తెలంగాణ కాంగ్రెస్‌లో వలసల స్పీడ్ పెంచుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఓదెలు ఆయన భార్య కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కానీ.. ఎప్పటి నుంచో వస్తారు.. వస్తారు అని ప్రచారం జరిగిన ధర్మపురి శ్రీనివాస్ పరిస్థితి మాత్రం కొలిక్కి రావడం లేదు. ఆయన వస్తున్నారా? ఆగిపోయారా? అనేది ఎటూ తేలలేదు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా… సోనియాగాంధీని కలిసి పార్టీలోకి వస్తా అని చెప్పారు DS. ఆయన విన్నపానికి మేడం క్లియరెన్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అప్పట్లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డే.. డీఎస్‌ను కాంగ్రెస్‌లో చేర్పించే పనిలో ఉన్నారని టాక్ నడిచింది. ఇంతలో బ్రేకులు పడ్డాయి. DS చేరికపై కాంగ్రెస్‌లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బయటకు వెళ్లిన వారిని ఎందుకు చేర్చుకోవడం అనే ప్రశ్నలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వినిపించాయి.
DS ప్రస్తుతం టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కానీ టీఆర్‌ఎస్‌తో అనుబంధం లేదు. రాజకీయంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ధర్మపురి శ్రీనివాస్ కూడా కొంత ఆలోచన చేశారనే చర్చ జరిగింది. వచ్చే నెల 21తో ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా ముగిసిపోతుంది. అయినప్పటికీ కాంగ్రెస్‌లో డీఎస్ రీఎంట్రీకి ముహూర్తం కుదిరినట్టేనా అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేరాలంటే.. తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి అధ్యక్షతన చేరికల కమిటీని ఏర్పాటు చేసింది AICC. DS అంశం సైతం జానారెడ్డి కమిటీ ముందుకు వస్తుందా? ఆ కమిటీ ఓకే చెబుతుందా? అనేది తేలాలి. ఒకవేళ జానారెడ్డి కమిటీ ముందుకు వస్తే.. పార్టీలో అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అభ్యంతరాలపై ఏం చేస్తారు?
హస్తినలో సోనియాగాంధీని కలిసి చర్చించిన తర్వాత ధర్మపురి శ్రీనివాస్ మౌనంగా ఉంటూ వస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఓదేలు కండువా మార్చుకోవడంతో డీఎస్‌పై కూడా చర్చ మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీనివాస్ రీఎంట్రీ వల్ల పార్టీకి లాభమా.. లేక కొత్త సమస్యలు వస్తాయా అని కొందరు చర్చిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ దెబ్బతినడానికి ఆయనే కారణమన్నది కొందరి ఆరోపణ. పైగా డీఎస్ కుమారుల్లో ఒకరు బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇంకొకరు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు చూస్తున్నారు. ఇలా రెండు పార్టీలు ఒకే ఇంట్లో ఉంటే జనంలోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయన్నది మరికొందరి ప్రశ్న. బీజేపీలో ఉన్న కుమారుడిని కాదని ఆయన కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తారా? అని కూడా నిలదీస్తున్నారు. మరి.. ధర్మపురి శ్రీనివాస్ ఎపిసోడ్‌కు కాంగ్రెస్‌లో ఎండ్‌కార్డు పడుతుందో లేదో చూడాలి.