నేటి తరం యువత ఆలోచనలు, వారి స్వేచ్ఛా ప్రపంచం నేపథ్యంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ గాళ్స్’ (కానీ చాలా మంచోళ్లు). ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందిన మున్నా (ఫణి ప్రదీప్) ధూళిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ప్రమోషన్స్ తో ప్రేక్షకులలో అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది? నలుగురమ్మాయిల మలేషియా ప్రయాణం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో తెలుసుకుందాం.
బ్యాడ్ గాళ్స్ కథ:
హైదరాబాద్‌లోని ఒక లేడీస్ హాస్టల్‌లో కలిసి రోజీ రెడ్డి(రోష్ని), మల్లీశ్వరి(పాయల్ చెంగప్ప), మెర్సీ(యష్మ), వెంకట్ లక్ష్మి(అంచల్ గౌడ) అనే నలుగురు స్నేహితుల కథ ఇది. వీరిలో ఇద్దరికి నిశ్చితార్థాలు అయ్యాక పెళ్లి తర్వాత జీవితం బాధ్యతలతో నిండిపోతుందనే భయంతో, పెళ్లికి ముందే మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని ఈ నలుగురూ మలేషియా ట్రిప్ ప్లాన్ చేస్తారు. అయితే, అక్కడ వారు ఊహించని విధంగా ఒక ఉమెన్ ట్రాఫికింగ్ (మహిళల అక్రమ రవాణా) ముఠా సహా ‘అనకొండ’ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ముఠాకి దొరుకుతారు. కేవలం టైం పాస్ చేసి లైఫ్ టైం మెమరీస్ సంపాదించుకోవడం కోసం మలేషియా వెళ్ళిన ఈ స్నేహితులు ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారు? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
దర్శకుడు మున్నా ధూళిపూడి ఈ తరం అమ్మాయిల బాడీ లాంగ్వేజ్ సహా మనస్తత్వాలకు అద్దం పడుతూ కథను నడిపించారు. ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సినిమాల్లో అబ్బాయిల అల్లరి ఎలా ఉంటుందో, ఇక్కడ అమ్మాయిల మధ్య సంభాషణలు సహా వారి చేష్టలు కూడా అంతే సరదాగా సాగిపోయేలా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా యూత్‌ను ఆకట్టుకునే పంచ్ డైలాగులు, కామెడీ సన్నివేశాలతో స్పీడ్‌గా నడిపించి సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి సినిమా జోనర్ మార్చేశాడు. సరదాగా సాగే కథ కాస్తా క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా టర్న్ తీసుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ రెండో భాగంపై ఆసక్తిని పెంచుతుంది. కథనం కొన్ని చోట్ల పాత సినిమాలను గుర్తుకు తెచ్చినప్పటికీ, స్క్రీన్ ప్లే లోని వేగం ఆ లోటును భర్తీ చేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అమ్మాయిలు బయట ప్రపంచంలో ఎంత అప్రమత్తంగా ఉండాలనే కోణంలో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది.
నటీనటుల విషయానికి వస్తే అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న ఈ నలుగురూ తమ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో సినిమాను భుజానికెత్తుకున్నారు. వీరి మధ్య ఉండే సింక్ సహజంగా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత వెండితెరపై మెరిసిన రేణు దేశాయ్ తనదైన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. ఆమె మంత్రి పాత్ర సినిమాకు ఒక హుందాతనాన్ని తెచ్చింది. ఇక ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్యాకేజిలా మెరిసింది యాంకర్ స్రవంతి. ఆమె ఉన్న సీన్స్ ఆకట్టుకున్నాయి. నెగటివ్ రోల్స్ లో మొయిన్, రోహన్ సూర్యలు మెప్పించగా, తాగుబోతు రమేష్, రాజా రవీంద్రలు తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలో ప్రధాన ఆకర్షణ అనూప్ రూబెన్స్ సంగీతం. పాటలు సహా నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ని ఎలివేట్ చేశాయి. చంద్రబోస్ అందించిన సాహిత్యం కూడా అర్థవంతంగా ఉంది. షూటింగ్ మెజారిటీ భాగం మలేషియాలో జరగడంతో విజువల్స్ చాలా గ్రాండ్‌గా, రిచ్‌గా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.
ఓవరాల్‌గా ‘బ్యాడ్ గాళ్స్’ టైం పాస్ క్రైమ్ కామెడీ విత్ మెసేజ్.