Off The Record: వినుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఉక్కిరి బిక్కిరి

  • ఆర్యవైశ్యులకు ఛైర్మన్‌ టిక్కెట్‌ ఇస్తామని ముందు ప్రకటన
  • వినుకొండలో ఎక్కువగా ముస్లింలు, తర్వాత వైశ్యులు
  • వైసీపీ ముస్లింలకు ఇచ్చాక వ్యూహం మార్పు, టీడీపీ కూడా ముస్లింకే
  • అలిగిన ఆర్యవైశ్యులు, అనుకూలంగా మల్చుకున్న వైసీపీ
  • పోలింగ్‌ రోజు ఎంత చేసినా టీడీపీ టెన్షన్‌ తగ్గలేదన్న టాక్‌
  • క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందేమోనని టీడీపీలో టెన్షన్‌
Off The Record

Off The Record

Off The Record: పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ ఎన్నికలు టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు జరిగాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ రెండు పార్టీలు గెలుపుకోసం పోటాపోటీ వ్యూహాలతో పొలిటికల్‌ హీట్‌ పెంచేశాయి. మిగతా చోట్ల ఎలా ఉన్నా… వినుకొండలో మాత్రం వైసీపీ… తెలుగుదేశం పార్టీకి చెమటలు పట్టించిందన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. వ్యూహాత్మకంగా ప్రతిపక్షం వేసిన ఎత్తుగడలతో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి అయిందని అంటున్నారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పీఠాన్ని ఆర్యవైశ్య సామాజికవర్గానికి ఇవ్వాలని మొదట్లో భావించింది టీడీపీ. దీంతో ఆ కులానికి చెందిన నేతలతో టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సమావేశాలు కూడా నిర్వహించారు. ఆ మీటింగ్‌ తర్వాత టీడీపీ తరపున ఛైర్మన్ టిక్కెట్‌ మనదేనని వాళ్ళు కూడా ఫిక్స్‌ అయిపోయారు. సరిగ్గా ఇక్కడే వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. వినుకొండ మున్సిపాలిటీలో అత్యధికంగా ముస్లిం ఓటర్లున్నారు. తర్వాతి స్థానం ఆర్యవైశ్యులది. దాంతో… వైసీపీ ముస్లిం సామాజికవర్గానికి చెందిన పి.ఎస్.ఖాన్ ను ఛైర్మన్ అభ్యర్దిగా బరిలో దించింది. దాంతో… స్థానిక టీడీపీలో కలకలం మొదలయ్యింది. తర్వాతి పరిణామాలు అనుహ్యంగా మారిపోయాయి. టీడీపీ కూడా వైశ్యులను కాదని ముస్లిం సామాజికవర్గానికి చెందిన షమీమ్ ఖాన్‌ను రంగంలోకి దించింది.

ఇద్దరు అభ్యర్థులు ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారే అయితే… ఓట్లు చీలి లాభపడతామని టీడీపీ నేతలు లెక్కలేశారట. కానీ… ఆ లెక్కలేవీ వర్కౌట్‌ అవలేదని తెలిసింది. ఛైర్మన్ టిక్కెట్‌ ఇస్తామని ముందు చెప్పి… మాట తప్పిన ఎమ్మెల్యే జీవీపై ఆర్యవైశ్య సామాజికవర్గం నేతలు రివర్స్ అయ్యారు. రెబల్ అభ్యర్దులుగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో కంగారుపడ్డ ఎమ్మెల్యే జీవీ…., మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయులుతో కలిసి సమావేశాలు నిర్వహించినా సెట్ అవలేదు. ఇక్కడే వైసీపీ మరో అస్త్రానికి పదునుపెట్టింది. ఆర్యవైశ్యులకు టీడీపీ అన్యాయం చేసిందని ఎస్టాబ్లిష్‌ చేసేందుకు ఆ సామాజికవర్గం నేతలతో వైసీపీ ఇన్ ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు భారీగా వైశ్య నేతలు హాజరయ్యారు. దీంతో వైసీపీలో గెలుపుపై ఆశలు మరింత పెరిగాయి. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్ది షమీమ్ ఖాన్ వైసీపీ నేత రషీద్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోవడాన్ని కూడా ప్రచారం చేస్తూ ముస్లిం ఓట్లు తమకే గంపగుత్తగా పడేలా ప్లాన్ చేసింది ప్రతిపక్షం. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య హైటెన్షన్ మొదలయ్యింది. ఎన్నికల్లో వైసీపీ గట్టిపోటీ ఇస్తుందన్న క్లారిటీకి వచ్చిన టీడీపీ నేతలు… పోలింగ్ రోజు ఏం చెయ్యాలన్నదానిపై మాస్టర్ ప్లాన్ వేశారట.

ముందురోజు రాత్రి వినుకొండ వైసీపీ ఇన్ చార్జ్ బొల్లా బ్రహ్మనాయుడును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అంతటితో ఆగకుండా…ఆయన్ని వినుకొండ నుంచి నర్సరావుపేటకు తరలించారు. సాధారణంగా ఎవరినైనా హౌస్ అరెస్ట్ చేస్తే ఇంటినుంచి బయటకు రాకుండా బందోబస్తు పెడతారు పోలీసులు. కానీ… బొల్లా వినుకొండలో ఉంటే ఇబ్బంది తప్పదని భావించి పక్కా ప్లాన్‌తో ఇక్కడినుంచి నర్సరావుపేటలోని ఆయన నివాసానికి తరలించారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు వైసీపీ ఛైర్మన్ అభ్యర్ది పి.ఎస్.ఖాన్ ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పోలింగ్ రోజున అభ్యర్దిని హౌస్ అరెస్ట్ చెయ్యడం కూడా టీడీపీ ప్లాన్‌లో భాగమేనన్న ప్రచారం ఉంది. ఇవన్నీ చాలవన్నట్టు టీడీపీ నేతలు ఎన్నికల్లో అక్రమాలకు తెరతీశారన్నది విపక్షం ఆరోపణ. వినుకొండ మున్సిపాలిటీలో అక్కడక్కడా వైసీపీ అభ్యర్దులపై దాడులు జరిగాయి. వైసీపీ అభ్యర్ది అర్చనామూర్తిపై టీడీపీ అభ్యర్ది సురేష్ తోపాటు అతని అనుచరులు పోలింగ్ బూత్ లోనే దాడికి పాల్పడడం సంచలనమైంది. పలు వార్డుల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్దులను బెదిరించి బూత్‌ల నుంచి బయటకు పంపించి రిగ్గింగ్‌ చేసినట్టు కూడా ఆరోపిస్తోంది వైసీపీ. అయితే ఇంత చేసినా… టీడీపీలో ఇప్పటికీ గెలుపుపై అనుమానాలున్నాయన్నది లోకల్‌ టాక్‌. ముఖ్యంగా ముందు టిక్కెట్‌ ఆశ చూపి…మమ్మల్ని వంచించారంటూ ఆర్యవైశ్య సామాజికవర్గం నేతలు గుర్రుగా ఉన్నారట. దాంతో… క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్న అనుమానాలున్నాయి. ఈ పరిస్థితుల్లో వినుకొండ మున్సిపల్‌ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది.