తెలంగాణలో పాగా వేయాలని చూస్తోన్న బీజేపీలో ఇంఛార్జులు ఎక్కువయ్యారా? ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో.. ఇంకెందరొస్తారో కమలదళానికి అర్థం కావడం లేదా? పార్టీ నేతల సందేహాలు తీర్చేదెవరు? ఎందుకీ వైచిత్రి..? కేడర్‌కు.. లీడర్లకు క్లారిటీ వస్తుందా?
జాతీయ పార్టీలకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జులు ఉంటారు. వారికి సహాయకులుగా మరికొందరు జాతీయ నాయకులను డంప్ చేస్తారు. ఇంఛార్జుల సంఖ్యలో.. నియామకాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైఖరి దాదాపుగా ఒకేలా ఉంటుంది. రెండు పార్టీల మధ్య పనిచేసే పద్ధతే భిన్నం. బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు లేదా పార్టీలో సీనియర్లను ఇతర రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లుగా నియమిస్తుంది. ఆ విధంగా తెలంగాణ బీజేపీకి ఇంఛార్జ్‌గా ఉన్నారు తరుణ్‌చుగ్. సంస్థాగత వ్యవహారాలు చూసేందుకు శివప్రకాష్ అనే మరో జాతీయ నేత కూడా తెలంగాణకు వస్తుంటారు. శివప్రకాష్ రెండు మూడు రాష్ట్రాల్లో పార్టీ పనులు చక్కబెడుతుంటారు. ఇంత వరకు క్లారిటీ ఉన్నప్పటికీ.. ఇటీవల బీజేపీ నేత సునీల్ బన్సల్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించి.. ఒడిశా, పశ్చిమబెంగాల్‌తోపాటు తెలంగాణ రాష్ట్రాలకు ఇంఛార్జ్‌గా ఉంటారని బీజేపీ ప్రకటించింది. ఈ ప్రకటనే రాష్ట్ర కమలనాథులను గందరగోళంలో పడేసిందట.
రాష్ట్రానికి ఇంఛార్జులతోపాటు సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఉంటారు. ఆ హోదాలో పనిచేసిన మంత్రి శ్రీనివాస్‌ను పంజాబ్ పంపేశారు. ఆ ప్లేస్ ఖాళీ. పార్టీ పరంగా కీలకమైన ఆ పోస్టును భర్తీ చేయకుండా.. ఇంఛార్జ్‌లను డంప్ చేయడం బీజేపీ నేతలకు అర్థం కావడం లేదట. ఇప్పుడు తెలంగాణ బీజేపీకి ఇద్దరు ఇంఛార్జులా అనే సందేహాలు కలుగుతున్నాయట. సునీల్ బన్సల్ ఇంకా ఫీల్డ్ ఎంట్రీ ఇవ్వకపోయినా.. ఇంఛార్జ్ హోదాలో తరుణ్‌చుగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చగా మారింది. కొందరు ఈ విషయాన్ని తరుణ్ చుగ్ దగ్గర ప్రస్తావించారో ఏమో.. ఆయన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారట. తాను రాజకీయ వ్యవహారాలు చూసుకుంటే.. బన్సల్ సంస్థాగత వ్యవహారాలు పర్యవేక్షిస్తారని తరుణ్ చుగ్ వెల్లడించారట. కానీ.. ఆ సమాధానంతో రాష్ట్ర బీజేపీ నేతలు సంతృప్తి చెందలేదని సమాచారం. బన్సల్ నియామకంలో సంస్థాగత వ్యవహారాల ప్రస్తావన లేకపోవడంతో చుగ్ మాటలను విశ్వసించలేని పరిస్థితి ఉందట.
కేంద్ర నాయకత్వం తెలంగాణకు ఎవరిని పంపినా కలిసి పనిచేస్తాం.. వారి గైడెన్స్ తీసుకుంటాం.. కానీ.. పని విభజన లేకపోతే కీలక సమయంలో లేనిపోని సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతున్నారట బీజేపీ రాష్ట్ర నేతలు. బన్సల్ నియామకం తర్వాత ఆయన ట్విటర్ స్టేటస్‌లో చేసుకున్న మార్పు.. బన్సల్‌ను అభినందిస్తూ బీజేపీ సంస్ధాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ చేసిన ట్వీట్ మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోందని ఆంతరంగిక సమావేశాల్లో పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. స్పెషల్ అటెన్షన్ అంటే ఏంటో.. ఇంఛార్జ్ అంటే ఏంటో స్పష్టత ఇస్తే రాష్ట్రస్థాయి నాయకత్వానికి కూడా ఇబ్బంది ఉండదనేది కొందరి వాదన.
బీఎల్ సంతోష్ ట్వీట్‌లో బన్సల్ హోదాను స్పెషల్ అటెన్షన్‌తో పోల్చడంతో.. మరి ఇప్పటికే పార్టీ పనిలో ఉన్న శివప్రకాష్ పరిస్థితి ఏంటనేది మరికొందరి ప్రశ్న. ఆయన పార్టీ పనుల నుంచి తప్పుకోలేదు. రాష్ట్రానికి వస్తున్నారు.. అప్పగించిన పని చేసుకుపోతున్నారు. తెలంగాణలో బలపడాలని చూస్తున్న తరుణంలో చేస్తున్న పార్టీ నియామకాలు సంతోషాన్ని కలిగిస్తున్నా.. అదే సమయంలో గందరగోళానికి దారితీస్తున్నాయనేది కమలనాథుల వాదన. మరి.. జాతీయ నాయకత్వం పని విభజనలో స్పష్టత ఇస్తుందో లేదో చూడాలి.