Off The Record: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల జెడ్పీ పీఠాలు ఇప్పుడు రెండు చోట్ల టీడీపీలో అలజడి రేపుతున్నాయట. పదవులు దక్కలేదని ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న పార్టీ సీనియర్స్ ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ పావులు కదుపుతుండటం ఆసక్తికరంగా మారుతోంది. వీటికి రిజర్వేషన్ ఏంటన్నది ఇంకా తేలలేదు. కానీ… ఆశావహులు మాత్రం అప్పుడే లెక్కలు వేసేసుకుంటున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చింది.. ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తోంది, చాలా మందికి నామినేటెడ్ పదవులు కూడా దక్కాయి. కానీ… మాకేంటీ ఖర్మ, మాకే ఎందుకిలా అంటూ ఉమ్మడి విజయనగరం జిల్లా సీనియర్స్ కొందరు తీవ్ర అసహనంతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళే ఇప్పుడు విభజిత జిల్లాల జడ్పీ పీఠాలపై కన్నేసి ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నట్టు ప్రయత్నాలు చేస్తున్నారట. రిజర్వేషన్ ఖరారు అవకున్నా….. ఒకవేళ తమ సామాజికవర్గానికి అనుకూలంగా వస్తే… జెడ్పీ చైర్మన్ సీటు ఇతరులకు వెళ్ళకుండా ముందే జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గంలో గతంలో వర్గ విభేదాలు బలంగానే కనిపించాయి. దత్తి లక్ష్మణరావుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు అప్పట్లో చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. ఆయనకు పార్టీ పదవి దక్కింది. అయినా… నేను కోరుకున్నది అది కాదన్నట్టుగా… కీలక పదవిపై దత్తి కన్నేశారన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. రిజర్వేషన్ అనుకూలిస్తే.. జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారన్నారట ఆయన. ఇక విజయనగరం జిల్లా పరిషత్ పీఠం చుట్టూ కూడా టీడీపీలో రాజకీయ లెక్కలు మొదలయ్యాయి. నెల్లిమర్ల నియోజకవర్గం గ్రూపు రాజకీయాలు మొదట్నుంచి పార్టీకి సవాల్‌గానే ఉన్నాయి. నామినేటెడ్ పదవుల కోసం పలువురు సీనియర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. సువ్వాడ రవిశేఖర్, వనజాక్షి, కడగల ఆనంద్ కుటుంబాలు తొలి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాయని అంటున్నారు వారి అనుచరులు. మరోవైపు కంది చంద్రశేఖర్, కర్రోతు వర్గాలు కూడా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.
వీరిలో కొంతమందికి ఇప్పటికే దక్కినా.. మిగిలిన వర్గాల్లో మాత్రం అసంతృప్తి కొనసాగుతోందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో….స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలవుతున్న వేళ.. జెడ్పీ చైర్మన్ పీఠం అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయనగరం జిల్లాలో ఇప్పటికే వివిధ పదవులు పొందిన సీనియర్లలో కొందరు కూడా జెడ్పీ పీఠంపై ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. కిమిడి నాగార్జున, గొంప కృష్ణ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు పాత వర్గాలు.. మరోవైపు కొత్త సమీకరణలు. ఇప్పటికే పదవులు దక్కిన నేతలు.. ఇంకా అవకాశం కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు. వీటన్నింటి మధ్య జెడ్పీ చైర్మన్ పదవి భవిష్యత్ టీడీపీ రాజకీయ పరిణామాల్లో కీలకం కావచ్చని అంటున్నారు. రిజర్వేషన్‌ను బట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

