెక్టర్ మాత్రం నవ్వించాడు.
ఎవరెలా చేశారంటే:
బిగ్‌బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్ లు ఇద్దరూ సినిమాకు స్టార్ అట్రాక్షన్ వీరితో పాటు ఢీ చెర్రీ, జస్వంత్ కూడా ఆకట్టుకున్నారు. జస్వంత్ అయితే కడుపుబ్బా నవ్వించాడు. శ్రీహాన్ కూడా తనలో మంచి నటుడు ఉన్నాడని అనిపించుకున్నాడు. ముక్కు అజయ్ డైలాగులు బాగా పేలాయి, షియాజీ షిండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిగతా పాత్రల్లో నటించిన వారు ఆకట్టుకున్నారు. సినిమాలో కామెడీ యాంగిల్ సూపర్ గా వర్కౌట్ అయింది. ఇక టెక్నికల్ టీంలో డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డికి మొదటి సినిమానే అయినా ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి ప్రతీక్ నాగ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిచింది.
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథాంశం
బోల్డ్ కామెడీ
నిడివి
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
షాయాజీ షిండే డబ్బింగ్
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్: యూత్ కి కనెక్ట్ అయ్యే బోల్డ్ కామెడీ ఎంటర్టైనర్.