విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ నటిస్తున్న అన్ని సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన నటించిన తాజా చిత్రం భద్రకాళిని కూడా రిలీజ్ చేశారు. ఇక అరుణ్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాని విజయ్ ఆంటోనీతో కలిసి తెలుగు వ్యక్తి రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. తృప్తి రవీందర్, రియాజిత్తు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమామీద మొదటినుంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను పెంచేలా సినిమా ట్రైలర్ కట్ ఉండడంతో సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఎట్టకేలకు ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
భద్రకాళి కథ:
సెక్రటేరియట్ కిట్టు(విజయ్ ఆంటోనీ) సెక్రటేరియట్‌లో ఒక పవర్ బ్రోకర్. పోలీసు అధికారుల ట్రాన్స్‌ఫర్స్ మొదలు రాజకీయ నాయకుల పీఏల వద్ద ఇరుక్కున్న డబ్బులను సైతం వెనక్కి ఇప్పించగల చాణక్యుడు అతడు. ఈ క్రమంలో ఒక పెద్ద డీల్ చేయడంతో ఓ బడా బ్రోకర్ అభయంకర్ కంట పడతాడు. అప్పటివరకు కిట్టు లెవల్ చాలా చిన్నదని భావిస్తూ వచ్చిన సదరు బడా బ్రోకర్ కిట్టు మీద ఫోకస్ పెట్టి తనకు నమ్మకస్తుడైన ఓ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్(కిరణ్)ను కిట్టు మీద ఫోకస్ పెట్టమని చెబుతాడు. అలా వచ్చిన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కిట్టు ఏకంగా 6000 కోట్ల రూపాయలు బ్రోకరేజ్ ద్వారా కమిషన్ సంపాదించాడని తెలుసుకుంటాడు. అయితే ఆ 6000 కోట్ల రూపాయలని కిట్టు ఏం చేశాడు? ఆ డబ్బుని టాస్క్ ఫోర్స్ టీం వెనక్కి తీసుకోగలిగిందా? లేదా? అయితే అసలు కిట్టు నేపథ్యం ఏమిటి? కిట్టు బ్రోకర్‌గా ఎందుకు మారాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: భాష ఏదైనా పొలిటికల్ థ్రిల్లర్ అంటే కచ్చితంగా ప్రేక్షకులకు సినిమామీద ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక పొలిటికల్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ ఆంటోనీ. గతంలో తమిళంలో రెండు సినిమాలు చేసి రెండు సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఈ భద్రకాళి అనే సినిమా రూపొందింది. సినిమా ఫస్ట్ హాఫ్ మొదలవగానే ఓ అనాధ పెద్ద పొలిటికల్ పవర్ బ్రోకర్ అయినట్లు చూపిస్తారు. ప్రాసెస్ చూపించకపోయినా, ఆ పొలిటికల్ పవర్ బ్రోకర్ ఎలాంటి పనులు చేయగలడు అనే విషయాన్ని సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే ఎస్టాబ్లిష్ చేసేసారు. ఇక ఆ తర్వాత అతను ఆడించే ఆట అంతా తెలిసిందే అయినా, సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం కొత్తగా అనిపిస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ అంత ఆసక్తికరంగా నడిపిస్తూ ఇంటర్వెల్ సమయానికి ఒక మంచి ట్విస్ట్‌తో క్లోజ్ చేశాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ మొదలయ్యాక అంతకు మించిన ఆట ఉంటుందని భావించిన ప్రేక్షకులకు మాత్రం ఒకింత షాక్ ఇస్తూ సెకండ్ హాఫ్‌కి వెళ్ళాక రొటీన్ ఫార్మాట్‌లోకి వెళ్లిపోయాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఇదేదో రొటీన్ రెవెన్యూ గ్రామ అనే ఫీలింగ్ కలుగుతుంది. అయినా సరే, ఆసక్తికరంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా రూపొందించాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగగా సెకండ్ హాఫ్ మాత్రం ఆశించిన మేర ఆసక్తికరంగా అనిపించదు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా థ్రిల్లర్ జానర్ కాబట్టి సెకండ్ హాఫ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరోగా విజయ్ ఆంటోనీ వన్ మ్యాన్ షో చేశాడు. ఒకపక్క నటిస్తూనే మరోపక్క సంగీతం అందిస్తూ ఆకట్టుకున్నాడు. విజయ్ ఆంటోనీ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది? అయితే తెరమీద కనిపించిన హీరోయిన్ తృప్తి రవీందర్‌కు చాలా మంచి పాత్ర పడింది. విజయ్ భార్య పాత్రలో ఆమె సినిమాలో చాలా సేపు కనిపిస్తుంది. అయితే ఆఫ్ స్క్రీన్ చాలా యంగ్‌గా ఉన్న అమ్మాయిని ఆన్ స్క్రీన్ ఎందుకో కాస్త ఏజ్డ్ యువతిగా చూపించారు. రియాజిత్తు పాత్ర చాలా చిన్నదే. అయితే సినిమా మొత్తం మీద టాస్క్ ఫోర్స్ ఆఫీసర్‌గా నటించిన కేడి డైరెక్టర్ కిరణ్ మాత్రం అదరగొట్టాడు. అలాగే అభయంకర్ అనే పాత్రలో నటించిన నటుడు కూడా తనదైన క్లాసి విలనిజంతో ఆకట్టుకున్నాడు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి నేపథ్య సంగీతమే ప్రాణం. నిజానికి థ్రిల్లర్ సినిమాలకు కచ్చితంగా నేపథ్య సంగీతం ఎక్స్‌ట్రార్డినరీగా కుదిరితే గాని సినిమా తెరమీద ఆకట్టుకునేలా మారదు. ఈ సినిమా విషయంలో విజయ్ ఆంటోనీ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. పాటలు అనవసరంగా కాకుండా నేపథ్య సంగీతంలో భాగంగానే వచ్చాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. చాలా ఫ్రేమ్స్ కొత్తగా అనిపించాయి. ఫైట్స్ కూడా సింపుల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా వర్క్‌ఔట్ చేసి ఉండొచ్చు.
ఫైనల్‌గా ఈ భద్రకాళి ఆలోచింపజేసే ఓ పొలిటికల్ థ్రిల్లర్.