రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం సహజం. ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఇలాంటి పొలిటికల్ వారే నడుస్తోంది. జిల్లాకు ఒకరిని చొప్పున టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరు రచ్చ చేస్తుంటే.. ఇంకొకరు బురద కడుక్కొంటున్నారు. మరి.. అంతిమంగా ఎవరు పైచెయ్యి సాధిస్తున్నారు? ఎవరి గేమ్‌ప్లాన్‌కు ఇంకెవరు చిత్తవుతున్నారు?
తాడిపత్రిలో మీడియా అటెన్షన్ క్యాచ్ చేసిన జేసీ!
గ్రౌండ్‌లో ఆడే ఆటల్లానే అటాకింగ్, స్ట్రాటజీ.. డిఫెన్స్ మోడ్ లాంటి విధానాలు రాజకీయ క్రీడల్లోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అటాకింగ్ వ్యూహంతో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒక్కో జిల్లాలో ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుని వేడి రాజేస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఇరుకున పెట్టడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పెద్దారెడ్డి ఏకంగా జేసీ ఇంటికెళ్లి హడావిడి చేశారు. ఫలితంగా తాడిపత్రి మున్సిపాలిటీని జేసీకి తాంబూలంలో పెట్టి ఇచ్చినట్టు అయ్యిందని వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్‌లో సమీక్ష పేరుతో మీడియా అటెన్షన్‌ను క్యాచ్ చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.
ఉమా అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ!
అలాగే కృష్ణా జిల్లా మైలవరంలోనూ మాజీ మంత్రి దేవినేనిఉమా వేసిన స్కెచ్‌లో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పడ్డారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. అక్రమ మైనింగ్ పేరుతో ఉమా పదిమందిని వేసుకుని వెళ్లి హడావిడి చేయడానికి ప్రయత్నిస్తే.. వైసీపీ కార్యకర్తల దూకుడుగా వెళ్లారని అనుకుంటున్నారు. ఫలితంగా ఉమాపై కేసులు.. అరెస్ట్.. జైలు వరకు వెళ్లింది. ఒక నియోజకవర్గంలోని అంశం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
పలాసలో మంత్రి అప్పలరాజుపై శిరీష అటాకింగ్!
నెల్లూరులో ఎమ్మెల్యే కాకాణి వర్సెస్ సోమిరెడ్డి!
శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుపై లక్ష్యంగా టీడీపీ నేత గౌతు శిరీష ఆరోపణలు మొదలుపెట్టారు. తనను కించపరిచేలా వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారని.. ఇదంతా మంత్రి కనుసన్నల్లోనే జరుగుతుందన్నది శిరీష అటాకింగ్ కంటెంట్. అలాగే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి.. అప్పులుపై PAC ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్నారు. వీటిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరణ ఇచ్చి తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డిపై, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వరస ఆరోపణలు చేస్తున్నారు.
టీడీపీ రాష్ట్రస్థాయిలో చర్చ కోరుకుంటోందా?
ఇదంతా చూస్తుంటే జిల్లాల వారీగా ఒక్కొక్కరిని టార్గెట్‌గా చేసుకుని.. ఆరోపణలు, విమర్శలు చేయాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. లోకల్ లెవెల్ ఇష్యూ అయినా రాష్ట్ర స్థాయిలో డిబేట్ జరగాలన్నది ప్రతిపక్షం ఎత్తుగడగా ఉంది. ఈ వ్యూహం పసిగట్టలేదో.. ఏమో టీడీపీ వేసిన బురదను కడుక్కోవటంలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు వైసీపీ నేతలు. దీనిపైనే చర్చ జరుగుతోంది. మరి.. రానున్న రోజుల్లో టీడీపీ రాజకీయ ఎత్తుగడలకు అధికారపార్టీ వ్యూహం మారుతుందా? లేక వారి అజెండాలో చిక్కుకుని వివరణ ఇవ్వటంలోనే కాలం గడిపేస్తుందో చూడాలి.