Site icon NTV Telugu

ఎంపీ పదవికి డీఎస్‌ రాజీనామా చేస్తారా?

టీఆర్ఎస్‌ను వీడి.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన DS.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పాకే కాంగ్రెస్‌ కండువా కప్పుకొంటారా? నైతికత కింద రాజీనామా చేస్తారా? ఇంకేదైనా వ్యూహం ఉందా?

రాజకీయాల్లో చురుకైన పాత్ర కోసం చూస్తున్నారా?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో.. కాంగ్రెస్‌లో డీ శ్రీనివాస్‌ చేరిక త్వరలోనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీతో సమావేశమై.. తిరిగి పాత గూటిలోకి వెళ్లేందుకు సమ్మతి తీసేసుకున్నారు. అయితే డీఎస్‌ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత డీఎస్‌ను పెద్దల సభకు పంపించారు గులాబీ దళపతి. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో టీఆర్ఎస్‌కు దూరమయ్యారు ఈ సీనియర్‌ పొలిటీషియన్‌. డీఎస్‌పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్‌ జిల్లా అధికారపార్టీ నేతలు డిమాండ్‌ చేశారు కూడా. కానీ.. డీఎస్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ చురుకైన పాత్ర కోసం చూస్తున్నారు శ్రీనివాస్‌.

రాజ్యసభ సభ్యుడిగా మరో ఆరు నెలలు పదవీకాలం..!
ఎంపీ పదవికి రాజీనామా చేయకపోతే అనర్హత వేటుకు ఆస్కారం..?

అప్పుడప్పుడూ టీఆర్ఎస్‌పై రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్నారు డీఎస్. తాజాగా కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న ఆయన.. రాజ్యసభ ఎంపీ పదవి విషయంలో ఏం చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎంపీగా ఆయన పదవీకాలం మరో ఆరు నెలలే ఉంది. ఎంపీగా పదవీకాలం పూర్తయ్యాక కాంగ్రెస్‌లో చేరితే వచ్చే విమర్శలు వేరలా ఉంటాయి. ఎలాగూ ఆరునెలలే పదవీకాలం ఉండటంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరితే… రాజకీయంగా పైచెయ్యి సాధించవచ్చన్న ఆలోచనలో డీఎస్‌ ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే విమర్శలకు గట్టిగానే కౌంటర్‌ చేయొచ్చని అనుకుంటున్నారట. ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి వెళ్తే.. డీఎస్‌పై అనర్హత వేటు వేయాలని టీఆర్ఎస్ కోరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అనర్హత వేటు వేయించుకోవడం కంటే ఎంపీ పదవికి రాజీనామా చేయడమే బెటర్‌ అని డీఎస్‌ సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోందట.

కాంగ్రెస్‌లోకి డీఎస్‌ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో?

ఆ మధ్య సోనియాగాంధీతో డీఎస్‌ భేటీ తర్వాత తెలంగాణలోని కాంగ్రెస్‌ ముఖ్యులకు ఢిల్లీ రావాలని హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. తర్వాత ఏమైందో ఏమో.. ఆ ట్రిప్‌ క్యాన్సిల్‌ అయ్యింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్‌ చేరిక.. ఆ సందర్భంగా వచ్చే సాంకేతిక సమస్యలు చర్చించారో లేక.. మంచి తరుణం కోసం వేచి చూస్తున్నారో కానీ.. చేరిక ఎప్పుడున్నది సస్పెన్స్‌లో పెట్టారు. కాంగ్రెస్‌లో నేరుగా హైకమాండ్‌తో సంబంధాలు ఉన్న నేత కావడంతో DSపై పీసీసీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. మరి.. కాంగ్రెస్‌లోకి డీఎస్‌ రీ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందో.. టీఆర్ఎస్‌ నుంచి వెళ్తూ వెళ్తూ.. ఎవరిని కలవరపెడతారో చూడాలి.

Exit mobile version