12th Fail Telugu Movie Review: ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేయడం సర్వసాధారణం. అలానే ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 12త్ ఫెయిల్ అనే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. రేపు అంటే శుక్రవారం నాడు రిలీజ్ కావలసిన ఈ సినిమాను తెలుగులో ముందుగానే రిలీజ్ చేశారు మేకర్స్. నిర్మాత-దర్శకుడు విధు వినోద్ చోప్రా డైరెక్షన్లో ఈ సినిమాలో విక్రాంత్ మాసే హీరోగా నటించారు. 12త్ ఫెయిల్ అనేది ఒక ఐపీఎస్ కథతో తెరకెక్కిన బయోపిక్ మూవీ. అదే పేరుతో అనురాగ్ పాఠక్ రాసిన బెస్ట్ సెల్లర్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలో చంబల్ ప్రాంతానికి చెందిన ఒక బాలుడు 12వ తరగతిలో ఫెయిల్ అయ్యి తర్వాత డీఎస్పీ అవ్వాలని బయలుదేరి ఢిల్లీకి వచ్చి, UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎలా పోలీసు అధికారి అవుతాడు అనే లైన్ తో తెరకెక్కించారు. విధు వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా ఆయన మున్నాభాయ్ MBBS, 3 ఇడియట్స్ లాగా వారి బ్యానర్‌లో గతంలో నిర్మించిన చిత్రాల మాదిరిగానే అనిపించింది. ఇక ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథ :
’12త్ ఫెయిల్’ 12వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయి తరువాత IPSగా ఎదిగిన ఒక అధికారి స్ఫూర్తిదాయకమైన కథ. మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లోని ఒక బాలుడు మనోజ్ కుమార్ శర్మ(విక్రాంత్ మాసే) తన 12వ తరగతి పరీక్షలలో ఫెయిల్ అవుతాడు. దానికి కారణం కొత్త డిపిఎస్ దుష్యంత్ సింగ్ (ప్రియాన్షు ఛటర్జీ) బోర్డ్ పరీక్షలలో విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉపాధ్యాయులను ఆపడమే. మరుసటి సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్‌లో మూడో క్లాస్ తో మనోజ్ పాస్ అయ్యాడు. అదే దుశ్యంత్ ను రోల్ మోడల్ అనుకుని ఆయన లాగే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ కావడానికి ఢిల్లీకి చేరుకున్నాడు. అతనికి ఈ పరీక్షకు అవసరమైన అంకితభావం ఉంది, కానీ అలా చేయడానికి అతనికి అధ్యయన నైపుణ్యాలు లేవు. యూపీఎస్సీలో ఐఏఎస్, ఐపీఎస్ ప్రొఫైల్ లాంటివి ఉన్నాయని కూడా ఆయనకు తెలియదు. అలాంటి మనోజ్ తన గురువుగా భావించే గురు(అన్షుమాన్ పుష్కర్), ప్రేయసి శ్రద్ధా జోషి (మేధా శంకర్) సహాయంతో తన కలను ఎలా సాకారం చేసుకున్నాడనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
’12త్ ఫెయిల్’ సినిమా కథ ముంబైలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అయిన మనోజ్ కుమార్ శర్మ కథ. ఆయన ముంబై క్యాడర్‌కు చెందిన 2005 బ్యాచ్ అధికారి. నిజానికి ఇలా ఐపీఎస్ అధికారుల కధలు అనగానే తమ వర్కింగ్ స్టైల్‌తో హీరోలుగా మారాలనుకునేలా అనిపించే ఇతర క్రైమ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల కంటే ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అసలు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా తన మన బేధాలు లేకుండా పని చేయడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, అధికారి విధి. అయితే అప్పటివరకు అలాంటి వారిని చూడకుండా మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీసు అధికారి అలా పని చేయడం చూసినప్పుడు, మనోజ్ అతనిని చూసి ముగ్ధుడయ్యాడు. తన జీవితంలో మొదటిసారిగా, కాపీ కొట్టడం మంచిది కాదని చెప్పడంతో నిజాయితీగా చదివి థర్డ్ క్లాసులో పాసవుతాడు. అలా గ్రాడ్యుయేషన్ అయ్యాక ఢిల్లీకి వెళ్లి ఎన్నో కష్టాలు పడి ఖాకీ యూనిఫాం ధరించి ఇంటికి తిరిగి వస్తాడు. చెప్పుకోడానికి సింపుల్ లైన్ లాగానే అనిపిస్తున్నా ఈ సినిమా ఆద్యంతం నవ్విస్తుంది, ఆలోచింపచేస్తుంది. ఎన్నో ఎమోషనల్ హై మూమెంట్స్ తో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ ’12త్ ఫెయిల్’ మనకు సాధ్యం కానిది ఏదీ లేదని, మనోజ్ కుమార్ చేయగలిగితే మనం కూడా చేయగలమని మనకి బలమైన సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ఏ సమయంలోనైనా, మనం విఫలమయ్యామని భావిస్తే, ఆగిపోకుండా ‘రీస్టార్ట్’ చేయాల్సిన అవసరం ఉందని ఒక న నిగూఢ సందేశం బాగుంది.
