Off The Record : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైందా? కదనోత్సహంతో ఉన్న కాంగ్రెస్ ముందడుగు వేయాలని డిసైడ్ అయ్యిందా..!? జూబ్లీ గెలుపు ఇచ్చిన కిక్‌తో… మంచి తరుణం మించిన దొరకదనుకుంటూ… లోకల్ వార్‌కు రెడీ అయ్యిందా? కోర్ట్‌లో ఉన్న కేసు సంగతేంటి? బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో ఏం చేస్తారు?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం ఇచ్చిన కిక్‌తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈనెల 24న హైకోర్టులో బెంచ్ మీదికి రానుంది. కోర్టు ఆదేశాల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఆ తీర్పు సానుకూలంగా ఉంటే… ఇక దూకుడుగా వెళ్ళాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఇన్నాళ్లు ప్రయత్నం చేసింది కాంగ్రెస్. కానీ… న్యాయస్థానాల్లో చిక్కులు ఎదురయ్యాయి. దీంతో పెండింగ్‌లో పడింది వ్యవహారం. అయితే కోర్ట్ తీర్పు ఎలా ఉన్నా… పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్దామని మెజార్టీ క్యాబినెట్ మంత్రులు చెబుతున్నారట.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన ఇబ్బందులు రావడంతో పాటు… కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం అవుతున్నాయని, అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్న వాదన బలంగా ఉంది. బీసీలకు 42 శాతం ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్‌తో ఉన్నా… న్యాయ పరమైన చిక్కులతో అది ఇప్పట్లో తేలే అవకాశం కనిపించట్లేదన్నది విశ్లేషకుల మాట. కానీ… ఇప్పటికే పిటిషన్ ఉన్నందున ఈనెల 24న ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి అడుగు ముందుకేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్ పై అనేక విమర్శలు… సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ వచ్చాయి.
ప్రతిపక్షం కూడా తీవ్ర స్థాయిలో చేసిన వ్యతిరేక ప్రచారంతో… ఒక దశలో కాంగ్రెస్ క్యాడర్ కూడా డైలమాలో పడిందట. కానీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచాక పార్టీలో టాప్ టు బాటమ్ కాన్ఫిడెన్స్ పెరిగిందని అంటున్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్న నియోజకవర్గంలోనే 25వేల వోట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవడం చిన్న విషయం కాదని అంటున్నారు. ఇదే జోష్‌తో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా గెలిచి తీరాలని భావిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పార్టీ సింబల్‌తో ఎన్నికలకు వెళ్తేనే బెటర్ అన్న ఆలోచన కూడా ఉందట. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సర్వేలు కూడా నిర్వహించింది. 80 శాతానికి పైగా వాతావరణం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం. అన్నీ చూసుకుంటే… స్థానిక ఎన్నికలకు ఇదే సరైన సమయం అని కొంతమంది మంత్రులు సీఎంకు చెబుతున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది ప్రభుత్వం. త్వరలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న క్రమంలో… ఉత్సవాలకు సిద్ధమవుతోంది. దీంట్లో కూడా అభివృద్ధి… కాంగ్రెస్ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించే పనిలో ప్రభుత్వం ఉంది. వీటన్నిటినీ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు కనుగుణంగా వ్యవహరించాలని చూస్తోంది.
READ ALSO: Hasina Wedding Anniversary: బంగ్లా మాజీ ప్రధానికి మ్యారేజ్ డే రోజునే మరణశిక్ష!