Maganti Gopinath : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అదో కీలక అసెంబ్లీ నియోజకవర్గం. అక్కడ ఎమ్మెల్యేకు.. అధికార పార్టీకే చెందిన GHMC కార్పొరేటర్‌కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కలిసి సాగడం లేదు.. కలిసి కనిపించడమూ లేదు. పార్టీ వర్గాలకు ఈ రగడ పెద్ద పజిల్. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటే కానీ.. సమస్య పరిష్కారం కాదనే స్థాయికి చర్చ చేరుకుందట.
మాగంటి గోపీనాధ్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచే పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికల నాటికే నియోజకవర్గ టీఆర్ఎస్‌లో పాత.. కొత్త నాయకుల మధ్య గ్యాప్ ఉంది. అది పెరిగి పెద్దది అయ్యిందే కానీ.. తగ్గలేదు. ఆ మధ్య జరిగిన GHMC ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది. అప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌గా ఉన్న బాబా ఫసియుద్దీన్ మరోసారి బోరబండ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. ఇది జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో ఉన్న డివిజన్. వీరిద్దరికీ అస్సలు పడటం లేదనేది పార్టీ వర్గాల మాట.
సంస్థాగత మార్పులు చేర్పుల్లో భాగంగా.. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గోపీనాథ్‌ను నియమించింది పార్టీ. ఇది ఇద్దరు నేతల మధ్య మరింత గ్యాప్ తీసుకొచ్చిందని సమాచారం. అసలే ఉప్పు నిప్పులా ఉన్న సంబంధాలు మరింత ముదురు పాకాన పడ్డాయట. గోపీ, ఫసియుద్దీన్ మధ్య గొడవలు ఎక్కడ మొదలయ్యాయో ఏమో.. ఒకరికొకరు ఎదురుపడటానికి కూడా ఇష్ట పడటం లేదట. ఇద్దరూ కలిసి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ ఇద్దరిదీ చెరోదారిగా మారిపోయింది.
బోరబండ డివిజన్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గోపీనాథ్‌తో కలిసి పాల్గొనడం లేదు ఫసియుద్దీన్. పైగా తనకు చెప్పకుండానే డివిజన్‌లో కార్యక్రమాలు పెడుతున్నారనేది కార్పొరేటర్ ఆరోపణ. అయితే ఫసియుద్దీన్‌కు సమాచారం ఇచ్చే చేస్తున్నామని వాదిస్తోంది ఎమ్మెల్యే శిబిరం. తనకు పోటీగా బోరబండలో కొందరు వ్యక్తులను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారనేది ఫసియుద్దీన్ వాదన. ఈ అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి ఆయన తీసుకెళ్లారట. ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరు.. తన డివిజన్‌లో చేస్తున్న కార్యక్రమాలు.. చేపడుతున్న పనులను వెల్లడించారట. పైకి ఈ సమస్య చిన్నదిగా కనిపించినా.. క్షేత్రస్థాయిలో సెగలు రేపుతోందని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఈ సమస్యపై పార్టీ పెద్దలు సకాలంలో దృష్టి పెట్టకపోతే.. శ్రుతి మించిపోతుందనే అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో ఉందట. ఇద్దరికీ ఎక్కడ చెడింది..? ఎందుకు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారో.. కూర్చోబెట్టి మాట్లాడిస్తే వాతావరణం తేలికపడొచ్చని కొందరు అనుకుంటున్నారట. లేదంటే రాజకీయంగా ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారట. ఇప్పటికే సమస్య పార్టీ పెద్దల దృష్టిలో ఉండటంతో.. వారు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. పిలుపు రాగానే రెండు వర్గాలు గట్టిగా తమ వాదన వినిపించేందుకు సిద్ధ పడుతున్నాయట. మరి.. సిటీలోని కీలక నియోజకవర్గంలో రేగిన రగడను టీఆర్‌ఎస్ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.