నటీనటుల విషయానికి వస్తే మనోజ్ కుమార్ గా విక్రాంత్ మాస్సే తన పాత్రను పూర్తి నమ్మకంతో పోషించాడు. ప్రతి విషయంలోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేసేలా నటన ఉంది. ప్రియాంషు ఛటర్జీ డిసిపిగా తన చిన్న పాత్రతో కూడా గుర్తుండిపోతాడు. తన సీనియర్ ఆఫీసర్‌గా మనోజ్‌ని కలిసే సన్నివేశంలో నటుడిగా ఆయన పనితనం కనిపించింది. మనోజ్ తల్లిదండ్రులుగా, గీతా అగర్వాల్ శర్మ, హరీష్ ఖన్నా కూడా చిన్న పాత్రలలో తమదైన ముద్ర వేశారు. ఒక్కరేమిటి ప్రియాంషు ఛటర్జీ, హరీష్ ఖన్నా, అన్షుమన్, అనంత్ జోషి, మేధా శంకర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఒక పుస్తకాన్ని సినిమాగా ప్రజల ముందుకు తీసుకురావాలంటే, ఎఫెక్టివ్ స్క్రీన్‌ప్లే అవసరం. విధు వినోద్ చోప్రా ఈ పనిలో ఆరితేరాడు అనిపించింది. 2020లో విడుదలైన కాశ్మీర్ పండిట్ల కథ ఆధారంగా విధు వినోద్ చోప్రా తీసిన షికారా సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. 3 సంవత్సరాల తర్వాత ఆయన 12త్ ఫెయిల్ సినిమాని విడుదల చేశారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో, అతను మనోజ్ మరియు శ్రద్ధా మధ్య రొమాన్స్ చూపించగలిగాడు కానీ మసాలా-డ్రామా అనే మసాలా లేకుండా, ఎమోషన్స్‌ని సరిగ్గా ఉపయోగించుకుని ఈ సినిమా తీసి, చాలావరకు సక్సెస్ అయ్యాడు. రంగరాజన్ రామభద్రన్ ఈ సినిమాకిసినిమాటోగ్రాఫర్ ఒక్క మాటలో సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అది చంబల్‌లోని చిన్న గ్రామమైనా, మనోజ్ ఇల్లు అయినా లేదా ఢిల్లీలోని ముఖర్జీ నగర్ అయినా, కెమెరా లెన్స్ ద్వారా సాధ్యమైనంత గ్రాండ్ గా షూట్ చేశారు. విధు వినోద్ చోప్రా స్వయంగా ఈ సినిమా ఎడిటింగ్‌కి పనిచేశారు, అది క్రిస్పీగా ఉంది. అయితే తెలుగు డైలాగ్స్ అందించిన వారిని కూడా మెచ్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే మన నేటివిటీకి తగ్గట్టుగా వాటిని సెట్ చేశారు.
ఫైనల్ గా: ఈ ’12త్ ఫెయిల్’ మనకు సాధ్యం కానిది ఏదీ లేదని చెప్పే ఒక రీ స్టార్టింగ్ పిల్.. జీవితంలో ఏదైనా సాధించాలని అనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్.