అక్కడ పార్టీ ఉన్నదే అంతంత. నేతల మధ్య కుమ్ములాటలు మాత్రం ఎక్కువే. ఫ్లెక్సీల్లో ఫొటో లేదని ఒకరు.. పార్టీ జెండా ఎగరేసే విషయంలో మరొకరు గల్లా పట్టుకుంటారు.. చొక్కలు చించుకుంటారు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టుది మరోదారి అన్నట్టు ఉందట నేతల తీరు.
సంగారెడ్డి బీజేపీలో వర్గపోరు గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిదన్నది పార్టీ నేతల మాట. ఎన్నికల్లో సత్తా చాటలేరు కానీ.. పార్టీలోని ఇతర నేతలపై పైచెయ్యి సాధించేందుకు మాత్రం ఉడుంపట్టే పడతారనే టాక్ ఉంది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీజేపీ పరిస్థితి దిగజారుతున్నా స్థానిక నాయకులకు ఎలాంటి ఫికర్ లేదనే అభిప్రాయం రాష్ట్ర నేతల్లోనే ఉందట. 2014లో బీజేపీకి 18వేల ఓట్లు వస్తే.. 2018 ఎలక్షన్లు వచ్చే సరికి 6వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు కమలనాథులు. ఈ గణాంకాలతో లోకల్ లీడర్స్‌కు ఎలాంటి చీకు చింత లేదని.. కలవరమంతా పైవాళ్లకే అని ఇక్కడి బీజేపీ కేడర్ చెవులు కొరుక్కుంటోంది.
సంగారెడ్డి బీజేపీ ఇంఛార్జ్‌గా రాజేశ్వరరావు దేశ్‌పాండే ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. వీరిద్దరికీ అస్సలు పడటం లేదు. ఇటీవలే దయాకర్‌రెడ్డి అనే మరో నేత స్పీడ్ పెంచారట. కొత్త వ్యక్తి రాక వెనక జిల్లా అధ్యక్షుడి కుట్ర ఉందనేది ఇంఛార్జ్ అనుమానం. ఈ సందేహాలు రోజు రోజుకీ బలపడుతున్నాయే తప్ప.. సమస్య తీవ్రతను పట్టించుకుని.. పరిష్కరించిన రాష్ట్ర నేతలే లేరట. చివరకు రాష్ట్ర నేతలు భయపడిందే జరిగింది. ప్రజాగోస-బీజేపీ భరోసాయాత్ర సాక్షిగా రోడ్డెక్కి ఘర్షణ పడ్డాయి రెండు వర్గాలు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సమక్షంలోనే గల్లాలు పట్టుకున్నారు నేతలు.
సదాశివపేటలోని మద్దికుంటలో బీజేపీ బైక్ ర్యాలీ నడుస్తుండగా ఇంచార్జ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలలో తమ నేత ఫొటో లేదని వాదులాడుకున్నారు కూడా. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారి.. ఒకరినొకరు తోసుకున్నారు. చొక్కాలు చిరిగిపోయాయి. అరిచి గీ పెట్టినా.. ఎవరూ తన మాట వినకపోవడంతో రాంచంద్రరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత రోజు జరిగిన బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలోనూ రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. సంగారెడ్డిలో బీజేపీ బలోపేతానికి ఫోకస్ పెట్టకుండా.. ఈ తన్నులాటలేంటో కమలదళానికి అర్ధం కావడం లేదట.
సంగారెడ్డిలో గలాటా చేస్తున్న నేతలకు రాష్ట్రస్థాయిలో గట్టి లాబీయింగే ఉందట. హైదరాబాద్ నుంచి ఉన్న ఆశీసుల కారణంగానే ఎవరూ వెనక్కి తగ్గడం లేదనే చర్చ సాగుతోంది. ఒకవైపు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని.. పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ తెలంగాణ సారథి పాదయాత్ర చేస్తుంటే.. ఇక్కడి నేతలు మాత్రం ఆధిపత్యపోరాటానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఇక్కడి పరిణామాలతో విసుగుచెందిన కేడర్.. కార్యక్రమాలకు రావడమే మానేసిందట. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న నియోజకవర్గం కావడంతో సంగారెడ్డి బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర నేతలు కలవర పడుతున్నారట. ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ వాళ్లు ఎంట్రీ ఇస్తే.. ఎవరికి సర్ది చెబుతారు? మాట వినని వారిపై చర్యలు తీసుకుంటారా? అనే సందేహాలు ఉన్నాయట.