OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..

  • తాడేపల్లిగూడెం వైసీపీలో తారా స్థాయికి విభేదాలు
  • జూనియర్‌ ఇన్ఛార్జ్‌ వర్సెస్‌ సీనియర్‌ లీడర్‌
  • ఓటమి తర్వాత కొట్టును తప్పించి వడ్డీ రఘురామ్‌కు బాధ్యతలు
  • ఛాన్స్‌ మిస్‌ అవకూడదన్న పట్టుదలగా వడ్డీ రఘురామ్‌
Otr

Otr

OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో జూనియర్ వర్సెస్ సీనియర్ అన్నట్టుగా మారిపోయిందట వాతావరణం. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ వడ్డీ రఘురాం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టు చెబుతున్నారు పార్టీ నాయకులు. ఇటీవల జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం సాక్షిగా రెండు వర్గాలు బహిరంగ సవాళ్లకు దిగడం చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కొట్టు సత్యనారాయణ. 2024లో ఓటమి తర్వాత అధినేత ఆయన్ని ఇన్చార్జ్‌ పదవి నుంచి తొలగించి అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాంకు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య వర్గ విభేదాలు పెరిగిపోయాయి.

ఉన్న అవకాశాన్ని పోగొట్టుకుని కొట్టు ఫ్రస్టేషన్‌లో ఉంటే… వచ్చిన ఛాన్స్‌ని వీలైనంతగా వాడుకోవాలన్న తాపత్రయంతో వడ్డే రఘురాం అడుగులు వేస్తున్నారు. దీంతో ఎవరి కుంపటి వారిదే అన్నట్టుగా మారిపోయింది వ్యవహారం. పార్టీని బలోపేతం చేసే విషయంలో కాస్త దూకుడు చూపిస్తున్న ఇన్ఛార్జ్‌…. మాజీ డిప్యూటీ సీఎంని పట్టించుకోకపోవడం తాడేపల్లిగూడెం ఫ్యాన్‌ పార్టీలో వర్గ పోరును పెంచుతోందని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం దగ్గర్నుంచి, జాయినింగ్స్ పెంచే విషయంలోనూ రఘురామ్‌ జాగ్రత్తగా వ్యవహరిస్తూ… తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నారట. వచ్చే ఎన్నికల నాటికి అభ్యర్థిగా తానే ప్రొజెక్ట్‌ అవ్వాలన్నది ఆయన టార్గెట్‌ అని చెబుతున్నారు. అదే సమయంలో వడ్డీకి కొట్టు గట్టిగానే అడ్డు తగులుతున్నారన్నది లోకల్‌ పార్టీ టాక్‌. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని చెవులు కొరుక్కుంటున్నారు ఇక్కడి వైసీపీ కార్యకర్తలు.

తాడేపల్లిగూడెం వైసీపీకి ప్రత్యర్ధులు కూటమి నాయకులు కాదని, సొంత పార్టీ నేతలే కత్తులు దూసుకుంటూ వేరే వాళ్లతో పని లేదన్నట్టు వ్యవహరిస్తుంటారన్నది ఇప్పుడున్న అభిప్రాయం. వైఎస్‌ జయంతి విషయంలోనే ఈ విషయం కొట్టొచ్చినట్టు కనిపించిందని అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్‌ చేయాల్సినంత రేంజ్‌లో కొత్త ఇన్ఛార్జ్‌ చేయలేకపోతున్నారంటూ కొట్టు సత్యనారాయణ కామెంట్‌ చేస్తున్నారట. నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉందని.. దాన్ని వాడుకోకుండా… నా రూటే సపరేటు అన్నట్టుగా వడ్డీ వ్యవహరిస్తున్నారని అంటున్నారట. అక్కడితో ఆగకుండా… చెప్పుడు మాటలు విని ఇన్ఛార్జ్‌ పదవి విషయంలో చేసిన తప్పును పార్టీ అధ్యక్షుడు జగన్‌ త్వరలోనే తెలుసుకుంటారంటూ కొట్టు చేసిన కామెంట్స్‌ గూడెం వైసీపీలో కలకలం రేపుతున్నాయి. దీనికి కౌంటర్‌గా వడ్డీ వర్గం కూడా ఘాటుగానే స్పందించిందట. చూపాల్సినంత ప్రతాపం చూపలేకపోవడం వల్లే అధినేత మిమ్మల్ని పక్కన పెట్టారని అంటూ… ఇప్పుడు పార్టీ బలం పుంజుకుందంటే అది మా పనితనం అంటూ కౌంటర్స్‌ ఇస్తున్నారు.

సీనియర్ నాయకుడిగా పార్టీ బలోపేతానికి పని చేయాలి తప్ప…. పనిచేస్తున్న నాయకులపై సెటైర్లు వేస్తూ చులకన చేయవద్దని అంటున్నారు. తాడేపల్లిగూడెంలో పార్టీ బలంగా ఉందని చెప్పుకొస్తున్న మాజీ డిప్యూటీ.. తన తోటి మాజీ మంత్రులపై దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నిస్తోంది ఇన్ఛార్జ్‌ వర్గం. కాపుల సభకు హాజరైన కొట్టు సత్యనారాయణ దాడులకు గురైన సహచరులను పలకరించే విషయంలో ఎందుకు వెనుక పడ్డారు అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. వైసీపీ ఇప్పుడు బలంగా ఉందని చెబుతున్న నాయకులు 2014లో ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ రకంగా విమర్శలు, ప్రతి విమర్శలతో తాడేపల్లిగూడెం వైసీపీలో కాక పెరుగుతోంది. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఫాలో అవ్వాల్సిన మాజీ డిప్యూటీ సీఎం అవకాశం కోసం చేస్తున్న పోరాటాన్ని పార్టీ పెద్దలు ఏరకంగా చూస్తారన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్‌ టాపిక్‌.