ఏడుకొండలు ఎక్కాలంటే వాళ్ళ ప్రాపకం వుండాల్సిందేనా ? కోవిడ్ నిబంధనల పేరుతో తిరుమలలో ఆంక్షలు పెరిగిపోతున్నాయా? ఆపద మొక్కులవాడిని అలిపిరి వద్దే వేడుకుని వెనుతిరగాలా? దర్శనం కావాలంటే శ్రీవారి అనుగ్రహం ఒక్కటి సరిపోదా?
ఆపదమొక్కులవాడు. కోరిన వారి కోర్కెలు ఇట్టే తీర్చే దేవుడిగా పేరొందిన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు. స్వామి వారి దర్శనార్దం అలిపిరి వద్దకు చేరుకున్న భక్తులకు ఎలాంటి ఆంక్షలు వుండవు. టిటిడి చెబుతున్నట్లు సప్తగిరులు పవిత్రమైనవే. అడుగడుగునా శేషాచలవాసుడి సన్నిధే.. దీంతో శేషాచల కొండల్లో అడుగిడితే చాలు తమ జన్మధన్యమవుతుందని భావిస్తారు భక్తులు. దీంతో గంటల తరబడి క్యూ లైనులో వేచివుండి స్వామివారిని దర్శించుకునే భక్తులు కొంతమంది అయితే, వైకుంఠనాధుడి సన్నిధిలో పాదం మోపితే చాలు, స్వామివారి దివ్యాశిస్సులు లభిస్తాయని భావించేవారు మరికొంత మంది. కానీ ఇవన్నీ గతం అనేలా పరిస్థితి మారిపోతోంది. నిబంధనల పేరుతో విజిలెన్స్ సిబ్బంది దేవుడికి భక్తుడికి మధ్య అడ్డుగా మారిపోతున్నారు.
కోవిడ్ నిబంధనల పేరుతో శ్రీవారి దర్శనంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఉన్నత అధికారులు ఏం చెబుతున్నారో తెలియదుగానీ కిందిస్థాయి సిబ్బంది మాత్రం నిబంధనల పేరుతో భక్తులకు అలిపిరి వద్దే చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి ప్రతి నిత్యం 20 వేల నుంచి 24 వేల మంది వరకు అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో ఎనిమిది వేల టోకెన్లు జారీ చేస్తుండగా, వర్చువల్ సేవా టికెట్లు కలిగిన మరో 5,500 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు లభిస్తోంది. మరో ఎనిమిది వేల మంది భక్తులు సిఫార్సు లేఖల ద్వారా లేదా శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పొంది స్వామి వారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూంటే, విజిలెన్స్ అధికారులు మరో అడుగు ముందుకు వేసి అలిపిరి వద్దే ఆంక్షలను అమలుచేస్తున్నారు. దర్శన టిక్కెట్లు వున్న వారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు.
అయితే, సిఫార్సు లేఖలపై దర్శన టిక్కెట్లు పొందే వారి వద్ద ముందస్తుగా ఎలాంటి టికెట్లు ఉండవు. వారు తిరుమల చేరుకుని అదనపు ఈఓ కార్యాలయంలో సిఫార్సు లేఖలు అందజేస్తే వారికి సాయంత్రానికి టిక్కెట్లు మంజూరు అవుతాయి. ఇక శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లు పొందే భక్తులు తిరుమలకు వెళ్తేగానీ టిక్కెట్లు పొందలేరు. వీరంతా తిరుమలకు చేరుకునే అవకాశం లేకుండా, అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది చుక్కలు చూపిస్తూన్నారట. ఎంతో దూర ప్రదేశాల నుంచి, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చిన వారికి తలాతోక లేని నిభందనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారట.
విదేశి ప్రయాణంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా అడగని ప్రశ్నలతో భక్తులను అలిపిరి వద్దే అడ్డుకుంటున్నారట. వారు సిబ్బందిని బ్రతిమలాడో, లేదా నానా ఇబ్బందులు పడో వారిని సంతృప్తి పర్చికాని కొండ ఎక్కలేకపోతున్నారట. ఇక చైర్మన్ కార్యాలయంలో సిఫార్సుపై కేటాయించే దర్శనాలకు ముందే యస్ యం యస్ లు వెళ్తాయి. మొత్తంగా, విజిలెన్స్ సిబ్బంది అడిగే ప్రశ్నలకు భక్తులకు అలిపిరి వద్దే శ్రీవారు కనిపిస్తూన్నారట. వాస్తవానికి తిరుమలలో ఇప్పుడు శ్రీవారి ఆలయం మాత్రమే లేదు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అని టిటిడి ప్రకటించింది. హనుమంతుడి ఆలయంతో పాటు పవిత్ర పుణ్య తీర్థాలు కూడా తిరుమలలో వెలసి వున్నాయి. ఆపద కాలంలో శ్రీవారి దర్శనం లేకపోయినా, పవిత్ర ప్రదేశంలో వున్న ఇతర ప్రదేశాలను దర్శించుకుని వెళ్దామనుకున్న భక్తులకు కూడా విజిలెన్స్ వారి నిర్వాకంతో నిరాశే మిగులుతోంది. దీంతో తిరుపతిలో వున్న టిటిడి అనుభంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుని నిరాశగా వెనుతిరుగుతున్నారు భక్తులు. దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వడం లేదంటే ఇదే అనుకుంటున్నారట.