Raptadu Politics : రాప్తాడు రాజకీయాల్లో సీమ టపాకాయలు పేలుతున్నాయ్. వేరొకరి భుజంపై తుపాకీ పెట్టి కాల్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు నాయకులు. వదల బొమ్మాళి అని టీడీపీ నేతలు వార్నింగ్ ఇస్తుంటే.. గన్‌మెన్ లేకుండా బయటకు రండి చూద్దామని అధికారపార్టీ నాయకులు కవ్విస్తున్నారు. ఎందుకిలా? నేతలకు ఏమైంది?
నిత్యం వివాదాలు, సంచలనాలకు కేంద్రంగా నిలిచే రాప్తాడులో సరికొత్త రాజకీయాలు కనిపిస్తున్నాయి. పరిటాల కుటుంబానికి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఫ్యామిలీకి దశాబ్దన్నర కాలంగా వైరం సాగుతోంది. పాత కక్షలు పెద్దగా లేకపోయినా రాజకీయ సవాళ్లు మాత్రం పీక్స్‌లో ఉన్నాయి. గత 15ఏళ్ల పోరాటం తర్వాత 2019 ఎన్నికల్లో ప్రకాష్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. పరిటాల కోటలో పాగా వేశారు. అయితే ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిని కాకుండా అధికారులను, పోలీసులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్. విపక్షంలో ఉన్నప్పుడు ప్రకాష్‌రెడ్డి సైతం ఇదే విధంగా చిందులు తొక్కడాన్ని ఇక్కడి జనం గుర్తు చేసుకుంటున్నారు. కాకపోతే అధికారుల భుజంపై తుపాకులు పెట్టి రెండు వర్గాలు కాల్చుకోవడమే తాజా రాజకీయం.
అధికారంలో ఉన్న పార్టీకి ఆఫీసర్లు మొగ్గు చూపడం సహజం. కానీ.. కొందరు అధికారులు ఇప్పటికీ పరిటాల కుటుంబానికి అనుకూలంగా ఉన్నారని ప్రకాష్‌రెడ్డి అనుమానిస్తున్నారట. ఈ విషయంలో ఎమ్మల్యేకు ఉన్న సమచారం ఏంటో కానీ.. తమ వాళ్లను ఇబ్బంది పెడుతున్న వాళ్లకు మాత్రం పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇస్తున్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమని.. పవర్‌లోకి రాగానే తోక జాడించిన వాళ్లపై క్రిమినల్ చర్యలు తప్పబోవని హెచ్చరిస్తున్నారట. దీంతో రాప్తాడు రాజకీయం మరో మలుపు తీసుకుంది. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సీమ భాషలో పరిటాల సునీత, శ్రీరామ్‌లకు కౌంటర్లు వేశారు. వార్నింగ్‌లు కాదు.. దమ్ముంటే గన్‌మెన్ లేకుండా బయటకు రావాలని సవాల్ కూడా చేశారు ప్రకాష్‌రెడ్డి. అక్కడితో ఆగకుండా మేము కాపాడుకుంటోన్న ప్రాణాలు మీరు.. అందుకే గన్‌మెన్ ఇచ్చాం.. ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛనిచ్చాం.. అని ఎమ్మెల్యే సెటర్లు వేశారు.
ప్రకాష్‌రెడ్డి కామెంట్స్ కాంట్రవర్సీగా మారడంతో రాప్తాడులో రాజకీయం వేడెక్కింది. అధికారులు.. పోలీసుల తీరుపై చేస్తున్న విమర్శలు కాస్తా.. రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలకు దారితీయడంతో వైసీపీ, టీడీపీ శిబిరాలు అలర్ట్ అయ్యాయి. ఎన్నికల వరకు ఇదే వేడి కొనసాగించే ఎత్తుగడలు వేస్తున్నారట. మరి.. సీమ టపాకాయలు రాప్తాడులో ఎలాంటి సౌండ్ చేస్తాయో చూడాలి.