శంకర్ నారాయణ. సీఎం జగన్ కేబినెట్ వన్‌లో అనుకోకుండా చోటు సంపాదించిన మంత్రుల్లో ఒకరు. అనంతపురం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కురుబ సామాజికవర్గం కావడంతో ఎలాంటి ప్రయత్నం చేయకుండానే 2019లో మినిస్టర్ అయ్యారు. మంత్రిగా ఉన్నన్ని రోజులు బాగానే నడిచింది. పెనుకొండ నియోజకవర్గంలో చాపకింద నీరులా ఉన్న వర్గపోరు.. శంకరనారాయణ మంత్రి పదవి పోయాక కానీ బయట పడలేదు. ఎవరైతే ఆయన గెలుపునకు బ్యాక్ బోన్‌గా ఉన్నరో వారే ఇప్పుడు వ్యతిరేకంగా మారారట.
శంకరనారాయణ మంత్రిగా బిజీ ఉన్న సమయంలో ఆయన సోదరులు పెనుకొండలో వ్యవహారాలు చక్కబెట్టేవారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి వరకు ఆయన వెన్నంటి ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతూ వచ్చారట. అయితే మంత్రి పదవిలో ఉండటంతో నారాయణ గురించి ఎక్కడా బయటపడలేదు. మంత్రి సోదరుల వల్ల పరోక్షంగా నష్టపోయిన వారు మాత్రం ఓపెన్‌గా విమర్శలు చేస్తూ వచ్చారు.
విమర్శలు చేసిన వారికి అనుకోకుండా ఎదురు దెబ్బలు తగిలాయి. కేసులు నమోదయ్యాయి. దీంతో సమయం కోసం వేచి చూసిన వారికి.. శంకర నారాయణ మంత్రి పదవి పోగానే సినిమా స్టార్ట్ చేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన వ్యతిరేకవర్గం అంతా ఏకమై.. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్‌గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు వెళ్లి ఫిర్యాదులు చేశారట. ఇన్ని రోజులు పార్టీకోసం పనిచేస్తే వచ్చిన ఇబ్బందులను ఏకరవు పెట్టారట. అన్నీ విన్న పెద్దిరెడ్డి.. విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారట ఆ నాయకులు. దీంతో మాజీ మంత్రిపై వారే వార్ ప్రకటించారని స్థానికంగా చర్చ జరుగుతోంది.
శంకరనారాయణ వల్ల తాము చాలా నష్టపోయామని.. ఆయన సోదరులు ఏం చేస్తున్నారో చూడండి అని సోషల్ మీడియా వేదికగా వరసగా పోస్టింగ్‌లు పెడుతున్నారట. ఆ పోస్టింగ్‌లు చూసిన శంకర నారాయణ శిబిరం ఉలిక్కి పడుతున్నట్టు సమాచారం. మాజీ మంత్రినే కాకుండా.. ఆయన వెంట తిరుగుతున్న వారినీ వ్యతిరేక వర్గం సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నట్టు టాక్. పెనుకొండలో వైసీపీ నిలబడాలంటే శంకర నారాయణ వ్యతిరేకవర్గాలన్నీ ఏకం కావాలని ఆ పోస్టింగ్‌లలో పిలుపు ఇస్తున్నారట. అయితే ఈ సోషల్ మీడియా వార్ ఒక్క పెనుకొండకే పరిమితం కావడం లేదట. జిల్లా మొత్తం సర్క్యులేట్ అవుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వ్యతిరేక పోస్టింగ్‌లను ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన మాజీ మంత్రి శంకర నారాయణ.. కర్ర విరగకుండా.. పాము చావకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అసంతృప్తివాదులు కూడా సొంత పార్టీ వారే కావడంతో.. వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది లేకుండా సమస్యను సర్దుబాటు చేసుకోవాలో.. లేక వారిపై దూకుడుగా వెళ్లాలో అర్ధం కావడం లేదట. ఇదంతా వైసీపీ అధిష్ఠానం చూసుకుంటుంది అనే ధోరణిలో ఉన్నారట మాజీ మంత్రి. మరి.. ఇంటిపోరును.. శత్రువర్గాన్ని శంకర నారాయణ ఎలా అధిగమిస్తారో చూడాలి.