Site icon NTV Telugu

పెద్దపల్లి నియోజకవర్గంలో తారాస్థాయికి చేరుకున్న టీఆర్ఎస్ వర్గ పోరు

Shilala

Shilala

పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదం టీఆర్ఎస్‌లో అగ్గి రాజేస్తోంది. అధికారులు చేస్తున్నారో లేక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెరవెనక చక్రం తిప్పుతున్నారో అర్థం కావడం లేదన్నది కేడర్‌ చెప్పేమాట. ఇటీవల మంత్రి హరీష్‌రావు పర్యటనలో జరిగిన నాటకీయ పరిణామాలు ప్రస్తుతం చర్చగా మారాయి. ప్రొటోకాల్ రగడ వర్గపోరు తీవ్రతను బయటపెట్టింది.

మంత్రి హరీష్‌రావు ప్రారంభించిన మాతాశిశు కేంద్రం శిలాఫలకంపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేరు కన్నా పైన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేరు చెక్కించారు. దీనిపై కొప్పుల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారుల వైఖరిపై అనుమానం వ్యక్తం చేస్తూ జడ్పీ ఛైర్మన్‌ పుట్టా మధు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొన్ని సందర్భాలలో ఎమ్మెల్యే చెప్పినట్టే అధికారులు చేస్తున్నారని.. అలా జరగకుండా చూడాలని కోరారట.

గతంలో టీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ ఫొటో పెట్టలేదని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్సీ వర్గీయులు. తాజా గొడవ మరో లెవల్‌కు చేరుకుందని చర్చ జరుగుతోంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని కొప్పుల అనుచరులతోపాటు జడ్పీ ఛైర్మన్‌ పుట్టా మధు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. దాంతో రాత్రికి రాత్రి శిలాఫలకాన్ని అధికారులు తొలగించేశారు. ఈ అంశంలో మొదలైన రచ్చ.. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది.

ప్రొటోకాల్ అంశాలపై పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్‌లో జరుగుతున్న వరుస ఘటనలపై పార్టీ అధిష్ఠానం సీరియస్‌ అయిందట. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తీరుపై పార్టీలో కొందరు అసహనం వ్యక్తం చేయడం.. పోలీసులతో కేసులు పెట్టించడం మీద ఫిర్యాదులు అందాయట. ఉద్దేశపూర్వకంగానే కొందరు పార్టీ నేతలను అవమానిస్తున్నారని.. ఎమ్మెల్యే చెప్పకుండా అధికారులు ప్రొటోకాల్ వివాదంలో ఎందుకు ఇరుక్కుంటారని ఎదురుదాడి చేస్తున్నారట. మొత్తానికి విభేదాలు పార్టీలోని కిందిస్థాయి సిబ్బందిని.. అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సుప్రీమ్‌గా ఉండాలని చూస్తారు. ప్రారంభోత్సవాల్లో మరొకరి పెత్తనాన్ని సహించలేరు. అది సొంత జిల్లాకు చెందిన మంత్రులైనా గ్యాప్‌ మెయింటైన్‌ చేస్తుంటారు. పెద్దపల్లి రగడ కూడా ఆ కోవలోనే చూడాలని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి.. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు పార్టీ పెద్దలు చొరవ తీసుకుంటారో లేదో చూడాలి.

Exit mobile version