అధికారానికో… అర్ధబలానికో భయపడ్డ అక్కడ జనం.. ఎమ్మెల్యేకు ఎదురు చెప్పడం మానేసి చాలా కాలమైంది. అటువంటి శాసనసభ్యుడికి సొంత పార్టీ నుంచే రీసౌండ్ మొదలైందట. దీంతో కాలపరీక్షలో రాజుగారు గెలుస్తారా.. ఓడతారా.. అనే చర్చ జోరందుకుంది.
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి ఆరున్నొక్కరాగం అందుకుంది. MLA యూవీ రమణమూర్తిరాజుకు వ్యతిరేకంగా ద్వితీయశ్రేణి కుంపట్లు రాజేస్తోంది. ఏ పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం, నాయకత్వంపై పెత్తనం చెలాయించడం ఎమ్మెల్యే అలవాటు. ఈ అధిపత్య ధోరణే రమణమూర్తిరాజుకు రివర్స్ కొడుతోందట. ఆయన ఇమేజ్ మసకబారుతోందనే చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం అచ్యుతాపురం మండలస్థాయి నాయకత్వం ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేసింది. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు, అక్రమ క్వారీలు, ఇసుక తవ్వకాలపై విచారణ జరిపించాలని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. విచారణ ప్రారంభమైందని భోగట్టా. వీటిని ధీటుగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యే భావించడంతో రాద్దాంతం రసకందాయంలో పడింది.
సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి దృష్టికి యలమంచిలి రగడ వెళ్లడంతో ఇరువర్గాలను పిలిచి సున్నితంగానే హెచ్చరించారట. మరోసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని ఎమ్మెల్యేకు కాస్త గట్టిగానే చెప్పినట్టు సమాచారం. దీంతో ఆయన ఓ అడుగు వెనక్కి తగ్గినట్టే కనిపించారు. అయితే.. పార్టీకి నష్టం జరగకుండా రాజుగారి యవ్వారం అటో ఇటో తేల్చుకోవాలనే పట్టుదల ద్వితీయ శ్రేణిలో బలంగా కనిపిస్తోందట. గడపగడపకు వెళుతున్న ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇటీవల అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామంలో పర్యటించిన రమణమూర్తిరాజును స్థానిక నాయకత్వం నిలదీసింది. మొదటి నుంచి వైసీపీ జెండా మోసిన వారిని కాదని.. ఇటీవల వచ్చిన వారికి ఎలా ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే ఆధిపత్య ధోరణి వల్ల జిల్లా పార్టీ నాయకత్వం యలమంచిలి వైపు కన్నెత్తి చూడటం లేదట. ఆ మధ్య నియోజకవర్గానికి చెందిన కొందరు పార్టీ నాయకులు మంత్రులు అమర్నాథ్‌తోపాటు బూడి ముత్యాలనాయుడిని కలిసి మాట్లాడారు. దానిని ఎమ్మెల్యే పాయింట్ అవుట్ చేశారట. తనను కాదని అక్కడకు ఎలా వెళ్తారని రమణమూర్తిరాజు కస్సుమనడంతో యలమంచిలి వైసీపీలో ముసలం ముదిరినట్టు టాక్. అలాగే ఎమ్మెల్యే ఆహ్వానించినా.. మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు యలమంచిలి రావడం లేదనే వాదన ఉంది. ఈ నెల మొదట్లో భారీ మంచినీటి పథకానికి శంకుస్థాపన జరిగింది. ఆహ్వాన పత్రికలో మున్సిపల్ మంత్రి, ఇంఛార్జ్ మంత్రితోపాటు జిల్లాకు చెందిన మంత్రుల పేర్లు ఉన్నాయి. కానీ.. ఎంపీ సత్యవతి తప్ప మిగతావారు ఎవరూ ఆ కార్యక్రమానికి రాలేదు. యలమంచిలి వైసీపీలో ఉన్న అంతర్గత రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే మంత్రులు లైట్ తీసుకున్నారని అభిప్రాయ పడుతున్నారు.
వాస్తవంగా ఈ పరిణామాలు ఏవీ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు ఎప్పుడూ ఊహించి కూడా ఉండరు. ప్రస్తుతం మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలంటే.. యలమంచిలిలో ఎమ్మెల్యే అభ్యర్థి మారిపోవాలనే నినాదం వినిపిస్తోంది. ఇప్పుడంతా సర్వేల కాలం. ఎక్కడ తేడా వచ్చినా మొదటికే మోసం తప్పదు. నియోజకవర్గాల వారీగా సీఎం జగన్ ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తున్నారు. నియోజకవర్గ వైసీపీలో రగడ కూడా అధినేత నజర్‌లో ఉంటుందని.. అభ్యర్థి ఎంపికలో అవి కీలకంగా మారతాయని కేడర్ లెక్కలేస్తోందట. మరి.. వచ్చే ఎన్నికల నాటికి ఈ రీసౌండ్ ఏ స్థాయిలో పెరుగుతుందో.. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.