ఘట్‌కేసర్‌లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెడ్డి సింహగర్జన సభకు హాజరయ్యారు మంత్రి మల్లారెడ్డి. అప్పటి వరకు బాగానే సాగిన మంత్రి మల్లారెడ్డి స్పీచ్ పై అక్కడ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ పథకాలను ఆయన వివరించడంతో పరిస్థితి మారిపోయింది. ప్రసంగం తర్వాత సభ నుంచి తిరిగి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్‌పై కొందరు దాడి చేయడం రాజకీయ వేడి రగిలించింది. ఈ దాడి వెనక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మనుషులు ఉన్నారని ఆరోపించారు మల్లారెడ్డి. అంతేకాదు.. రేవంత్ వర్గమే తన హత్యకు కుట్ర చేసిందని మంత్రి మండిపడ్డారు. అసలు రెడ్డి జాగృతి సభకు అనుమతి ఇప్పించిందే తానని.. సభా ఏర్పాట్లలో తన అనుచరులు ఉన్నారని వాదిస్తున్నారు మల్లారెడ్డి.
అయితే..ఘాట్ కేసర్ సభకు అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రముఖులు అక్కడికి వెళ్లలేదు. మంత్రి మల్లారెడ్డి మాత్రమే కనిపించారు. రెడ్డి సింహగర్జన సభకు రావాలని రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఇతర టీఆర్‌ఎస్ నేతలను నిర్వాహకులు ఆహ్వానించారా లేదా అనే చర్చ మొదలైంది. ఒకవేళ పిలిచినా ఎందుకు వెళ్లలేదు. ఎందుకు ఆసక్తి చూపించలేదు అని మరికొందరు ఆరా తీస్తున్నారట. పైగా రెడ్డి కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని పలు సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి మల్లారెడ్డి చాలా రిస్క్ తీసుకునే ఆ సభకు వెళ్లారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.
రెడ్డి సింహగర్జన సభ వెనక పీసీసీ చీఫ్ రేవంత్ ఉన్నారనే అనుమానాలు అధికార పార్టీలో ఉన్నాయట. ఆ విషయం తెలిసే చాలా మంది టీఆర్‌ఎస్‌లోని రెడ్డి సామాజిక వర్గం నేతలు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డికే ఆ సంగతి తెలియలేదని తాజాగా చెవులు కొరుక్కుంటున్నారు. రెడ్డి సింహగర్జనకు వెళ్లి.. రెడ్డి సామాజికవర్గానికి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలనుకున్నారట మల్లారెడ్డి. అయితే మంత్రికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. తాను మాట్లాడుతున్నంత సేపూ అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఏం చేయాలో మల్లారెడ్డికి తెలియలేదట. అందుకే ఈ ఎపిసోడ్ ఇప్పుడు పొలిటికల్ కలర్ తీసుకుని రచ్చ రచ్చ అవుతోంది.
టీఆర్ఎస్‌లోని ఇతర రెడ్డి సామాజికవర్గానికి చెందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల మాదిరే మల్లారెడ్డి కూడా సైలెంట్‌గా ఉండిఉంటే సరిపోయేదని చెబుతున్నారు. కనీసం వెళ్లేటప్పుడైనా పార్టీ పెద్దలతో.. పార్టీలోని తన సామాజికవర్గం నేతలతో మాట్లాడినా మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారట. సింగిల్‌గా వెళ్లి క్రెడిట్ కొట్టేయాలని అనుకున్నారో ఏమో కానీ.. మంత్రి మల్లారెడ్డి సెల్ఫ్‌గోల్ వేసుకున్నారనే ప్రచారం ఊపందుకుంది.