గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, తాడికొండ ఒకప్పుడు టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలు. మధ్యలో నేతల మధ్య విభేదాలతో పార్టీ పట్టుకోల్పోయింది. అయినప్పటికీ అక్కడ టీడీపీకి గట్టి ఓటుబ్యాంకే ఉంది. గతంలో ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాకినేని పెదరత్తయ్య వరసగా ఐదుసార్లు గెలిచారు. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిన తర్వాత సైకిల్ జోరు తగ్గింది. కాంగ్రెస్, వైసీపీలు పట్టు సాధించాయి. ప్రస్తుతం మాజీ మంత్రి మేకతోటి సుచరిత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే పరిస్థితి తాడికొండలోనూ ఉంది. 2014లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీనే గెలిచింది. 2019కి వచ్చే సరికి సీన్ రివర్స్.
రాజధాని అమరావతిలోరెండూ కీలక నియోజకవర్గాలు కావడం.. ఎస్సీ రిజర్డ్వ్ సెగ్మెంట్లు అవడంతో.. ఈ దఫా గట్టిగానే ఫోకస్ పెట్టాలని నిర్ణయించిందట టీడీపీ. గెలుపు మంత్రంపై కసరత్తు మొదలుపెట్టారట. అయితే ప్రత్తిపాడులో టీడీపీకి ఇంఛార్జ్ కూడా లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఇబ్బంది పడుతున్నారు. మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య సమన్వయకర్తగా ఉన్నప్పటికీ ఆ లోటు కనిపిస్తోందట. 2014లో ప్రత్తిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిశోర్‌బాబు మంత్రి పదవి పోయాక జనసేనలోకి వెళ్లారు. తర్వాత బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఇటీవలే బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు రావెల. త్వరలో టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రత్తిపాడులో రావెలను వ్యతిరేకించే వర్గం టీడీపీలో ఉంది. అందుకే ఆయన పసుపు కండువా కప్పుకోవడం ఆలస్యం అవుతుందని టాక్.
తాడికొండలో టీడీపీ ఇంఛార్జ్ తెనాలి శ్రావణ్‌కుమార్‌కూ పార్టీలో అసమ్మతి పోరు ఉంది. గత ఎన్నికల సమయంలోనే శ్రావణ్ కుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని చంద్రబాబుపై పెద్దస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఇక్కడ మాల్యాద్రికి తొలుత సీటు ప్రకటించినా.. తిరిగి శ్రావణ్ కుమార్‌కే ఓకే చెప్పారు. అయితే అసమ్మతి నేతల సహాయ నిరాకరణతో శ్రావణ్ కుమార్ ఓడిపోయారు. ఏతావాతా చూస్తే అటు ప్రత్తిపాడులోనూ.. ఇటు తాడికొండలోనూ మాజీ ఎమ్మెల్యేలపై తెలుగు తమ్ముళ్లలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకే అసమ్మతి అనే మాట వినిపించకుండా కొత్త ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం ఆ ఆలోచన చుట్టూనే చర్చ జరుగుతోంది.
రెండు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్డ్వ్ కావడంతో.. తాడికొండలో అసమ్మతి ఎదుర్కొంటున్న శ్రావణ్ కుమార్‌ను ప్రత్తిపాడుకు.. ప్రత్తిపాడు సీటు ఆశిస్తున్న రావెలను తాడికొండకు మార్చి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందా అని టీడీపీ పెద్దలు లెక్కలేస్తున్నారట. ఈ మార్పులతో రెండు చోట్లా ముందు అసమ్మతికి చెక్ పడుతుందని.. కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారనే కోణంలో లోకల్ లీడర్స్ కలిసి పనిచేస్తారని టీడీపీ అధిష్ఠానం భావిస్తోందట. పైగా వచ్చే ఎన్నికల్లో ఈ మార్పు వర్కవుట్ అవుతుందని చర్చ జరుగుతోందట. ఇదే అంశంపై రెండు నియోజకవర్గాల్లో కార్యకర్తల అభిప్రాయం తెలుసుకుని వెంటనే కార్యాచరణ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు టాక్. మరి.. ఈ ప్రయోగం సైకిల్ పార్టీకి ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.