వాళ్లిద్దరి మాట వేరు.. బాట వేరు. మొన్నటి వరకు ఒకేపార్టీలో ఉన్నా.. ఎన్నికలకు ముందు వేర్వేరు పార్టీల్లో ఉండిపోయారు. ఇప్పుడు సడెన్‌గా వారిద్దరి మాట-బాట కలిసింది. అది అంతవరకే పరిమితం అవుతుందా? అంతకుమించి ఇంకేమైనా ఉంటుందా అనే ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఎవరా నేతలు..?
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కలిపిందా?
టీడీపీలో కీలక నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి లేకున్నా.. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నా.. ఆ పార్టీ నుంచి ఆనం బయటకు వెళ్లిపోవడానికి దారితీసిన కారణాల్లో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సోమిరెడ్డి కూడా ఒకరనే ప్రచారం అప్పట్లో గట్టిగానే జరిగింది. ఆనం పార్టీ మారినప్పటి నుంచి వీరిద్దరి మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవనే చెప్పాలి. ఇలా వేర్వేరు శిబిరాల్లో ఉన్న వీరిద్దరిని కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కలిపినట్టే కనిపిస్తోంది.
అడ్డదిడ్డంగా జిల్లా విభజన చేస్తున్నారని ఆనం ఫైర్
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాల విభజనపై అధికారపార్టీలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు ఉన్నా ఎవరూ నోరు మెదపడం లేదు. హైకమాండ్‌కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. కానీ ఆనం తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ప్రజలతోకానీ.. ప్రజాప్రతినిధులతో కానీ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా నెల్లూరు జిల్లా విభజన చేస్తున్నారని మండిపడ్డారు ఆనం. అడ్డదిడ్డంగా జిల్లాల విభజన చేస్తే అంతిమంగా అది ప్రాంతాల మధ్య నీటి కొట్లాట్లకు దారి తీస్తుందని స్థానికంగా ఉన్న పరిస్థితులను ఆయన వివరించారు. ఇదే సమయంలో ఆనం ఏ లైన్‌లో మాట్లాడారో.. దాదాపు అదే లైనులోనే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి కూడా స్పందించడం చర్చగా మారింది.
సోమిరెడ్డి కామెంట్స్ తర్వాత రకరకాల ఊహాగానాలు
ఈ స్థాయిలో చర్చకు దారితీయడానికి కారణాలు లేకపోలేదు. కొంత కాలంగా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలను ఆనం ఏదోక సందర్భంలో.. ఏదోక వేదిక మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా జిల్లాల విభజన జరుగుతున్న తీరును తప్పుపట్టారు ఆనం. జిల్లాల విభజన అనే కాకుండా.. మిగిలిన అంశాల్లో కూడా ఆనం అసంతృప్తితోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన కామెంట్స్‌కు సపోర్ట్‌గా సోమిరెడ్డి నిలవడంతో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.
త్వరలో ఆనం, సోమిరెడ్డి భేటీ?
జిల్లాల విభజన ప్రక్రియలో స్థానికంగా ఉన్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్లాలని.. స్థానికంగా ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ అధినాయకత్వం సూచించింది. రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లె వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాల్లో లోకల్ టీడీపీ నేతలు యాక్టివ్‌గానే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా విభజనపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్త గళం వినిపించడం.. దానినే అజెండాగా తీసుకోవాలని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశం మీద ఆనంతో సోమిరెడ్డి భేటీ కానున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే కనుక జరిగితే.. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగడం ఖాయం.
ఆనం-సోమిరెడ్డి భేటీతో కీలక పరిణామాలకు ఆస్కారం..!
ఆనం-సోమిరెడ్డి మధ్య భేటీ జరిగితే అది కేవలం జిల్లా విభజనకే పరిమితం కాకుండా.. ఇతరాత్ర పరిణామాలు.. మిగిలిన అంశాల జోలికి కూడా వెళ్లొచ్చనేది టీడీపీలో చర్చ జరుగుతోంది. ఆ తరహా ప్లానింగ్‌తోనే జిల్లా విభజనపై ఆనం అభ్యంతరం వ్యక్తం చేయడం.. ఆనం చెప్పింది కరెక్టేనని సోమిరెడ్డి రియాక్ట్ అయ్యారని అనుకుంటున్నారట. మరి.. వీరిద్దరి భేటీ జరుగుతుందో లేదో చూడాలి.
