అబ్బా ఏందిది సెగట్రీ అనుకుంటున్నారా ఎమ్మెల్యే. ఒకరితో తలనొప్పి ఉందని మరొకర్ని పెట్టుకుంటే… మళ్లీ అదే సమస్య ఇదంతా చివరాఖరికి ఎమ్మెల్యేకి చెడ్డపేరుతెస్తోందని గులాబీ పార్టీలో నడుస్తోందట. అసలు గతంలో ఉన్న పిఏ ను ఎందుకు తప్పించారు..? ఇప్పుడున్న పీఏతో వచ్చిన తంటా ఏంటి?
అందరు పీఏలు ఒక్కలా ఉండరు. కొందరు పని తేలికయ్యేలా ఉంటే… మరికొందరు తలనొప్పిగా మారతారు. నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ తన పీఏల వ్యవహార శైలితో అభాసుపాలవుతున్నారట. ముఖ్యంగా సీఎం సహాయనిధి చెక్కుల విషయంలో జరిగిన అవకతవకలు, చేతివాటం ఎమ్మెల్యేను ఇరకాటంలో పెడుతున్నాయట. అనారోగ్యానికి గురై ప్రయివేట్ ఆసుపత్రిల్లో చికిత్స పొందిన నిరుపేదలు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వారికి కొంత ఆర్ధిక సహాయం చేస్తుంది. ఆయా నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు. ఇక్కడే పిఏ లు అవకతవకలకు పాలడ్డారట.
గతంలో ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ దగ్గర పని చేసిన ఓ వ్యక్తిగత సహాయకుడు… ఏకంగా సీఎం సహాయ నిధి చెక్కులనే మాయం చేశాడట. సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులపై లబ్దిదారుడి ఇంటిపేరు సరిగ్గా లేకపోవటంతో… అదే ఇనిషియల్, పేరు ఉన్న తన సంబంధీకుల బ్యాంకు ఖాతాలో కొన్ని చెక్కులు జమ చేసి డబ్బులు డ్రా చేయించాడనే ఆరోపణలు వచ్చాయట. ఇది పార్టీ నేతలు గుర్తించినా ఎమ్మెల్యేకు చెప్పడానికి కొంత తటపటాయించారట. చివరకు విషయం ఎమ్మెల్యే దృష్టికి కూడా వెళ్లింది. అప్పట్లో ఆ పిఏ ను తప్పించడానికి కారణం ఇదేనని టాక్
ఆ తరువాత వచ్చిన పిఏతో కూడా రవీంద్రనాయక్ కు తలనొప్పి తప్పలేదు. చెక్కులను మాయం చేయకపోయినా, లబ్ధిదారులకు మంజూరైన ఆర్ధిక సహాయంలో… కమీషన్ వసూలు చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయట. ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ అయిన చెక్కుల్లో ఎలాంటి చేతివాటం ఉండకపోయినా…, పంపిణీ తరువాత ఉన్న చెక్కుల్లోనే చేతివాటం ప్రదర్శిస్తారట. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేసే రోజు చిన్న మొత్తంలో ఆర్ధిక సహాయం మంజూరైన వారికి సమాచారమిచ్చి… ఎక్కువ మొత్తంలో ఆర్ధిక సహాయం మంజూరైన వారికి పీఏ ఫోన్ చేసి కమీషన్ సెట్ చేసుకుంటాడనే గుసగుసలు వినిపిస్తున్నాయట.
ఇక ఎమ్మెల్యే నుంచి రికమండేషన్ లెటర్ కావాలంటే పిఏ చేయి తడపాల్సిందేనట మొత్తానికి పీఏల వ్యవహారం దేవకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ కు చెడ్డ పేరు తెస్తుందని తెరాస వర్గాల్లో వినిపిస్తున్న మాట