ఒకప్పటి ఛేజింగ్ లు లేవు.. ఎన్ కౌంటర్ లు లేవు.. శేషాచలంలో ఇప్పుడంతా సైలెన్స్. ఎర్రచందనం ఎటుపోతుందో అడిగేవాళ్లు లేరు. ఎందుకీ పరిస్థితి వచ్చింది? రెడ్ శ్యాండిల్ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తోంది?
రెడ్ శ్యాండిల్ టాస్క్ ఫోర్స్. శేషచలంలోని ఎర్రచందనం పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దళం. కాని ఇప్పుడు అ శాఖ ఉందా లేదా అనే పరిస్థితి కనిపిస్తోంది. ఆ స్థాయిలో దాని పనితీరు ఉందనే విమర్శలు తీవ్ర స్ధాయిలో వినిపిస్తున్నాయి.
కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్న కొలువున్న శేషాచలం అడవులకు ఇంకో ప్రత్యేకత వుంది. ప్రపంచంలో శేషాచలం అడవుల్లో మాత్రమే ఎర్రచందనపు చెట్లు పెరుగుతాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల పరిధిలో 5.2లక్షల హెక్టార్లలో ఈ అడవి విస్తరించి వుంది. ఎంతో విశిష్ట గుణాలను కలిగి ఉన్న ఎర్రచందనానికి వీటికి విదేశీ మార్కెట్ లోచాలా డిమాండ్ ఉంది. దీంతో, ప్రతి ఏటా రెండు వేల టన్నులకు పైగా ఎర్రచందనం చెన్నై, ముంబై, కోల్ కతా, ట్యూటికోరిన్ రేవుల మీదుగా నేపాల్, టిబెట్ లకు, అక్కడి నుంచి చైనాకు కూడా రవాణా అవుతోంది. ఉపాధి లేక ఖాళీగా ఉన్న వారిని కూలీలుగా నియమించుకుని ఎర్రచందనం అక్రమ రవాణాను ఒక వ్యాపారంగా మార్చేశారు. లారీ క్లీనర్లుగా జీవితం ప్రారంభించిన వారు స్మగ్లర్లుగా మారి వందల కోట్లు సంపాదించారు. ఇక తమిళనాడులో అయితే స్మగ్లర్లు దుబాయి కేంద్రంగా పనిచేస్తున్నారు. 10సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందని సమాచారం. శేషాచలంలో స్మగ్లర్లుకు, పోలీసులకు మధ్య రాళ్ళ దాడులు, ఆత్మరక్షణ కోసం గాల్లో కాల్పులు ఒకప్పుడు సర్వసాధరణం. స్మగ్లర్ల కోసం ఛేజింగ్ సీన్లు కామన్ గా కనిపించేవి. గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనాన్ని కాపాడేందుకు రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ పేరిట ప్రత్యేకంగా ఓ విభాగాన్నే గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టాస్క్‌ఫోర్స్‌కు ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించి ఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారిని అధిపతిగా నియమించింది. ఈ టాస్క్‌ఫోర్స్ చురుగ్గా పనిచేయడమే కాకుండా తమిళనాడు కూలీల ఎన్‌కౌంటర్‌తో స్మగ్లర్లకు వణుకు పుట్టించింది.
అయితే ప్రభుత్వం మారాక ఈ టాస్క్‌ఫోర్స్ నిస్తేజమైపోయిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో టాస్క్ ఫొర్స్ కు ఐజీ స్దాయి అధికారి ఉండేవారని ఇప్పుడు ఆ పోస్టు ఖాళీగా పెట్టారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మొన్నటి తిరుపతి పర్యటన సమయంలో విమర్శించారు.
ఈ ప్రాంతంలో ఒకనాటి స్మగ్లర్లు ఇప్పుడు నేతలు, ప్రజాప్రతినిధులుగా రూపాంతరం చెందారట. ఎర్రచందనం స్మగ్లర్లుగా చాలా కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లొచ్చిన వారు ఇప్పుడు అధికార పార్టీలో స్థానిక నాయకులుగా ఎదిగారట. ఇంకొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా కూడా గెలిచేశారు. స్మగ్లింగ్‌లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండటంతోనే పోలీసు, అటవీ శాఖలు నిఘా, నిరోధక చర్యలు తగ్గించేశాయట. ఇంతలా జనసేన పార్టీ నేత టాస్క్ ఫోర్స్ పై విమర్శలు గుప్పించినా అక్కడి అధికారుల్లో కాని అధికార పార్టీ నేతల్లో కాని స్పందన లేకపోవటం, జిల్లాలో హాట్ టాపిక్ మారిందట.
గతంలో పెట్టే కేసులు సంఖ్యకు, పట్టుకునే ఎర్రచందనానికి ఇప్పటికి పొంతన లేకుండా పోయింది. ఇప్పుడు అ దూకుడు ఎందుకు లేదన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే లేరంటున్నారట. ఒకప్పుడు నిరంతర కూంబింగ్‌లతో, శేషాచలం అడవుల్లో క్యాంపులతో స్మగ్లర్లను, తమిళ కూలీలను హడలెత్తించిన టాస్క్‌ఫోర్స్ సాయుధ బలగాలు, ఇప్పుడు అరుదుగా తప్ప కార్యాలయం దాటి వెలుపలికి రావడం లేదని టిడిపి నేతలు తీవ్ర స్థాయిలోఆరోపణలు చేస్తున్నారు. అయినప్పటికీ, అధికారులు పట్టించుకోవటం లేదని టాస్క్ ఫోర్స్ సైలెంట్ మోడ్ లోనే ఉందనే టాక్… గట్టిగానే వినపడుతోంది. ఇప్పటికైనా వస్తున్న విమర్శలకు సమాధానం చెబుతారా లేక సైలెంట్ గానే ఉంటారా అన్నది ప్రశ్నగానే మారింది.