నల్లు ఇంద్రసేనారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. అప్పట్లో వేళ్లమీద లెక్కపెట్టే బీజేపీ నేతల్లో ఒకరు. గతంలో బీజేపీకి రాష్ట్ర చీఫ్‌గానూ పనిచేశారు ఇంద్రసేనారెడ్డి. ప్రస్తుతం బీజేపీలో ఇతర పార్టీల నాయకుల చేరికలకు సంబంధించిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డితోపాటు ఆ కమిటీలో ఏడుగురు పార్టీ నేతలు సభ్యులు. తెలంగాణలో బీజేపీలో ఎవరైనా చేరాలి అని అనుకుంటే ఈ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చేవారి వల్ల పార్టీకి ఏ మేరకు లాభం.. వాళ్ల బ్యాక్‌గ్రౌండ్.. తదితర అంశాలను వాకబు చేయాల్సిన బాధ్యత ఈ కమిటీదే. ఈ విషయాలలో ఇంద్రసేనారెడ్డి నిక్కచ్చిగా ఉంటారు.. బీజేపీ లైన్‌లో ఆలోచిస్తారు.. ఆయన ఒకే అంటే పార్టీలో ఇంకేవరూ ఊహూ అనబోరని లెక్కలేసుకున్నారు కమలనాథులు. కానీ.. సీన్ రివర్స్. ఆ క్రమంలోనే కాషాయ శిబిరంలో చర్చల్లోకి వస్తున్నారు ఇంద్రసేనారెడ్డి.
చేరికల కమిటీ వేసి నెలలు గడుస్తున్నా.. ఇంద్రాసేనారెడ్డి అండ్ బ్యాచ్ చేసింది ఏంటి అంటే..? ఏమీ లేదని చెవులు కొరుక్కుంటున్నారట పార్టీ నేతలు. అయితే ఇంద్రాసేనారెడ్డికి పని అప్పగిస్తే ఖాళీగా ఉండబోరని పార్టీ నేతల అభిప్రాయం. ఆ మేరకు కొంత వర్కవుట్ చేశారని టాక్. బీజేపీలో చేరేవారు ఎవరు? అనే దానిపై ఒక జాబితా సిద్ధం చేశారట. ఆ లిస్ట్‌ను పార్టీ పెద్దల ముందు పెట్టినట్టు తెలుస్తోంది. కానీ.. ఆ పేర్లపై పార్టీలోని కీలక నేతలు పెదవి విరిచినట్టు సమాచారం. కొందరికి ఆ జాబితాలోని పేర్లు నచ్చలేదట. ఒకసారి బీజేపీలోకి వచ్చి వెళ్లిన వారి పేర్లు ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయట. ఆ విషయంలో తన స్టాండ్‌ను గట్టిగా వినిపించారట ఇంద్రసేనారెడ్డి.
బీజేపీలో చేరికలపై జరిగిన వాదోపవాదాలు నేతల మధ్య హీట్ రాజేసినట్టు తెలుస్తోంది. పార్టీ నేతల అభ్యంతరాలను చూసిన తర్వాత.. ఇలా అయితే బీజేపీలో చేరేవారు ఎవరుంటారు అనే ఫీలింగ్‌లో ఇంద్రాసేనారెడ్డి ఉన్నారట. ఈ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే తమ కమిటీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారట. కత్తి డాలు లేని ఈ బాధ్యతలు తనకెందుకు.. వద్దు అని ముఖం మీదే చెప్పేశారట ఇంద్రసేనారెడ్డి. బీజేపీలో చేరేందుకు తన దగ్గరికి వచ్చే నేతలకు ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది. జిల్లా నాయకులు వచ్చి ఫలానావాళ్లు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెబితే.. తెగ ఇబ్బంది పడుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో చేరికల కమిటీకి ఛైర్మన్‌గా కొనసాగితే.. ఉన్న గౌరవం పోతుందనే ఆందోళనలో ఉన్నారట ఇంద్రసేనారెడ్డి. రాజకీయంగా బదనాం అయిపోతామని టెన్షన్ పడుతున్నారట. మరి.. సీనియర్ బీజేపీ నేత లేవనెత్తిన అంశాలపై పార్టీ పెద్దలు పునారాలోచన చేస్తారో లేక ఇంద్రసేనారెడ్డే తప్పుకొంటారో చూడాలి.