ఈ మధ్యకాలంలో ఒకే ఒక్క డైలాగ్ తో సినిమా మీద అంచనాలు పెంచేలా చేసుకున్న చిత్రం ఏదైనా ఉందంటే అది శివంగి. ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం మార్చి ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వంగే వాళ్లు వుంటే… మింగే వాళ్లు వుంటారు… నేను వంగే రకం కాదు… మింగే రకం…’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ డైలాగ్ విపరీతంగా వైరల్ అయింది. ఎప్పుడూ హోమ్లీగా కనిపించే ఆనంది అంత వైల్డ్ పాత్రలో కనిపించడంతో సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది.. ఈ శివంగి ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ: ఓ వైపు భర్త అనారోగ్య పరిస్థితులు… మరో వైపు ఆర్థిక సమస్యలు సత్యభామ(ఆనంది)ని ఇబ్బందుల పాలు చేస్తాయి. ఒక వ్యక్తిని ప్రేమించి, మరో వ్యక్తిని పెళ్లాడిన సత్యభామకు అత్త నుంచి ఎదురయ్యే వేధింపులు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఆమె తల్లిదండ్రులు అనుకోకుండా వరదల్లో చిక్కుకు పోవడం షాక్ కలిగిస్తుంది. మరోపక్క ఆమె ఆ విషయంలో కాకుండా మరో విషయంలో పోలీసులను ఆశ్రయిస్తుంది. అయితే ఈ సత్యభామ పోలీసులను ఆశ్రయించడానికి గల కారణం ఏమిటి? ఆమెకి ఎదురైన ఎన్నో సమస్యలను ఆమె ఎలా ఎదుర్కొంది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఆనంది, తెలుగు అమ్మాయే అయినా తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె చేస్తున్న పాత్రలలో దాదాపుగా పక్కింటి అమ్మాయిగా… చాలా పద్ధతిగా కనిపించే లాంటి పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆకట్టుకుంది. అలాంటి అమ్మాయి ఒక్కసారిగా ఓ బోల్డ్ డైలాగ్ చెప్పడంతో అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది.. ఇక టైటిల్లో సూచించినట్లుగా ఈ సినిమాలో ఆనంది పోషించిన సత్యభామే శివంగి. ప్రేమించిన వాడిని కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న సత్యభామ అతనితో ఇష్టం లేని కాపురం చేస్తూ అతనికి అనారోగ్యం రావడంతో ఇబ్బందులు పడుతుంది. దానికి తోడు అత్త నుంచి వేధింపులు తల్లిదండ్రులు వరదల్లో చిక్కుకుపోవడం లాంటి ఎన్నో ఆటంకాలు ఎదురైతే వాటన్నింటినీ అధిగమించి శివంగిలా పోరాడి చివరికి ఎలా విజయం సాధించింది అనే లైన్ ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు. అసలు జరిగేది నిజమా కాదా అనే ఒక డౌట్ తో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా చూసే విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. సింగిల్ లోకేషన్ అయినా క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించడంలో డైరెక్టర్ కొంత మేర సక్సెస్ అయ్యాడు. ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదు అనే విషయాన్ని ఈ సినిమాతో ఒక మెసేజ్ లో చెప్పాలని ప్రయత్నం చేసిన దర్శకుడు అందులో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అయితే సినిమా చూస్తున్నంత సేపు సీరియల్ చూసిన ఫీలింగ్ కలగడం సినిమాకి కాస్త మైనస్ అయ్యే అంశం.. ఆ ఒక్క విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే సత్యభామగా ఈ సినిమాలో నటించిన ఆనంది నటన మనం గతంలోనే ఎన్నో చిత్రాలలో చూసినా ఎందుకు ఈ సినిమాలో అగ్రెసివ్ పాత్రలో కాస్త భిన్నంగా కనిపించింది..సినిమా అంతా ఆమెనే కనిపించినా, ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టకుండా తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రెండు చీరలలో సినిమా అంతా కనిపించే పాత్ర ఒప్పుకోవడం కష్టమైనా ఆమె సునాయాసంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది… పోలీస్ రోల్స్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ, ఈ సినిమాలో తెలంగాణ యాసతో వరలక్ష్మి శరత్ కుమార్ తనలో మరో కోణం కూడా ఉందని నిరూపించుకున్నారు. ఇక జాన్ విజయ్, కోయా కిషోర్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ తమ మార్క్ కనిపించేలా నటించి మెప్పించారు. టెక్నికల్ టీం విషయానికొస్తే ఈ సినిమాలో ముందుగా మాట్లాడుకోవాల్సింది ఆర్ట్ డిపార్ట్మెంట్ పని తీరు గురించి. మొత్తం సింగిల్ లొకేషన్ లో సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఆర్ట్ వర్క్ చాలా ముఖ్యం.. సినిమాకి తగ్గట్టుగానే తమదైన శైలిలో దాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు సంగీత దర్శకుడు. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ స్త్రీ శక్తిని చాటి చెప్పే ప్రయత్నం శివంగి.