Erasu Pratap Reddy : దశాబ్దకాలంగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న మాజీ మంత్రి.. ఇప్పుడు మల్లన్నపై ఆన అంటున్నారు. పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తారట. మాజీ మంత్రికి ఛాన్స్ ఇస్తే అక్కడ ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? పార్టీ ఎవరివైపు మొగ్గు చూపుతుంది? లెట్స్ వాచ్..!
ఏరాసు ప్రతాపరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఏరాసు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. గతంలో ఆత్మకూరు, శ్రీశైలం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఆత్మకూరు పోయి.. శ్రీశైలం రావడంతో అక్కడా పాగా వేశారు. రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో పొలిటికల్ మూడ్ గమనించి.. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి టీడీపీ కండువా కప్పేసుకున్నారు ఏరాసు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పాణ్యంలో పోటీ చేసి ఓడిపోయారు. 2014-2019 మధ్య పాణ్యం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నప్పటికీ చురుకైన పాత్ర పోషించలేదు. కేడర్‌కు అందుబాటులో లేరనే చర్చ నడిచింది. 2019లో మాజీ మంత్రికి టీడీపీ టికెట్ దక్కలేదు. దాంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఏరాసు.
ఇప్పుడు ఏరాసు ప్రతాప్‌రెడ్డి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావాలని చూస్తున్నారట. పాత సీటు శ్రీశైలంపై కర్చీఫ్ వేసినట్టు సమాచారం. టీడీపీలో చేరాక పాణ్యం షిఫ్ట్ అయినా అక్కడికి చుట్టపు చూపుగానే వెళ్తున్నారట. ఆత్మకూరులో సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే శ్రీశైలం మల్లన్నే తనకు దిక్కు అనుకున్నారో ఏమో.. ఆత్మకూరులోని తన ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారట. ఆత్మకూరులో ఉంటూనే శ్రీశైలంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారట ఏరాసు. చంద్రబాబుకు ఒక విన్నపం కూడా చేశారట. అక్కడి నుంచి సమాధానం ఏం వచ్చిందో ఏమో.. మాజీ మంత్రి మాత్రం శ్రీశైలంలో తన పాత పరిచయాలను పునరుద్ధరించుకునే పనిలో పడ్డారట.
ప్రస్తుతం శ్రీశైలం టీడీపీ ఇంఛార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. ఆ విషయం ఏరాసుకు తెలియంది కాదు. రాజశేఖర్‌రెడ్డి ఇంఛార్జ్‌గా ఉన్నా.. యాక్టివ్‌గా లేరనే టాక్ నడుస్తోంది. ఇందుకు రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్వీప్ చేసేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో తనకు టీడీపీ ఛాన్స్ ఇవ్వొచ్చనే అభిప్రాయంలో ఏరాసు ఉన్నారట. అయితే టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో రాజశేఖర్‌రెడ్డి చురుకుగా పాల్గొనడంతో సమీకరణాలు మారుతున్నాయనే వాదన ఉందట.
శ్రీశైలంలో ఏరాసు ఎంట్రీతో టీడీపీలో రచ్చ మొదలవుతుందనే చర్చ జరుగుతోంది. ఇది గమనించిన మాజీ మంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను టీడీపీలోనే ఉంటానని.. పార్టీ మారేది లేదని చెబుతున్నారట. పైగా వైసీపీ టికెట్ ఆఫర్ చేసినా.. డబ్బులు ఇస్తామని చెప్పినా అక్కడికి వెళ్లబోనని స్పష్టత ఇస్తున్నారట. దీంతో టీడీపీ టికెట్ కోసం ఏరాసు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారా లేదా అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. టీడీపీ టికెట్ అడుగుతూ.. వైసీపీ ప్రస్తావన ఎందుకు అనేది కొందరి ప్రశ్న. మరి.. శ్రీశైలం టీడీపీలో ఏం జరుగుతుందో చూడాలి.