చింతల రామచంద్రారెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే. గత రెండు ఎన్నికల్లో వరసగా వైసీపీ నుంచి గెలిచారు. అంతకుముందు వాయల్పాడు ఎమ్మెల్యేగానూ పనిచేశారు చింతల. ఈ సీనియరిటీ రాజకీయంగా కలిసొస్తుందని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటున్నారట ఎమ్మెల్యేలు. పైగా పీలేరులో నల్లారి కుటుంబంపై గెలవడంతో వైసీపీలో గుర్తింపునకు కొదవే ఉండదని అనుకున్నారట. అయితే జరుగుతున్న పరిస్థితులు.. ఆశలు నెరవేరకపోవడం ఎమ్మెల్యేను కుంగతీస్తున్నట్టు సమాచారం. ఆ ఆవేదనలోనూ కూరుకుపోతున్నారట.
2019లోనే కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించారు. మొన్నటి కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపైనా ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూశారు చింతల. సీఎం జగన్‌ను కలిసి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు కూడా. తనతోపాటు రాజకీయాల్లోకి వచ్చినవారు.. తనకంటే జూనియర్లు రాజకీయ పదోన్నతులతో ముందుకెళ్తుంటే.. తాను ఎమ్మెల్యే పదవి దగ్గరే ఆగిపోయాయని సన్నిహితులకు చెప్పి వాపోతున్నారట. మంత్రి పదవి రాకపోయినా.. ఏదైనా నామినేటెడ్ పోస్ట్.. టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని ఎదురు చూశారు. పదవుల పందేరం వచ్చిన ప్రతీసారి చింతల ఆశలకు రెక్కలొచ్చేవి. అక్కడ పేరు లేదని తెలియగానే ఎమ్మెల్యే శిబిరం డీలా పడేది.
నల్లారి కుటుంబాన్ని గట్టిగా ఎదుర్కొంటున్నా వైసీపీ పెద్దలు చింతల రామచంద్రారెడ్డిని ఎందుకు గుర్తించడం లేదో అనుచరులకు అర్ధం కావడం లేదట. ఇదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన డాక్టర్ అహ్మద్‌ను మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే శిబిరం మరింత రగిలిపోతోందట. ముందు నుంచీ ఉన్నవారికి కాకుండా.. వేరేవారికి పదవులు కట్టబెడితే ఎన్నికల్లో మొదటికే మోసం రావొచ్చని అంతర్గత సమావేశాల్లో హెచ్చరిస్తున్నట్టు సమాచారం. పీలేరులో టీడీపీ పుంజుకునే పరిస్థితులు తీసుకురావొద్దని చెబుతున్నారట.
పీలేరులో ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డికి ఒక వర్గం ఉంది. ఎమ్మెల్యే చింతల వర్గం మరొకటి. ఇప్పుడు డాక్టర్ అహ్మద్ సైతం మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారట. దీంతో మూడు వర్గాల మధ్య పోరు ఓ రేంజ్‌లో ఉన్నట్టు సమాచారం. పైగా పార్టీ సమావేశాల్లో తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే చింతల. పెద్దిరెడ్డి కంటే ముందే అసెంబ్లీలో అడుగుపెట్టినా మంత్రి పదవి రాలేదని చెబుతున్నారట. ఈ బాధను లోలోపలే దిగమింగుకుంటూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నరట ఎమ్మెల్యే. మరి.. చింతల చింత ఎప్పటికి తీరుతుందో చూడాలి.