తేదీ నిర్ణయం కాకపోయినా.. హుజురాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీటు టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం. అందుకే ఉపఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థి ఎవరన్నది సస్పెన్స్‌గా మారింది. సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేస్తారా? ఇంకేమైనా లెక్కలు ఉన్నాయా? లెట్స్ వాచ్.
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరు?
హుజురాబాద్‌లో ఆత్మగౌరవం నినాదంతో ఈటల రాజేందర్ జనాల్లోకి వెళ్లి.. సానుభూతిని కూడగట్టే యత్నం చేస్తున్నారు. ఈటల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ అధికారపార్టీ టీఆర్‌ఎస్ బహుముఖంగా అక్కడ దృష్టి పెట్టింది. అయితే టీఆర్‌ఎస్ నుంచి పోటీలో నిలిచే అభ్యర్థి ఎవరు? పార్టీ ఎవరి పేరును పరిగణనలోకి తీసుకుంటుంది? పార్టీ దృష్టిలో ఉన్న అభ్యర్థి ఎవరు? ఆశావహుల్లో ఎవరు గట్టి అభ్యర్థి? పార్టీలో ఉన్నవారికి టికెట్ ఇస్తారా ఇతర పార్టీ నుంచి వచ్చే బలమైన నేతను బరిలో దించుతారా? ఇలా రకరకాల ప్రశ్నలు అక్కడి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.
అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారా?
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ నుంచి బలమైన అభ్యర్థి పోటీ చేస్తారన్నది అందరూ చెప్పేమాట. అయితే ఆ బలమైన అభ్యర్థి ఎవరన్నదే గులాబీ శ్రేణుల్లు ఉత్కంఠ రేపుతోంది. అభ్యర్థిని నిర్ణయించే దిశగా పార్టీ అధిష్ఠానం కూడా తీవ్రమైన కసరత్తే చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల ఆధారంగా టీఆర్‌ఎస్ కింది స్థాయి కార్యకర్తల నుంచి సర్వే రిపోర్టులు తెప్పించుకుని బలాబలాలను బేరీజు వేసుకుంటోందట.
ఇతర పార్టీ నేతలపై సర్వే రిపోర్టులు సిద్ధం?
ఇదే సమయంలో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఆశావహుల జాబితా రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే డజను మందికిపైగా నాయకులు తమ పేర్లను పరిశీలించాలని అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారట. అయితే సామాజిక, రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న పార్టీ పెద్దలు .. ఈటలకు ధీటైన వారు ఎవరా అని ఆరా తీస్తోందట. మాజీ ఎమ్మెల్యేలు.. రిటైర్డ్ ఐఏఎస్‌లు.. ఇతర పార్టీల నేతల గురించి సర్వే రిపోర్టులు తెప్పించుకున్నట్టు సమాచారం.
ముద్దసాని, కెప్టెన్ కుటుంబాల నుంచి ఒకరు ఉంటారా?
ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థి రేసులో పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం లేదా కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి అభ్యర్థి బరిలో ఉంటారని చెవులు కొరుక్కుంటున్నారు. దామోదర్ రెడ్డి సోదరుడు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన వేములవాడ టెంపుల్ అథారిటి వైస్ చైర్మెన్ ముద్దసాని పురుషోత్తంరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన సొంతూరు హుజురాబాద్ నియోజకవర్గంలోని మామిడాలపల్లి. దామోదర్ రెడ్డి ఇమేజ్, రెడ్డి సామాజికవర్గం ఓట్లు…టీఆర్ఎస్ బ్రాండ్ కలిస్తే విజయం ఈజీ అని అనుకుంటున్నారట. దామోదర్‌రెడ్డి తనయుడు కాశ్యప్‌రెడ్డి పేరు కూడా చర్చల్లోకి వస్తోంది. కాశ్యప్‌రెడ్డి టీడీపీ నుంచి 2014లో ఈటలపై పోటీ చేసి ఓడిపోయారు.
బలమైన బీసీ నేతను చేర్చుకుని పోటీలో పెడతారా?
కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి వొడితెల రాజేశ్వర్‌రావు మనవడు ప్రణవ్‌బాబు పేరు పరిశీలనలో ఉందట. ఒకవేళ ఈ రెండు కుటుంబాలను కాదని అనుకుంటే.. ఈటలపైకి బీసీ నేతనే ప్రయోగిస్తారని కొందరి అభిప్రాయం. మరో పార్టీ నుంచి బలమైన బీసీ నేతను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని బరిలో దించవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు.
హుజురాబాద్‌లో సాగర్ ఫార్ములా?
ఈటలకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అనుసరించిన ఫార్ములాను హుజురాబాద్‌లో అమలు చేస్తారట. సాగర్‌లో రాజకీయ అనుభవం లేని నోముల భగత్‌కు టికెట్ ఇచ్చి.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డినిపై గెలిచారు. ఇక్కడా అదే రిపీట్ కావాలని ఆశిస్తున్నారట. మరి.. టీఆర్‌ఎస్ ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేస్తుందో చూడాలి.