గత నెల 19న ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. 23న పోలీసులు అనంతబాబును అదుపులోకి తీసుకున్నారు. అయితే మధ్యలో నాలుగు రోజులు ఆ సమస్యను హైలైట్ చేయడానికి టీడీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర స్థాయిలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది కూడా. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ ఘటనపై టీడీపీకే చెందిన జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా ఎక్కడా పెదవి విప్పింది లేదు. అనంతబాబుకు జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా కుటుంబాలకు బంధుత్వం ఉంది. ఆ కారణంగానే వారు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లినట్టు టాక్.
గత ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ తరఫున జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు నుంచి వరుపుల రాజా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గాలకు వారే పార్టీ ఇంఛార్జులు. ఘటన జరిగినప్పుడు వాళ్లిద్దరూ మాట్లాడితే బాగుంటుందని టీడీపీ నాయకులు వారి దృష్టికి తీసుకెళ్లారట. ఎమ్మెల్సీ అనంతబాబు గురించి తాము ఎన్ని మాట్లాడినా పొలిటికల్ విమర్శలుగానే ఉంటాయని.. మీరు మాట్లాడితే మరింత మైలేజ్ వస్తుందని చెప్పారట. దానికి కూడా వాళ్ల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదట. విషయం వెలుగులోకి వచ్చిన కొద్దిగంటల్లోనే మాజీ హోంమంత్రి చినరాజప్ప వెళ్లి డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబాన్ని పరామర్శించారు. అప్పుడు కూడా నెహ్రూను వెంట తీసుకెళ్దామని ప్రయత్నించినా అటునుంచి సౌండ్ లేదట.
జ్యోతుల నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. నవీన్ సీన్‌లోకి వచ్చినా పెద్దగా ఇన్వాల్వ్ కాలేదట. వచ్చామా వెళ్లామా అన్నట్టు వ్యవహారాన్ని డీల్ చేశారట. మహానాడు ముగిసిన తర్వాత జ్యోతుల నెహ్రూ పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెడదామని అనుకున్నారట. ఆ విషయాన్ని పార్టీలో సీనియర్లు దృష్టికి తీసుకుని వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే అటు నుంచి ఎవరూ స్పందించలేదట. అనంతబాబు వ్యవహారంలో లేని శ్రద్ధ ఇప్పుడెందుకని నెహ్రూ, రాజాలపై సెటైర్లు వేసినట్టు తెలుస్తోంది. టీడీపీకి ప్లస్ అయితేనే అందరికీ ఉపయోగం అని అంటున్నారట తెలుగు తమ్ముళ్లు.
గతంలో జ్యోతుల నెహ్రూ వైసీపీలో ఉన్నారు. శాసనసభపక్ష ఉపనేతగా కూడా పనిచేశారు. దీంతో ఆయనకు పాత పార్టీ వాసనలు, చుట్టరికాలు అడ్డు వచ్చాయో ఏమో అని శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారట. మహానాడు తర్వాత వీరిపై పార్టీలోని మిగతా నేతల స్వరం కూడా పెరుగుతున్నట్టు టాక్. బంధాలు.. బంధుత్వాలు ఏమైనా ఉంటే గడప లోపల తేల్చుకోవాలని.. పార్టీ వరకు బయటకొచ్చి మాట్లాడితే మరోలా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. పార్టీ లైన్‌లోనే వెళ్తే బాగుండేదని.. సొంత పెత్తనం వల్ల అందరికీ నష్టమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. అయితే రాజకీయాల కోసం బంధుత్వాలను వదిలేయాలా అనేది జ్యోతుల నెహ్రూ వర్గం వాదనగా ఉందట. మొత్తానికి ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్ జిల్లా టీడీపీలో విభేదాలకు బీజం వేసింది. ఈ విషయంలో ఎవరి వాదన వారిదే. మరి సమస్యకు అధినేత ఏ విధంగా ఫుల్‌స్టాప్ పెడతారో చూడాలి.