నిత్యం ఏదో ఒక సమస్య. ఒకటి కొలిక్కి వస్తే.. ఇంతలోనే మరో ఇబ్బంది. రాజకీయంగా ప్లస్‌లో పడ్డామన్న సంతోషం క్షణకాలమైన ఉండటం లేదట ఆ ఎమ్మెల్యేకు. ఆనందం ఆవిరైపోతోందట. ఇంతకీ ఎమ్మెల్యేకు వచ్చిన సమస్యేంటి? ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్!
ఆనంద్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి స్థానిక నేతలు ఫోకస్!
మెతుకు ఆనంద్. వృత్తిరీత్యా డాక్టరైన ఆనంద్.. రాజకీయాలపై ఆసక్తితో టీఆర్ఎస్‌లో చేరి.. 2018 ముందస్తు ఎన్నికల్లో వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డాక్టర్ల జేఏసీలో క్రియాశీలకంగా పనిచేశారాయన. ఎమ్మెల్యే అయ్యాక వికారాబాద్‌లోని టీఆర్ఎస్ నేతలు.. కార్యకర్తలు ఆనంద్‌పై ఫోకస్ పెట్టారు. ఆయన పార్టీలో ఉంటారా? ఉంటే స్థానికంగా బలపడతారా? తమ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఇలా చాలా ప్రశ్నలు వేసుకుని సమాధానం వెతికారు కొందరు.
శుభప్రద పటేల్‌కు పదవి రావడంతో ఊరట చెందిన ఎమ్మెల్యే!
మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లోనే ఉన్న వికారాబాద్ నేత శుభప్రద పటేల్‌కు స్థానికంగా ఇక్కడ పట్టుంది. పార్టీ తనను ఎప్పటికైనా గుర్తించకపోతుందా అని వేచిచూస్తూ ఉండిపోయారు. అయితే.. పటేల్ వల్ల తనకు ఇబ్బంది అనుకుంటున్న ఎమ్మెల్యే.. పైకి చెప్పకపోయినా ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తున్నారట. ఇంతలోనే పటేల్‌ను రాష్ట్ర బీసీ కమిషన్‌లో సభ్యుడి ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారట ఎమ్మెల్యే. నియోజకవర్గంలో తనకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు రావని భావించారట. కానీ.. కొత్త సమస్య వచ్చి పడిందట.
ప్రవీణ్‌కుమార్‌తో బంధుత్వం ఇబ్బంది తెచ్చిపెడుతుందా?
వీఆర్‌ఎస్ తీసుకుని బీఎస్పీ కండువా కప్పుకొన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే ఆనంద్‌కు ప్రవీణ్ కుమార్ దగ్గరి బంధువు. తనకు రిలేటివ్ అయినా.. రాజకీయం రాజకీయమే అని ప్రకటన చేశారు ఆనంద్. కానీ.. ఈ బంధుత్వం రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుందో అన్న ఆందోళన ఆనంద్‌లో ఉందట. పొలిటికల్ సర్కిళ్లలోనూ ఇదే చర్చ.
వికారాబాద్‌లో మరింత పట్టుకోసం ఎమ్మెల్యే యత్నం!
బయట ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నా.. పొలిటికల్‌గా వికారాబాద్‌లో తన ప్లేస్‌ను స్ట్రాంగ్ చేసుకునే పనిలో ఉన్నారు ఎమ్మెల్యే ఆనంద్. తన బంధువు బీఎస్పీలో ఉన్నా.. తాను మాత్రం టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని పార్టీ పెద్దలకు, నియోజకవర్గంలోని కేడర్‌కు స్పష్టం చేశారట. ఈ విషయంలో తాను క్లారిటీతో ఉన్నానని ఆనంద్ అనుకుంటున్నా.. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని కేడర్ చెవులు కొరుక్కుంటోందట.