NTV Telugu Site icon

Shivam Bhaje Review: శివం భజే రివ్యూ

Shivam Bhaje Review

Shivam Bhaje Review

అశ్విన్ బాబు హీరోగా శివం భజే అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయింది. ట్రైలర్లో శివుడి షాట్ ఒకటి కనిపించడంతో ప్రేక్షకులలో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంది? ప్రేక్షకులను సినిమా ఎంత వరకు ఆకట్టుకుంది అనే విషయాలు ఈ సినిమా రివ్యూలో చూద్దాం.

శివం భజే రివ్యూ:
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన చందు(అశ్విన్ బాబు) ఒక బ్యాంకు లోన్ రికవరీ ఏజెంట్గా పని చేస్తూ ఉంటాడు. తండ్రి మరణంతో దేవుడి మీద నమ్మకం కోల్పోతాడు. ఒక లోన్ రికవరీ కోసం వెళ్లిన చందు శైలజ(దిగంగన)ను మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమలో తడిసి ముద్దవుతున్న చందు ప్రమాదవశాత్తు కళ్ళు కోల్పోతాడు. అయితే ఒకరి మరణంతో అతనికి కళ్ళు మళ్ళీ వస్తాయి. అయితే ఆ కళ్ళు ఆపరేషన్ చేస్తున్న సమయంలో పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటు వల్ల చందుకి కొన్ని అదనపు శక్తులు వస్తాయి. అయితే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు జరిగిన పొరపాటు ఏంటి? చందుకి దానివల్ల వచ్చిన శక్తులు ఏమిటి? ఆ శక్తులు చందుకి ఎలా ఉపయోగపడ్డాయి? మరో పక్క ఇండియా మీద పాకిస్తాన్ చైనా కలిసి పన్నుతున్న కుట్రలు ఏమిటి? వాటిని చందు ఎలా అడ్డుకున్నాడు? అనేది ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
ఇండియా మీద పాకిస్తాన్ కుట్రలు వాటిని చేధించడానికి హీరో ఎలా కష్టపడ్డాడు? లాంటి లైన్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక దైవిక శక్తి కూడా ఆ హీరోకి తోడవడం అనేది కాస్త కొత్త పాయింట్ అనేలా ఉంటుంది. దానికి తోడు డిస్ క్లోజ్ చేయలేని ఒక ఆసక్తికరమైన పాయింట్ ని కూడా సినిమాలో డిస్కస్ చేశారు. ఇలా కూడా జరుగుతుందా అని ఒకపక్క ఆశ్చర్య చకితుల్ని చేస్తూనే మరొకపక్క సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తూ చూపించిన ఉదాహరణలు కూడా కన్విన్స్ చేసేలాగానే ఉన్నాయి. సినిమా నిడివి కూడా సినిమాకి ప్లస్ అయ్యేలానే ఉంది. అయితే కొన్ని సీన్స్ సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా మలవడంలో తోడ్పాటు అందించాయి. నిజానికి ఇలాంటి పాయింట్ ఎంచుకోవడం లోనే చాలా ధైర్యం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూట్ చేసే విషయంలో మాత్రం కొంచెం తడబడినట్టు అనిపిస్తుంది.

డివోషనల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న ఈ మిస్టీరియస్ థ్రిల్లర్‌లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందని విధంగా రాసుకున్నాడు. దర్శకుడు రాసుకున్న క్రైమ్ డ్రామా కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా సినిమాలో కొన్ని సస్పెన్స్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. హైపర్ ఆది పంచ్‌లు – మేనరిజమ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు, సిల్లీ రీజన్స్ పక్కన పెడితే సినిమాను కొత్త పాయింట్ కోసం చూసేయచ్చు.

నటీనటుల విషయానికి వొస్తే చందు పాత్రలో అశ్విన్ బాబు చాలా బాగా నటించాడు. కొన్ని సీన్స్ లో హీరో నటన బాగా కుదిరింది. హీరోయిన్ పాత్రలో దిగంగనా సూర్యవంశీ బాగానే నటించింది కానీ ఆమె పాత్రకు తగ్గ స్కోప్ తగ్గలేదు. పోలీస్ అధికారిగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ఆకట్టుకున్నారు. హైపర్ ఆది, బ్రహ్మాజీ తన పాత్రలో మెప్పించాడు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన సాయి ధీన, మురళీ శర్మ, తులసి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడు అప్సర్ తీసుకున్న మెయిన్ పాయింట్, అండ్ ఆ పాయింట్‌ను ఎలివేట్ చేస్తూ రాసుకున్న కొన్ని సీన్స్ పర్వాలేదు. మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాని బాగా డీల్ చేశాడు డైరెక్టర్. శత్రుదేశాల దాడి నేపథ్యంలో అల్లిన డ్రామా కూడా బాగుంది. కొన్ని సీన్స్ ను మాత్రం కన్విన్సింగ్ గా తీయడంలో తడబడ్డాడు అనిపించింది. దర్శకుడు అప్సర్‌ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాకి అనేక జానర్ లను మిక్స్ చేసే ప్రయత్నం చేశారు. అలా కాకుండా ప్లాట్ కొన్ని జానర్లకి పరిమితం చేసి ఉంటే ఇంకా ఆసక్తికరంగా ఉండేదేమో. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చాలా బాగా చూపించారు. వికాస్ బడిస సంగీతం కన్నా నేపథ్య సంగీతం బాగుంది. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

ఫైనల్లీ శివం భజే ఒక మిస్టీరియస్ థ్రిల్లర్.. అంచనాలు లేకుండా వెళితే నచ్చొచ్చు. శివ తత్వాన్ని నమ్మేవారికి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

Show comments