NTV Telugu Site icon

Rewind Movie Review: టైం ట్రావెల్‌ ‘రివైండ్‌’ మూవీ ఎలా ఉందంటే?

Rewind

Rewind

Rewind Movie Review: సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా ‘రివైండ్‌ నేడు(అక్టోబర్‌ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో కళ్యాణ్ చక్రవర్తి దర్శక నిర్మాతగా పరిచయం అవుతున్నారు. టీజర్, ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

‘రివైండ్‌ కథ;
కార్తిక్‌(సాయి రోనక్‌) ఓ సాఫ్ట్‌వేర్‌. శాంతి(అమృత చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తను పని చేసే ఆఫీసులోనే ఆమె కూడా జాయిన్‌ కావడంతో స్నేహితులు అవుతారు. ఓ రోజు శాంతి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంటూ కార్తిని కాఫీ షాపుకు రమ్మని చెబుతుంది. అయితే కలిసే ముందు ఒక షాక్ ఇస్తుంది. ఆ షాక్ దెబ్బకు శాంతి వాళ్ల తాతయ్య(సామ్రాట్‌) కనిపెట్టిన టైం మిషన్‌ సహాయంతో కార్తిక్‌ ట్రైమ్‌ ట్రావెల్‌ చేసి 2024 నుంచి 2019కి వెళ్తాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి? అసలు కార్తి ట్రైమ్‌ ట్రావెల్‌ చేయాలని ఎందుకు అనుకున్నాడు? శాంతి వాళ్ల తాతయ్య కనిపెట్టిన టైమ్‌ మిషన్‌ కార్తిక్ ఇంటికి ఎలా చేరిది? అసలు కార్తిక్‌ గతం ఏమిటి? చివరకు శాంతి, కార్తిక్‌లు ఒకటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: టైం ట్రావెల్‌ సినిమాలు మనకు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాలు వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. రివైండ్ కూడా ఓటైం ట్రావెల్‌ స్టోరీ, టైం ట్రావెల్‌ కధకు ఓ మంచి ప్రేమ కథ మిక్స్ చేసి ఆకట్టుకునేలా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు కల్యాణ్‌. సినిమా ప్రారంభంలోనే సామ్రాట్‌ టైం ట్రావెల్‌ చేసి రావడం.. తన ఫ్యామిలీ కోసం వెతుకుతూ.. కారు ప్రమాదం జరగ్గానే మాయమైపోవడంతో కథపై మొదలైన ఆసక్తిని కంటిన్యూ చేస్తూ కథలోకి కార్తీక్, శాంతి పాత్రలు ఎంట్రీ ఇచ్చాక అసలు కథ మొదలవుతుంది. వీరిద్దరి మధ్య జరిగే క్యూట్‌ లవ్‌స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అయితే ఇంటర్వెల్‌ సయమానికి ప్రేక్షకుడి మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. వాటన్నింటికి సెకండాఫ్‌లో సమాధానాలు ఇచ్చాడు డైరెక్టర్. అయితే సినిమాను కొంచెం సేపు మిస్ అయినా అర్ధం కాదు కాబట్టి సినిమాను మిస్ కాకుండా చూడాలి. అయినా కొన్ని ప్రశ్నలు ఇంకా తొలుస్తూనే ఉంటాయి. అయితే లాజిక్స్ కి అందని కొన్ని అంశాలు సినిమాకు మైనస్. అయితే ఫస్టాఫ్‌ మొత్తాన్ని సెకండాఫ్‌లో చూపిస్తూ ఇచ్చిన కనెక్టివిటీ బాగుంది.

నటీనటుల విషయానికి వస్తే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ కార్తిక్‌ పాత్రలో సాయి రోనాక్ కరెక్ట్ గా సెట్ అయ్యాడు. పోష్ లవర్‌ బాయ్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. శాంతి పాత్రకు అమృత చౌదరి యాప్ట్. తెరపై చాలా అందంగా కనిపిస్తూనే నటనతో ఆకట్టుకుంది. అంతేకాక తెరపై హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్‌ అయింది. ఇక సురేష్, సామ్రాట్, వైవా రాఘవ, కేఏ పాల్ రాము వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. సాంకేతికంగా సినిమాకి మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తో సంగీత దర్శకుడు ఆకట్టుకున్నారు. పాటలు పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి రిచ్ లుక్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇక ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే కాస్త కన్ఫ్యూజ్ చేసే టైం ట్రావెల్ సినిమా.. ఆ తరహా సినిమాలు ఇష్టపడే వారికి నచ్చుతుంది.

Show comments