Site icon NTV Telugu

Off The Record: ఆ టీడీపీ నేతలు వైసీపీతో కలిసి పార్టీని తగలెట్టేస్తున్నారా?

Ctr

Ctr

Off The Record: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదారుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కక్కుర్తి కమండలాలుగా మారిపోయారా? కేడర్‌ వద్దు, గీడర్‌ వద్దు… ఓన్లీ క్యాష్‌ అంటున్నారా? దండిగా కమీషన్లు ఇచ్చే వైసీపీ నాయకులతో కుమ్మక్కయి సొంత పార్టీ నేతలనే ఇబ్బందులు పెడుతున్నారా? ప్రభుత్వం మారినా… మా కష్టాలు తీరలేదంటూ ద్వితీయ శ్రేణి నిస్పృహలోకి వెళ్తోందా? సీఎం సొంత జిల్లాలో అసలేం జరుగుతోంది?

Read Also: Off The Record: అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుపై జిల్లా వాసుల ఆగ్రహం

శేఖర్ నాయుడు.. గ్రానైట్ వ్యాపారి అండ్‌ టీడీపీ చిత్తూరు జిల్లా స్థాయిలో ద్వీతీయ శ్రేణి నాయకుడు. జీడీ నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలలో ఆయనకు క్వారీలున్నాయి. దాదాపు పాతికేళ్ళ నుంచి ఇదే వ్యాపారంలో ఉన్న శేఖర్‌…అవసరమైన సందర్భాల్లో పార్టీకి అంతో ఇంతో ఆర్థికంగా కూడా చేయూతనిచ్చేవాడట. అయితే.. వైసీపీ హయాంలో ఆయన్ని వ్యాపార పరంగా చాలా ఇబ్బందులు పెట్టారని, వైసీపీ పెద్దలు కొందరు క్వారీలను ఆక్రమించి తవ్వుకున్నారన్న ఆరోపణలున్నాయి. దాంతో ఆర్థికంగా చితికి పోయిన శేఖర్‌ నాయుడు… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గట్టిగానే ఆశలు పెట్టుకున్నారట. ఇక తన వ్యాపారానికి ఢోకా ఉండదని అనుకుంటున్న టైంలో సొంత పార్టీ నాయకులే… వైసీపీకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆత్మహత్య చేసుకోబోయారాయన. ఇందుకేనా నేను ఇన్నేళ్ళు టీడీపీ జెండా పట్టుకుని తిరిగింది అన్నది ఆయన నిర్వేదం. ఒక్క శేఖర్‌ నాయుడే కాదు.. ప్రస్తుతం తెలుగుదేశంలో చాలామంది ద్వితీయ శ్రేణి లీడర్స్‌, కేడర్‌ పరిస్థితి ఇలాగే ఉందన్న అభిప్రాయం పార్టీలో టాప్‌ టు బాటమ్‌ బలపడుతోంది. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీ పెద్దలు ఇదే తరహాలో వ్యవహరించడం కారణంగా… 2019 ఎన్నికలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు మనస్ఫూర్తిగా పని చేయలేదని, దాని ఫలితాన్ని ఆ ఎన్నికల్లో అనుభవించారన్న వాదన బలంగా ఉంది.

Read Also: Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ మెహందీ కలకలం..

తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే వైఖరి పునరావృతం కావడంపై పెదవి విరుస్తున్నాయట టీడీపీ శ్రేణులు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లె, సహా జిల్లాలో చాలా చోట్ల తమ్ముళ్ళు నానా ఇబ్బందులు పడ్డట్టు చెప్పుకుంటారు. తమ ప్రభుత్వం వస్తే… ఆ బాధలన్నీ పోతాయని ఆశించిన వాళ్ళకు పోకపోగా… రెట్టింపు అయినట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అందుకు కారణం అన్నది ద్వితీయ శ్రేణి వెర్షన్‌. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా… ఆయనకు లోకల్‌ పాలిటిక్స్‌ మీద దృష్టి పెట్టేంత టైం ఉండదు. పోనీ… జిల్లాకు మంత్రి ఉన్నారా అంటే అదీలేదు. దీంతో… కంట్రోల్‌ చేసేవాళ్ళు లేక కొందరు ఎమ్మెల్యేలు ఆడింది ఆట, పాడింది పాటగా నడుస్తోందట. కేవలం కమీషన్‌ దందాల మీదే దృష్టి పెట్టిన ఐదారుగురు శాసనసభ్యులు చివరికి నమ్ముకున్న కేడర్‌ను కూడా అదే గాటన కట్టేసి చుక్కలు చూపిస్తున్నారట. మనతన అన్నది లేదు. కమీషన్స్‌ ఇస్తే చాలు… వైసీపీ వాళ్ళయినా, గతంలో ఇబ్బందులు పెట్టినా…. ఇప్పుడు నెత్తినెక్కించుకుంటున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. అందుకు శేఖర్‌ నాయుడే ఉదాహరణ అంటున్నారు. అతని కంటే ఘనుడు అచంట మల్లన్న అన్నట్లు గతంలో వైసీపీ నేతలు ఆక్రమించుకున్న శేఖర్ నాయుడు క్వారీల మీద ఇప్పుడు టీడీపీ ప్రజాప్రతినిధుల కన్ను పడిందట. ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యేల పంచన చేరిన కొందరు వైసీపీ నాయకులు.. తమకు ఆ క్వారీలతో పాటు ఇసుక, గ్రావెల్ అప్పగిస్తే… మీకు మంచి ఆదాయం చూపిస్తామని ప్రతిపాదన పెట్టారట. అందుకు తలూపేసిన కొందరు ఎమ్మెల్యేలు సదరు వైసీపీ నాయకులతో మిలాఖత్‌ అయిపోయి… తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఘొల్లుమంటోంది టీడీపీ కేడర్‌. ఇసుక ఒకరికి, గ్రావెల్ మరొకరికి, గ్రానైట్‌ ఇంకొకరికి అంటూ పంచేసి… అండగా ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో శేఖర్ నాయుడు పలుమార్లు పార్టీ పెద్దలను కలసినా… ప్రయోజనం లేకపోవడంతోపాటు.. అప్పులు ఇచ్చిన వారు ఇంటికొచ్చి బెదరిస్తుండటంతో గత్యంతరం లేక ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం.

Read Also: Dussehra 2025: దసరా రోజు పాలపిట్టను చూస్తే మంచిదా? అసలు మ్యాటరేంటంటే..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019 వరకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకునేవారు. కానీ….‌ ఇప్పుడు చిత్తూరు, సత్యవేడు, జీడీనెల్లూరు, తంబళ్లపల్లె, పూతలపట్టు, మదనపల్లె నియోజకవర్గాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయి… కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ నేతల పెత్తనాలే నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో హవా నడిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే ఇప్పుడు కూడా గనుల దందాలో చక్రం తిప్పుతున్నారన్నది తమ్ముళ్ళ ఆరోపణ, అసహనం. ఆ ఆరు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందన్న గుసగుసలు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. స్వయంగా ఎమ్మెల్యేలే కమీషన్ల కోసం ఇలా రాజీ రాజకీయం చేస్తుంటే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా కష్టాలు పడి కూడా పార్టీ జెండా వదలని మా సంగతేంటని నిలదీస్తున్నారు కార్యకర్తలు. కేవలం మైనింగ్‌తో సరిపెట్టకుండా… చిన్న చిన్న కాంట్రాక్ట్‌లు సైతం వైసీపీ వాళ్ళకే కట్టబెడుతూ….ఎమ్మెల్యేలు కక్కుర్తిపడుతున్నారని తీవ్ర ఆవేదనగా ఉందట కేడర్‌. జిల్లాకు కనీసం ఒక మంత్రి ఉన్నా…ఇలాంటి వాటిని ఆయన దృష్టికి తీసుకెళ్ళి కంట్రోల్‌ చేసే అవకాశం దక్కేదని, అదీ లేక, ఇదీ లేక మా గతి ఏంటి, మళ్ళీ ఎన్నికల్లో పనిచేయాలా వద్దా అని బహిరంగంగానే టీడీపీ ద్వితీయ శ్రేణి మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా ఏకిపారేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2019 ఫలితాలు కనబడతాయంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని డ్యామేజ్‌ కంట్రోల్‌ చేపడుతుందా లేదా అన్నదాన్ని బట్టి మా తదుపరి నిర్ణయం ఉంటుందని డైరెక్ట్‌గానే కామెంట్‌ చేస్తున్నారు తమ్ముళ్ళు.

Exit mobile version