ఆ నియోజకవర్గంలో ఆశావహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందా? టికెట్ కోసం బలమైన లాబీయింగ్‌లు చేస్తున్నారా? మొన్నటి వరకు ముగ్గురు మధ్య పోటీ ఉంటే.. ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చాడా? ఇంతకీ కొత్తగా చర్చల్లోకి వచ్చిన ఆ నేత ఎవరు? ఇప్పటికే చర్చల్లో నలుగుతున్న నాయకులు ఎవరు? లెట్స్ వాచ్..!
మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. బరిలో ఉన్నామని చెప్పుకుంటూ క్షేత్రస్థాయిలో పనులు చేసుకుంటున్నారు ముగ్గురు నాయకులు. దీంతో మూడు గ్రూపులు ఉప్పల్ గులాబీ శిబిరాన్ని వేడెక్కిస్తున్నాయి. తాజాగా మరో నేత.. నేను సైతం అని ఆసక్తి చూపడంతో రచ్చ రచ్చ అవుతోందట.
ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా భేతి సుభాష్‌రెడ్డి ఉన్నారు. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. గత ఎన్నికల సమయంలోనే ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన బండారి లక్ష్మారెడ్డి సైతం ఉప్పల్ టీఆర్ఎస్ టికెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్నారు. బొంతు, బండారి లెక్కలు ఎలా ఉన్నా… సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే అవకాశం ఇస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు సుభాష్‌రెడ్డి. ఈ ముగ్గురు మధ్య టికెట్ పంచాయితీ కొత్త పుంతలు తొక్కుతుంటే.. ఇప్పుడు నాలుగో కృష్ణుడి సందడి ఉప్పల్ టీఆర్ఎస్‌లో ఎక్కువైందట. గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌గా ఉన్న మోతె శ్రీలతా రెడ్డి భర్త శోభన్‌రెడ్డి సైతం తన వర్గంతో కలిసి కార్యక్రమాల స్పీడ్ పెంచారట. శోభన్ భార్య శ్రీలత సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తార్నాక డివిజన్ కార్పొరేటర్. ఆయన పేరు అప్పట్లో సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ వర్గాల చర్చల్లో నలిగింది. అక్కడ లాభం లేదని అనుకున్నారో ఏమో.. ఉప్పల్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట శోభన్‌రెడ్డి. దాంతో ఆశవహుల సంఖ్య పెరిగి నాలుగు స్తంభాలట మొదలైందట.
మొదటి నుంచి టీఆర్ఎస్‌లో ఉన్న శోభన్‌రెడ్డి.. తనకున్న పరిచయాల ద్వారా టికెట్ కోసం.. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు పావులు కదుపుతున్నారట. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల వాడి అన్నట్టుగా ఆయన దూకుడు ఉందని మిగతా ముగ్గురు నాయకులు అభిప్రాయపడుతున్నారట. 2009, 2014, 2018 ఎన్నికల్లోనే ఉప్పల్ సీటును ఆశించారని… దానిని దృష్టిలో పెట్టుకుని ఈ దఫా తప్పక ఛాన్స్ ఇస్తారని శోభన్ శిబిరం భావిస్తోందట. ఇటీవల ఆగస్టు 15తోపాటు.. శోభన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అట్టహాసంగా నిర్వహించి.. ప్రత్యర్థులకు కునుకు లేకుండా చేశారట.
ప్రస్తుతం నలుగురు నాయకులు ఉప్పల్‌లో బలప్రదర్శనలకు సిద్ధం అవుతున్నారు. ఆమధ్య బొంతు రామ్మోహన్ తన అనుచరులను గోవా, తిరుమల, యాదాద్రి తీసుకెళ్లారు. అది పార్టీ వర్గాల్లో చర్చగా మారింది. తన వర్గంలోని వారు జారిపోకుండా ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లక్ష్మారెడ్డి సైతం రాజకీయ కుటుంబం నుంచి రావడంతో ఆ స్థాయిలోనే వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పుడు శోభన్ వారికి పోటీగా రావడంతో.. ఇది ఇక్కడితో ఆగుతుందో లేక కొత్తవాళ్లు ఇంకా యాడ్ అవుతారో అనే చర్చ సాగుతోంది. మరి ఎన్నికల నాటికి ఇంకెన్ని చిత్రాలు చూడాలో కాలమే చెప్పాలి.