తెలంగాణ బీజేపీలో పాత కమలనాథులు ఇక ఫేడ్ అవుటేనా? పార్టీ పరంగా ఇక గుర్తింపు లేనట్టేనా? పాతవాళ్లను పక్కన పెట్టి.. కొత్త వాళ్లను అందలం ఎక్కించడంపై కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? పార్టీ ఇస్తున్న సంకేతాలేంటో నాయకులకు అర్థం కావడం లేదా?
బీజేపీ పాత నేతలు ఢిల్లీ పెద్దల దృష్టిలో ఉన్నారా?
కమిటీలో ఆరుగురికి చోటిస్తే.. ఐదుగురు కొత్తవారే..!
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యలు ప్రకటన తెలంగాణ కాషాయ సేనలో సెగలు రేపుతోంది. పార్టీలో పదవులు పేరు చెబితే.. రాష్ట్రంలో ఇన్నాళ్లూ ఎవరికి ప్రాధాన్యం ఇస్తారో.. ఢిల్లీ నాయకుల దృష్టిలో ఉన్నది ఎవరో ఇట్టే తెలిసిపోయేది. ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు పార్టీ సెటప్ మారిపోయింది. పార్టీలోని పాత కాపులకు బీజేపీ కమిటీల్లో చోటే దక్కడం లేదు. అసలు వారు ఢిల్లీ పెద్దల దృష్టిలో ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆ మధ్య బీజేపీ రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యం దక్కని వారికి జాతీయ కమిటీలో చోటిచ్చారని అనుకున్నారు. మిగిలిపోయిన నాయకులను.. జాతీయ కార్యవర్గ సభ్యలుగా నియమిస్తారని భావించారు. అయితే అనుకున్నదొక్కటీ.. కమిటీలో చోటు దక్కిందొక్కరికీ. ప్రస్తుతం ఆ పేర్లపైనే కాషాయ శిబిరంలో జోరుగా చర్చ జరుగుతుంది. తెలంగాణలో కొత్తగా జాతీయ కార్యవర్గంలోకి ఆరుగురిని తీసుకుంటే.. అందులో ఐదుగురు కొత్తవాళ్లే.
పాత బీజేపీ నేతలను పక్కన పెట్టడంపై పార్టీలో చర్చ..!
జాతీయ కార్యవర్గ సభ్యుల ప్రకటన తర్వాత తెలంగాణ బీజేపీలోని సీనియర్ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఎవరూ ఓపెన్ కాకున్నా.. అంతర్గతంగా ఈ అంశంపై సీరియస్ డిస్కషన్ జరుగుతున్నట్టు సమాచారం. బీజేపీలో చేరే కొత్త వారికి న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నా.. పాత వారిని ఎలా పక్కన పెడతారని ప్రశ్నిస్తున్నారట. రాష్ట్రంలో బీజేపీ ఏమీ లేనప్పటి నుంచి పార్టీ జెండా మోస్తున్నవారిని.. పార్టీ కోసం త్యాగాలు చేసినవారిని పట్టించుకోకపోతే ఎలా అని నిలదీస్తున్నారట. కొత్త ముఖాలు రాగానే.. పాత ముఖాలు రుచించలేదా అని వాపోతున్నారట. పలు రాష్ట్రాల నుంచి జాతీయ కార్యవర్గంలోకి పాత కొత్తవారిని కలగలిసి తీసుకున్నారని.. తెలంగాణకు వచ్చేసరికి ఏంటీ దుస్థితి అని గట్టిగానే రుసరుసలాడుతున్నారట.
కమిటీలో చోటు దక్కని నేతలు గుర్రు…!
గత జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఇంద్ర సేనారెడ్డి, పేరాల శేఖర్‌రావులు సభ్యులుగా ఉన్నారు. కొత్త కార్యవర్గంలో వారికి చోటు లభించలేదు. వీరితోపాటు బీజేపీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పక్కన పెట్టేశారు. ఈ దఫా రామచంద్రరావుకు జాతీయ కార్యవర్గంలో చోటు లభిస్తుందని అంతా అనుకున్నారట. తీరా లిస్ట్‌లో వీరి పేర్లు లేవు. జాతీయ కార్యవర్గ సభ్యుల ప్రకటనపై బీజేపీ కీలక నేత ఒకరు గుర్రుగా ఉన్నారు. అంతర్గత వేదికలపై ఆయన గట్టిగానే నిలదీసినట్టు తెలుస్తోంది.
లింగోజీగూడ రగడలో బలిపశువును చేశారని పేరాల శేఖర్ ఆరోపణ..!
ఇంద్రసేనారెడ్డిని ఎందుకు పక్కన పెట్టారని ఆరా..!
మరోసారి జాతీయ కార్యవర్గ సభ్యత్వం ఆశించిన పేరాల శేఖర్‌రావు.. ఇప్పుడు బీజేపీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. కమిటీలోకి తీసుకోకపోవడంపై నేరుగా స్పందించకపోయినా.. GHMC పరిధిలోని లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాల్లో తనను బలిపశువును చేశారని ఓ లేఖ విడుదల చేసి.. ఆరోపించారు శేఖర్‌రావు. సుదీర్ఘకాలం ABVP, BJPలలో పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసిన పేరాల శేఖర్‌ను విద్యార్ధి పరిషత్‌లోనూ.. పార్టీలోనూ శేఖర్‌జీ అని పిలుచుకుంటారు. లింగోజీగూడ విషయాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకోవడం వల్లే ఆయన్ని పక్కన పెట్టారన్నది పార్టీలో ఒక వర్గం చెప్పేమాట. శేఖర్ విషయాన్ని పక్కన పెడితే ఇంద్రసేనారెడ్డిని ఎందుకు పక్కన పెట్టారు అన్నది ఇప్పుడు ప్రశ్న. హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో పదవులు దక్కని సీనియర్లు కనిపిస్తారా? కొత్త వాళ్లే పార్టీని నడిపించుకుంటారని క్రమంగా పక్కకు తప్పుకొంటారో చూడాలి.