MLA Gurunath Reddy : అధికారపార్టీలో ఆ పెద్దాయన గోడమీద పిల్లిలా మారిపోయారా? TRSలో ఉన్నానంటూనే.. మరో పార్టీ జెండా ఎందుకు భుజాన వేసుకుంటున్నారు? అంతా ఓపెన్‌గా చేస్తున్నా.. ఆయనపై అధికారపార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా నియోజకవర్గం? ఏంటా కుప్పిగంతులు..? లెట్స్ వాచ్..!
గుర్నాథరెడ్డి. పాలమూరు జిల్లా రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నేత. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు. ఆయన తీరు అధికారపార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. టీఆర్ఎస్‌లో ఉంటూనే.. నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన YSRTP చీఫ్ YS షర్మిలకు స్వాగతం పలికారు గుర్నాథరెడ్డి. అంతేకాదు.. షర్మిల సభలో పాల్గొని ప్రసంగించారు కూడా. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో ఉన్నారా లేక కారుకు గుడ్‌బై చెప్పి.. షర్మిల పార్టీలో చేరారా అనేది పెద్ద ప్రశ్న. టీఆర్ఎస్ నేతలు గుర్నాథరెడ్డి వ్యవహారాన్ని లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆయన గులాబీ పార్టీలో ఉన్నా .. లేకున్నా పెద్దగా ఒరిగేదేమీ లేదని కామెంట్స్ చేస్తున్నారట. ఓపెన్‌గానే మరో పార్టీకి సపోర్ట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేపై టీఆర్‌ఎస్ చర్యలు తీసుకోకపోవడం కూడా కేడర్‌కు అంతుచిక్కడం లేదట.
గుర్నాథరెడ్డి కొడంగల్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014కు ముందు టీఆర్ఎస్‌లో చేరి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో గుర్నాథరెడ్డికి కాకుండా పట్నం నరేందర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది. ఆ సమయంలో ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇస్తామని గుర్నాథరెడ్డికి టీఆర్‌ఎస్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. రోజులు గడుస్తున్నా పదవి ఊసే లేదు. ఆశలు పెట్టుకున్న పోస్టులను వేరొకరికి ఇవ్వడంతో కినుక వహించారు పెద్దాయన. రాజకీయంగా ఇంకా సత్తాచాటాలని చూస్తున్న గుర్నాథరెడ్డి కామ్‌గా ఉండటానికి అస్సలు ఇష్ట పడటం లేదు. మూడు నెలల క్రితం వైఎస్ విజయమ్మను కలిసి మాట్లాడిన తర్వాత.. ఆయన పార్టీ మారిపోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో టీఆర్‌ఎస్ పెద్దలు బుజ్జగించడంతో గుర్నాథరెడ్డి శాంతించారు.
ఇంతలో ఏమైందో ఏమో.. కొడంగల్ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తే.. భారీ కటౌట్లు… ఫ్లెక్సీలతో స్వాగతం పలికారు గుర్నాథరెడ్డి. ఆమెతోపాటు సభలో పాల్గొని.. వైఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పి కలకలం రేపారు. టీఆర్‌ఎస్‌కే చెందిన ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం దుమారం రేపింది. ఇదే సభలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. పాదయాత్రను TRS శ్రేణులు అడ్డుకునే యత్నం చేశాయి. అయితే నిరసనకు దిగిన వారికి గుర్నాథరెడ్డి వార్నింగ్ ఇచ్చారట. ఇంత జరుగుతున్న అధికారపార్టీ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది కేడర్ ప్రశ్న.
ఒకవేళ గుర్నాథరెడ్డి టీఆర్‌ఎస్ వీడినా.. ఆయనతో ఎవరూ వెళ్లకుండా ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి జాగ్రత్త పడుతున్నారట. మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వరెడ్డి సహా.. గుర్నాథరెడ్డితో సన్నిహితంగా ఉండే వాళ్లతో మాట్లాడుతున్నారట. మరి.. కొడంగల్ టీఆర్ఎస్‌లో గుర్నాథరెడ్డి ఎపిసోడ్‌కు ఎప్పుడు ఎండ్‌కార్డు పడుతుందో కానీ.. పెద్దాయన ఎత్తులు మాత్రం గులాబీ శిబిరంలో చర్చగా మారుతున్నాయి.