NTV Telugu Site icon

TRS : తెలంగాణ రాజకీయంలో కొత్తపుంతలు తొక్కుతున్న తూర్పు వర్గపోరు

Warangalpolitics

Warangalpolitics

నన్నపనేని నరేందర్‌.. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే. ఇంకొకరు బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ. మూడో వ్యక్తి గుండు సుధారాణి, వరంగల్‌ మేయర్‌. ఈ ముగ్గురి మధ్య వరంగల్‌ తూర్ప టీఆర్ఎస్‌ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. కోల్డ్‌వార్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకరంటే ఒకరికి పడదు. ముగ్గురి మధ్య అనేక సందర్భాలలో అభిప్రాయభేదాలు బయటపడ్డాయి కూడా. గత ఏడాది దసరా సమయంలోనే రచ్చ రచ్చ అయింది. తాజాగా పట్టణ ప్రగతి కార్యక్రమం ఆ వర్గపోరును పీక్స్‌కు తీసుకెళ్లడంతో పార్టీలో చర్చగా మారింది.

బస్వరాజు సారయ్య గతంలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు. మేయర్‌ గుండు సుధారాణి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కువగా రాజకీయాలు చేసేవారు. ప్రస్తుత ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ సైతం గతంలో వరంగల్‌ మేయర్‌గా చేశారు. ఇలా అందరికీ ఈ సెగ్మెంట్‌తో ఉన్న సంబంధాలు తూర్పు టీఆర్‌ఎస్‌లో సెగలు రేపుతున్నాయి. ఎమ్మెల్యేకు, మేయర్‌కు ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. సుధారాణి మేయర్‌ అయిన తర్వాత అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే నరేందర్‌కు సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తమకు సమాచారం ఇవ్వకుండా తూర్పులో మేయర్‌ పర్యటనలు చేయడంపై నరేందర్‌ వర్గం కుతకుతలాడుతోందట. దాంతో ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్లు నిత్యం కాలు దువ్వే పరిస్థితి ఉంది.

వరంగల్‌ నగరంలోని కొత్తవాడలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్సీ సారయ్య, మేయర్‌ సుధారాణి హాజరయ్యారు. లోకల్‌ ఎమ్మెల్యే నరేందర్‌ లేకపోవడంతో గొడవ రేగింది. స్థానిక శాసనసభ్యుడు లేకుండా ప్రొగ్రామ్‌ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడంతో మేయర్‌ మధ్యలోనే వెళ్లిపోయారు. ఓరుగల్లు అభివృద్ధికి అధికారపార్టీ నేతలు కలిసి కట్టుగా పనిచేయాల్సింది పోయి.. ఎవరికి వారుగా కుంపట్లు రాజేయడంపై టీఆర్ఎస్‌ శ్రేణులు కలవర పడుతున్నాయట. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కార్యక్రమాలను వరంగల్‌ నగరంలో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఆ జాబితాలో పట్టణ ప్రగతి కూడా చేరిపోయింది.
నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు ప్రభుత్వ అధికారులకు సంకటంగా మారింది. ఒకరి మాట వింటే ఇంకొకరి కోపం వచ్చి ఇబ్బందుల్లో పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. పార్టీ కేడర్‌ సైతం పనులు చేయించుకోవడానికి ఎవరిని ఆశ్రయిస్తే ఎవరికి కోపం వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఇలాంటి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉందనేది స్థానికంగా వినిపించే మాట. ఎన్నికల నాటికి ఈ వర్గపోరు ఇంకా శ్రుతిమించే సంకేతాలు కనిపిస్తున్నాయట. మరి.. వరంగల్‌ తూర్పు టీఆర్ఎస్‌లో ఆధిపత్య మంటలను చల్లార్చేందుకు పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.