గల్లీలో కుస్తీ పడుతున్న నాయకులు ఢిల్లీలో భేటీ అయారా? దేని దారి దానిదే అని భావించారో ఏమో.. ఆయన తప్ప అంతా ఆ మీటింగ్‌కు వచ్చారట. ఇంతకీ ఆ సమావేశంలో మాటలు కలిశాయా… చేతలు కలిశాయా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏడాదిగా ఒకటే పంచాయితీ. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనుకూల వర్గం.. ఆయన్ని వ్యతిరేకించే వర్గం. ఈ రెండు శిబిరాల మధ్య నిత్యం ఏదో ఒక సంఘర్షణ తప్పడం లేదు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక… పార్టీలో కొందరు సీనియర్లు ఆయన్ని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో కీలక పదవుల్లో ఉన్న నాయకులు కలిసి మనసు విప్పి మాట్లాడుకున్న పరిస్థితి లేదు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్, మహేశ్వర్‌రెడ్డి వంటి నాయకులు.. రేవంత్‌తో కలిసిమెలిసి తిరిగిందీ లేదు. ప్రియాంక గాంధీ సమావేశానికి తనను పిలవలేదనే ఫీలింగ్‌లోనే ఉన్నారు మహేశ్వర్‌రెడ్డి. అయితే ప్రియాంకగాంధీతో భేటీ తర్వాత పార్టీలో జరిగిన పెద్ద పరిణామం.. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఒకే టేబుల్‌పై కూర్చోవడం.
ఢిల్లీలో రాహుల్ గాంధీ సభకు వెళ్లిన పార్టీ నేతలు అక్కడ రేవంత్ ఇంటికి వెళ్లారట. లంచ్ మీటింగ్ పెట్టుకున్నారని సమాచారం. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎంపీ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి.. మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ లాంటి నాయకులు రేవంత్ ఇంటికి వెళ్లిన వారిలో ఉన్నారట. మాటల సందర్భంగా తెలంగాణ రాజకీయాలు… కాంగ్రెస్ ప్రణాళికలపై చర్చించారట. మునుగోడు ఉపఎన్నికలో కలిసి పని చేయడం.. అభ్యర్ధి ఎంపిక… ఇతర అంశాలు చర్చకు వచ్చాయట. రేవంత్‌ను పీసీసీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసిన వాళ్లు కూడా విందుకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ట్విస్ట్ ఏంటంటే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఆ విందుకు వెళ్లలేదట.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రేవంత్ మధ్య గ్యాప్ కొనసాగుతూనే ఉంది. రేవంత్‌తో కలిసి పార్టీ వేదిక పంచుకొలేనని స్పష్టం చేశారు వెంకటరెడ్డి. అయితే.. రేవంత్ ఇంటికి వెళ్లిన కొందరు సీనియర్లు.. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికెళ్లి మాట్లాడారట. ఇక్కడో గమ్మత్తు ఉంది. ఒకే అపార్ట్‌మెంట్‌లో కింద కోమటిరెడ్డి.. పైన రేవంత్ ఉంటున్నా.. ఇద్దరూ కలుసుకోలేదట. ఇద్దరి మధ్య పంచాయితీ మునుగోడు ఉపఎన్నిక వరకు కొనసాగేట్టు కనిపిస్తోంది. అయితే ఎన్నికల ప్రచారం.. పని విభజన ప్రియాంక గాంధీ చూసుకుంటారనే లెక్కల్లో రేవంత్ ఉన్నారు. మునుగోడు ఎన్నికపై ఏఐసీసీ దిశా నిర్దేశం చేస్తుందని.. అంతా AICC కార్యదర్శుల పర్యవేక్షణలో జరుగుతుందని చెబుతున్నారట.
ఇప్పుడు పార్టీలో అంతా ఢిల్లీ విందు భేటీపైనే చర్చించుకుంటున్నారు. అయితే ఆ సమావేశంలో నేతల మనసులు కలిశాయా లేక మాటలే కలిశాయా అనేది ప్రశ్న. ఎడముఖాలు.. పెడముఖాలు పెట్టి నవ్వులు చిందించారట. నోటితో నవ్వుకుని నొసటితో వెక్కిరించుకున్నారు అనేవారు లేకపోలేదు. మరి.. ఢిల్లీ భేటీ ఫలితాలు ఏంటో కాలమే చెప్పాలి.