ఆ జిల్లాలో ఆయన కాకలు తీరిన రాజకీయ నేత. కానీ.. సార్‌కు మైనస్ మేడమే అని చర్చ ఉంది. తూకానికి సరితూగే వాళ్లకు మేడమ్ టిక్ పెడితే.. సార్ ఓకే చెప్పాలట. కుమారుడి తీరు కూడా ఆయనకు సన్‌స్ట్రోక్‌గా మారిందట. గతంలోనూ ఇలాంటి అనుభవాలతో పొలిటికల్‌గా దెబ్బతిన్నా.. ఆయన వైఖరిలో ఎందుకు మార్పు రాలేదు? ఎవరా నాయకుడు ?
ఇంట్లో భార్యాబిడ్డల మాట కాదనలేకపోతున్న ప్రజాప్రతినిధి..!
అద్భుతమైన వాక్ చాతుర్యం.. ఎవరినైనా కలుపుకొని వెళ్లే మనస్తత్వం సిక్కోలు జిల్లాలో ఆ అధికారపార్టీ ప్రజాప్రతినిధి సొంతం. ప్రస్తుతం పే… ద్ద పదవిలో ఉన్నారు. గతంలో చేపట్టిన పదవివైపు ఇంకోసారి మనసు లాగుతున్నా.. ఎక్కడో సమీకరణాలు తేడా కొడుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఆ నాయకుడు రచ్చ గెలిచినా.. ఇంట్లో మాత్రం భార్యబిడ్డల మాటలు కాదన లేకపోతున్నారట. ఫలితంగా రాజకీయంగా అపఖ్యాతి మూట గట్టుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తమ తూకానికి సరితూగే వారికే మేడమ్ టిక్ పెడతారా..?
గతంలో భర్త వరస ఓటములకు మేడమ్ తీరే కారణమా?
నియోజకవర్గంలో ఆ సీనియర్ పొలిటీషియన్ తీసుకునే నిర్ణయాలను ఆయన భార్య ప్రభావితం చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీకి అండగా నిలిచేవారు.. ఎప్పటి నుంచో ఆయనకు వెన్నంటి ఉంటున్నవారు ఎవరు వచ్చినా.. తమ తూకానికి సరితూగే వారికే మేడమ్ టిక్ పెడతారట. ఆ టిక్ చూశాక.. ఆయనకు ఓకే చెప్పడం మినహా మరో ఆప్షన్ ఉండదన్నది వైసీపీ వర్గాల టాక్. ప్రస్తుతం ఆ నియోజకవర్గం వైసీపీలో రెండేసి గ్రూపులు ఏర్పడటానికి కారణం.. ఆ నాయకుడి భార్య, కుమారుడు కారణమన్నది ఓపెన్ సీక్రెట్. ప్రజాప్రతినిధిగా తిరుగులేని నేతగా ఉన్న ఆయన గతంలో వరసగా ఓడిపోవడానికి మేడమ్ మితిమీరిని జోక్యమే కారణమని చెబుతారు. అయినప్పటికీ ఆయన వైఖరిలో మార్పు లేదట.
బోణి కొట్టకపోతే పని అంగుళం కూడా ముందుకెళ్లదట..!
నియోజకవర్గంలో పని కావాలంటే మేడమ్‌కు బోణి కొట్టాలన్నది అక్కడ అందరూ చెప్పేమాట. లేదంటే ఆ పని అంగుళం కూడా ముందుకెళ్లదట. కమీషన్ కంట పడకపోతే ