Site icon NTV Telugu

ఇష్టం లేకున్నా రాజ్‌భవన్‌కు కేసీఆర్‌..! నువ్వుల వెనుక..?

Ysrcp Otr

Ysrcp Otr

దాదాపు తొమ్మిది నెలల తర్వాత ముఖ్యమంత్రి కేసియార్ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. కీలక సందర్భాల్లోనూ అటు వైపు చూడకపోవడంతో దూరం మరింత పెరిగింది. కేబినెట్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని చాలాకాలంపాటు పెండింగ్‌లో ఉంచడంతో ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలవలేదు. గవర్నర్‌ వెళ్లిన సమ్మక్క సారక్క జాతరలోనూ.. భద్రాచలం పర్యటనలోనూ ప్రొటోకాల్ కనపడలేదు. మంత్రులు…అధికారులు గవర్నర్ వచ్చే సమయానికి మాయం అయ్యారు. తమకు సమాచారం ఇవ్వకుండా వస్తున్నారని చెప్పుకొన్నారు.

మరో అభ్యర్థిని గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలో పంపిన తర్వాత ప్రభుత్వం గవర్నర్‌ తమిళిసైపై అటాక్ మొదలు పెట్టింది. గవర్నర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. వాటికి మంత్రులు ఘాటుగా కౌంటర్ ఇవ్వడంతో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ల వైఖరిపై చర్చ జరిగింది. రాజ్‌భవన్‌లో జెండా ఆవిష్కరణకు కూడా ముఖ్యమంత్రి వెళ్లలేదు. ఆ తర్వాత గవర్నర్ రాజ్‌భవనలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం.. మహిళా దర్బార్ నిర్వహించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో రాజ్‌భవన్‌లో హైకోర్టు సీజే ప్రమాణస్వీకారానికి సీఎం వెళతారా లేదా అన్న చర్చ జరుగుతున్న సమయంలో కేసియార్ అక్కడ ప్రత్యక్షమయ్యారు.

అంతర్గతంగా గ్యాప్‌ ఉన్నా బయటికి మాత్రం ముచ్చటించుకున్నట్టే కనిపించారు. ప్రొటోకాల్‌ ప్రకారం బొకే ఇవ్వడం …తేనేటి విందులో మాటలు కలపడం…మధ్యలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉండటంతో వాతావరణం మరింత తేలికగా కనిపించింది. ఇద్దరూ సీజే కార్యక్రమంలో ఉల్లాసంగా కనిపించారు. కేసియార్ రాజ్‌భవనలో అడుగుపెట్టడంతో తొమ్మిది నెలల గ్యాప్‌కు ఫుల్ స్టాప్ పడింది. రాజ్‌భవన్‌ సన్నివేశం తర్వాత కూడా ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న మిగిలే ఉంది. ఇకపై రాజ్‌భవన్‌కు ముఖ్యమంత్రి కేసియార్ వెళతారా ? లేక అంతేనా ? అన్నది ఇప్పుడు తేలాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ కావడం, రాజ్‌భవన్‌లోనే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండటంతో తప్పని పరిస్థితుల్లో కేసియార్ వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్‌తో ఇదే విధంగా కంటిన్యూ అవుతారా అన్న దానిపై మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.

Exit mobile version