కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు.. ఉద్యోగుల బదిలీలు ఉన్నాయా? తెలంగాణ సాధించుకున్నామన్న సంతోషం ఆవిరై.. కొత్త సమస్యను తలెకెక్కించుకున్నామనే భావనలో ఉద్యోగులు ఉన్నారా? ఇంతకీ కొత్త జోనల్ విధానం ఉద్యోగులకు వరమా.. శాపమా..?
ఉద్యోగులకు అన్యాయం జరగకూడదన్న ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదా?
తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఇదే అదునుగా కొందరు అధికారులు పారదర్శకతకు పాతరేస్తూ అయిన వారిని అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియార్టీ పేరుతో కొందరికే పట్టం కడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ఒక్క ఉద్యోగికీ అన్యాయం జరగకుండా సర్దుబాటు ప్రక్రియను సీనియార్టీ ప్రాతిపదికగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా క్షేత్రస్థాయిలో పట్టించుకోవడం లేదట. నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే జాబితాల్లో పేర్లను ఇష్టానుసారంగా మార్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియార్టీ జాబితాల్లో మార్పులు చేస్తూ అర్హులకు కొన్ని శాఖలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.
63 ప్రభుత్వ శాఖల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులు..!
95 శాతం స్థానికులకు.. 5 శాతం నాన్‌లోకల్‌కు ఉండాలన్నది ప్రభుత్వ ఆదేశం..!
ప్రభుత్వంలోని 63 శాఖల్లో సుమారు నాలుగున్నర లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో రెండున్నర లక్షలమంది ఉద్యోగుల విభజన, బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఈ ప్రక్రియే పాలకులకు తలనొప్పిగా మారింది. పలుశాఖల్లో కీలకమైన పోస్టుల్లో ఉన్న ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందట. ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులకు రేపోమాపో పోస్టింగ్ ఖరారు కానుంది. అయితే ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోవడం లేదని.. సీనియార్టీని చూడటంతో జూనియర్లకు అన్యాయం జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. పాత ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ ఉన్నందున.. జిల్లాల్లోని ఉద్యోగులు నష్టపోతారన్నది ఉద్యోగ సంఘాల నేతల వాదన. అన్ని గ్రామాలను జనాభా ప్రాతిపదికగా నాలుగు గ్రేడ్లుగా విభజించిన తర్వాత ఉద్యోగుల పంపిణీ జరపాలని… స్థానికులకు 95 శాతం, నాన్ లోకల్స్‌కు 5 శాతం కోటా ఉండాలని ఆదేశించింది ప్రభుత్వం. ప్రస్తుత ప్రక్రియలో ఆ విధానానికి పాతర వేశారట.
కొన్ని ఉద్యోగ సంఘాల నేతల కనుసన్నల్లో బదిలీలు, విభజన ప్రక్రియ..?
కేటాయించిన పోస్టులకన్నా అత్యధికులు ఆప్షన్లు ఎంచుకుంటే సీనియార్టీ ప్రకారం కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కేటాయించిన పోస్టుల నిష్పత్తికి అనుగుణంగా విభజన ఉంటుంది. సీనియార్టీతో సంబంధం లేకుండా ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయింపు కోరవచ్చు. 70 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు, కుటుంబంలో మానసిక వికలాంగులైన పిల్లలున్నవారు, కారుణ్య నియామకాల్లో భాగంగా నియమితులైన వితంతువులు, మెడికల్ గ్రౌండ్స్‌లో క్యాన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. దంపతులైన ఉద్యోగులను వీలైనంతవరకు ఒకే లోకల్ క్యాడర్లో ఉండేలా చూస్తారు. అయితే కొన్ని ఉద్యోగ సంఘాల నేతల కనుసన్నల్లోనే బదిలీలు, విభజన ప్రక్రియ జరగడంపై ఉద్యమంలో పాల్గొన్న ఇతర సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ల్లోనే ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారా?
ఉద్యోగుల బదిలీలపై ఎవరు సంతృప్తిగా లేరని.. పైగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారులకు ముందుచూపు లేకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందిపడే పరిస్థితి. క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేయకుండా బదిలీలు చేయడంవల్ల సీనియర్లు, జూనియర్లు ఇద్దరూ నష్టపోతారని.. కొత్తజోన్ల ప్రకారం కొత్త రిక్రూట్‌మెంట్ చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. ప్రస్తుత విధానంలో మెజార్టీ ఉద్యోగులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఆప్షన్ పెట్టుకున్నారని.. అందరికి ఈ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడం సాధ్యం కాదని అధికారవర్గాల సమాచారం. ఏది ఏమైనా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ తేనెతుట్టెను కదిపిందని..ఈ ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది.