హుజురాబాద్‌లో హత్యా రాజకీయాలు వర్కవుట్ అవుతాయా? ఉపఎన్నికను చావో రేవోగా భావిస్తూ.. తాజాగా చేసిన కామెంట్స్ ఈటలకు కలిసి వస్తాయా? ప్రత్యర్ధి పార్టీలు వేసే ఎత్తుగడలతో ఈటలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి?
హుజురాబాద్‌లో మారుతున్న వ్యూహాలు
ఉపఎన్నికల షెడ్యుల్ విడుదల కంటే ముందే హుజురాబాద్‌లో సందడి మొదలైంది. రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచుకుంటూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ ఉపఎన్నికపైనే ఉంది. అక్కడ రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్రకటనలు సర్వత్రా చర్చగా మారుతున్నాయి కూడా. పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు వేసే ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
తనను చంపడానికి కుట్ర చేస్తున్నారని ఈటల ఆరోపణ!
ప్రస్తుతం హుజురాబాద్‌లో పాదయాత్ర చేస్తున్నారు మాజీ మంత్రి ఈటల. ఈ సమయంలో ఆయన చేసిన ఆరోపణ అందరినీ ఆలోచనలోకి నెట్టింది. తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నారన్నది ఈటల ప్రకటన సారాంశం. ఇందుకోసం హంతక ముఠాలతో చేతులు కలిపినట్టుగా తనకు సమాచారం ఉందని ఈటల చెప్పారు. ఒకప్పుడు నయిమ్ చంపుతానంటేనే భయపడలేదని మరోసారి గుర్తు చేశారు మాజీమంత్రి. ఈ వ్యాఖ్యలే అక్కడి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.
సానుభూతి కోసమే ఈటల ఆ కామెంట్స్ చేశారా?
ఏ లక్ష్యంతో ఈటల ఈ కామెంట్స్ చేశారు? ఎవరిని టార్గెట్ చేశారు? ఉపఎన్నికల్లో సానుభూతి కోసమే ప్రకటనల డోస్ పెంచారా? అన్నది చర్చగా మారింది. నయిం చంపుతానంటేనే భయపడలేదన్న ఈటల ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారు. ఇంతకీ ఈటలను హత్య చేయాల్సినంత రాజకీయ వాతావరణం ఉందా అన్న కోణంలో ప్రతిఒక్కరూ ఆరా తీస్తున్నారు.
ఈటల ఆరోపణలకు మంత్రి గంగుల కౌంటర్!
ఇప్పటి వరకు హుజురాబాద్‌లో రాజకీయ విమర్శలు.. ఈటల.. బీజేపీ, టీఆర్‌ఎస్ .. అభివృద్ధి లక్ష్యంగా సాగాయి. ఇప్పుడు మాత్రం ఈటల కామెంట్స్‌తో హత్యా రాజకీయాల వైపు చర్చ మళ్లింది. ఈ వ్యాఖ్యల వెనక బీజేపీ లేదా మాజీ మంత్రి వ్యూహం ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే టీఆర్‌ఎస్ నుంచి ఈటల కామెంట్స్‌పై మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత రెండు పక్షాల నుంచి స్పందన లేదు. కాకపోతే చర్చ అయితే కొనసాగుతోంది.
ప్రచారం పీక్‌కు వెళ్లాక మరోసారి ఈటల ప్రస్తావిస్తారా?
ఉప ఎన్నికల తేదీ ప్రకటన.. ప్రచారం ఉపందుకున్న తర్వాత ఈటల మరోసారి హత్యా రాజకీయాలను తెరపైకి తీసుకురావొచ్చని అనుకుంటున్నారు. అదే జరిగితే ఆ వ్యూహం.. లేదా సానుభూతి ఆయనకు ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.