ఎనిమిదేళ్ళ కెరీర్ లో నాలుగు సినిమాలతో సాగిన అఖిల్ అక్కినేని మొత్తానికి ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో ఓ సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా తరువాత వచ్చిన చిత్రం కాబట్టి ‘ఏజెంట్’పై అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే అఖిల్ కూడా నటించినట్టు ట్రైలర్స్ చాటాయి. అఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించడం, మొన్న విజయవాడలో ఎంతో ఎత్తు నుంచి దూకడం వంటి ఎట్రాక్షన్స్ ‘ఏజెంట్’ను ఆసక్తిగా నిలిపాయి.
ఇంతకూ ‘ఏజెంట్’ కథ ఏమిటంటే – రిక్కీ (అఖిల్) ఓ ఎథికల్ హ్యాకర్. ఏ రోజుకైనా ‘రా’ ఏజెంట్ గా మారి దేశానికి సేవలు అందించాలన్నది అతని లక్ష్యం! అందుకోసం ఎగ్జామ్స్ రాస్తాడు కానీ మూడు సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాడు. బట్… అతనికి ‘రా’ ఛీఫ్ కల్నల్ మహదేవ్ / డెవిల్ (మమ్ముట్టి) అంటే ఎంతో ఇష్టం. రాజకీయ నాయకులను సైతం ప్రభావితం చేస్తూ సమాంతరంగా పాలన చేస్తున్న ఓ కార్పోరేట్ సిండికేట్ అరాచకాలు డెవిల్ దృష్టిలో పడతాయి. దేశంలో పలు దారుణాలకు పాల్పడుతూ ఆ సిండికేట్ అంతర్జాతీయంగా తన ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తుంది. వారి పన్నాగాలను అడ్డుకోవాలని డెవిల్ భావిస్తాడు. అందుకోసం తన శిష్యుడైన ధర్మతేజ / గాడ్ (డెమో మోరియా) కు రంగంలోకి దింపుతాడు. కొన్నేళ్ళ పాటు డెవిల్ కనుసన్నల్లో మెలిసిన గాడ్ కు సెండికేట్ అధినేత కావాలనే కోరిక కలుగుతుంది. అంతేకాదు… చైనాతో చేతులు కలిపి, ఈ దేశాన్నే అతలాకుతలం చేయాలని అనుకుంటాడు. అతని ఆగడాలకు రిక్కీ ద్వారా డెవిల్ ఎలా చెక్ పెట్టాడు? ఈ క్రమంలో అతనికి ఏమైంది? ‘రా’ ఏజెంట్ గా తన ప్రతాపం చూపాలనుకున్న రిక్కీ ఈ ఎసైన్ మెంట్ కోసం ఏం చేశాడు? అనేది మిగతా కథ.
ఇలాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్స్ లో కథకు పెద్దంత ప్రాధాన్యం ఉండదు. అయితే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. దానికి తోడుకు కొన్ని సెంటిమెంట్స్ సీన్స్ పెట్టేస్తే… ప్రేక్షకులు సులువుగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ వరకూ ఓకే కానీ మిగిలిన అంశాలేవీ లేవు. హీరోకు తల్లిదండ్రులతో ఉండే బాండింగ్ కానీ, ప్రియురాలితో ఉండే అటాచ్ మెంట్ కానీ ఏదీ కూడా సరిగా తెరకెక్కలేదు. దాంతో ఇదంతా ‘రా’ ఏజెంట్ కావడం కోసం ఓ కుర్రాడు చేసే పిచ్చిచేష్ఠాలుగా మిగిలిపోయింది. నిజానికి ‘ఏజెంట్’ టైటిల్ లోనే హీరో ఏం చేస్తాడో తెలిసిపోతోంది. బట్.. సురేందర్ రెడ్డి ఈ కథను నడిపిన తీరు పరమ సాదాసీదాగా ఉంది. యాక్షన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో రొమాన్స్ కు చోటు లేకుండా పోయింది. దాంతో సాక్షి వైద్య పోషించిన హీరోయిన్ పాత్ర తేలిపోయింది. వక్కంతం వంశీ కథల్లో పాతకే కొత్త నగిషీలు చెక్కే ప్రయత్నం చేస్తాడు.’ఏజెంట్’ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫి అలరిస్తుంది. హిప్ హాప్ తమిళ స్వరకల్పనలోని పాటలు బాగాలేవు. భీమ్స్ సిసిరోలియో బాణీల్లో రూపొందిన “వైల్డ్ సాలా…” సాంగ్ రెగ్యులర్ ఐటమ్స్ లాగే ఉంది. గత చిత్రాలతో పోలిస్తే అఖిల్ నటనలో పరిణతి కనిపించింది. యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. మమ్ముట్టి తన పాత్రకు తగ్గ న్యాయం చేశారు. డినో మోరియా తనదైన బాణీ పలికించారు. చెప్పుకోవడానికి నటీనటులు చాలా మంది ఉన్న ఎవరినీ సరిగా ఉపయోగించుకోలేదు. ఇలాంటి సాదాసీదా కథకోసమా అఖిల్ ఇంతగా కష్టపడింది అనిపిస్తుంది. అతను ఈ కథలో ఏం కొత్తదనం చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో అర్థమే కాదు. అనిల్ సుంకర నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. కానీ కథ, కథనాల విషయంలో దారుణం జరిగిపోయింది. అక్కినేని అభిమానులు సైతం భారీ అంచనాలతో వెళితే నిరాశకు గురికాక తప్పదు.
ప్లస్ పాయింట్స్:
– అఖిల్ కొత్తగా కనిపించడం
– ప్రధాన పాత్రధారుల అభినయం
– మేకింగ్ వేల్యూస్
– యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– సాగదీసినట్టున్న సన్నివేశాలు
– అంతగా ఆకట్టుకోని సంగీతం
– పూర్ క్లైమాక్స్
ట్యాగ్ లైన్: అన్ ప్రెడిక్టబుల్ ‘సాలా’!