NTV Telugu Site icon

Ugram Movie Review: ఉగ్రం

Ugram

Ugram

Ugram Movie Review:  ‘అల్లరి’ నరేశ్ అనగానే కామెడీతోనే కదం తొక్కుతారు అనే నమ్మకం ఉండేది. అయితే నరేశ్ రూటు మార్చి నటునిగానూ తనదైన బాణీ పలికిస్తున్నారు. ‘మహర్షి’, ‘నాంది’, ‘మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇంతకు ముందు అల్లరి నరేశ్ తో ‘నాంది’ చిత్రం తీసి ఆకట్టుకున్న విజయ్ కనకమేడల ఈ సారి ‘ఉగ్రం’ అంటూ ఆయనతోనే సినిమా తీశారు. దాంతో ‘ఉగ్రం’పైనా కొన్ని అంచనాలు నెలకొన్నాయి. అలా కొందరిలో ఆశలు రేకెత్తిస్తూ రూపొందిన ‘ఉగ్రం’ శుక్రవారం విడుదలయింది.

‘ఉగ్రం’లో కథాంశం ఏమిటంటే- శివకుమార్ (నరేశ్‌) ఎగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్. తన కళ్ళ ముందు అన్యాయం జరిగితే సహించలేడు. ఒక్కోసారి చట్టానికి అతీతంగా సొంత నిర్ణయాలతో దోషులను శిక్షిస్తుంటాడు. వరంగల్ లో పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలోనే అపర్ణ (మీర్నా మీనన్)ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ పెళ్ళి ఆమె ఇంట్లో వాళ్ళకు ఇష్టం ఉండదు. ఎందుకంటే గతంలో ఆమె తండ్రి నరసింహ పటేల్ (శరత్ లోహితస్వ)కు శివకుమార్ కూ వైరం ఉంటుంది. పెళ్ళైన కొద్దిరోజులకే శివ, అపర్ణలకు కూతురు పుడుతుంది. ఆడపిల్లలను వేధిస్తున్న నలుగురు యువకులను శివ దండించడంతో వాళ్ళు అతని మీద పగ పడతారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత శివకుమార్ ఇంట్లో లేని సమయంలో వెళ్ళి అతని భార్యను దారుణంగా అవమానిస్తారు. తన వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెట్టిన వాళ్ళను శివ ఎలా శిక్షించాడు. దాని పర్యవసానంగా కిడ్నాప్ కు గురైన శివకుమార్ భార్య, కూతురు ఎలా చెర నుండి బయట పడ్డారు? అందుకోసం ప్రాణాలకు తెగించి, శివకుమార్ ఏం చేశాడన్నది మిగతా కథ.

‘నాంది’ సినిమాతో నరేశ్, విజయ్ కు కాస్తంత పేరొచ్చింది. ఆ కారణంగానే ఈ సినిమాకూ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే… ప్రచార సమయంలో దర్శక నిర్మాతలు చెప్పినట్టుగా ఈ సినిమా నిజానికి అంత కొత్త కథతో తెరకెక్కలేదు. కిడ్నాప్ డ్రామా రకరకాల మలుపులు తిరిగి చివరకు మెడికల్ మాఫియాతో ముగుస్తుంది. ఇలాంటి కథాంశాలతో సినిమాలు ఈ మధ్యలో ఎక్కువయ్యాయి. అయితే ఇందులో ఆర్టిఫిషియల్ బ్లడ్ తయారీ కోసం ఓ డ్రగ్ కంపెనీ చేసే అరాచకాలను చూపించారు. నరేశ్ మొదటి నుండి చెబుతున్నట్టుగానే ‘నాంది’ కంటే ఇంటెన్స్ తో ఈ పాత్రను చేశాడు. కానీ కథ ఆ స్థాయిలో లేదు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ బిగువుగానే సాగింది. మధ్యలో పాటలు గొప్పగా లేకపోయినా… కాస్తంత రిలీఫ్ నిచ్చాయి. బట్… హీరోహీరోయిన్ల బాండింగ్ గొప్పగా లేకపోవడంతో ఆ యా పాత్రల మీద సానుభూతి కలగడం కష్టం. అలానే పోలీస్ ఆఫీసర్ అని తెలిసి మరీ ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య అతన్ని అర్థం చేసుకోకపోవడం అంతగా నప్పదు. యాక్సిడెంట్ లో నరేశ్‌ కు వచ్చే డిసీజ్, అతన్ని మామూలు మనిషిని చేయడానికి డాక్టర్ సునీత (ఇంద్రజ) చేసే ప్రయత్నం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం కాస్తంత బెటర్.

ఇందులో ఇన్ స్పెక్టర్ శివకుమార్ పాత్రలో అల్లరి నరేశ్ తనదైన బాణీ పలికించారు. అసలు ఒకప్పుడు అల్లరి నరేశ్ అనగానే బక్కపలచగా ఉండి, కితకితలు పెట్టే కామెడీయే కనిపించేది. ఇందులో గతంలో తాను పోషించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ కు తగ్గ పర్సనాలిటీతో నరేశ్ నటించడమే ఆసక్తి కలిగిస్తుంది. దానికి తోడు యాక్షన్ సీన్స్ కూడా కష్టపడి చేశాడు. నరేశ్ వాయిస్ లో డెప్త్ రావడం కోసం ఏదో గిమ్మిక్ చేసినట్టుగా అనిపిస్తోంది. ‘క్రేజీ ఫెలో’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ మీర్నా మీనన్ కు నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఈ సినిమాలో లభించింది. దీని తర్వాత కూడా ఆమెకు ఇదే తరహా పాత్రలు లభించే ఆస్కారం ఉంది. డాక్టర్ గా ఇంద్రజ, పోలీస్ అధికారిగా శత్రు కీలక పాత్రలు పోషించారు. కన్నడ నటుడు శరత్ లోహితస్వను సరిగా ఉపయోగించుకోలేదు. బేబీ ఊహ చక్కగా నటించింది. ఇతర పాత్రలను రూపాలక్ష్మీ, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ సాయి, మణికంఠ వారణాసి, నాగమహేశ్, రమేశ్ రెడ్డి, కౌశిక్ మహత తదితరులు పోషించారు. అబ్బూరి రవి మాటలు ఆకట్టుకుంటాయి. నైట్ ఎఫెక్ట్స్ లోనే సినిమా చాలా భాగం సాగింది. ఆ మూడ్ ను సిద్ధార్థ్ తన కెమెరాపనితనంతో బాగా ఎలివేట్ చేశాడు. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం మూవీకి స్పెషల్ అట్రాక్షన్. ‘నాంది’ కారణంగా ‘ఉగ్రం’పై అంచనాలు పెరగడం కొంత మైనస్ అనే చెప్పాలి. టైటిల్ కు న్యాయం చేకూర్చాలి అన్నట్టుగా యాక్షన్ సీన్స్ మరీ ఎక్కువ రక్తపాతం చూపించారు. లేదంటే.. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీతో కొంతలో కొంత కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది.

ప్లస్ పాయింట్స్:
నరేశ్‌ నటన
ఆకట్టుకునే స్క్రీన్ ప్లే
శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం
బలహీనమైన సెంటిమెంట్ సీన్స్
అపరిమితమైన హింస

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: మహోగ్రం!

Show comments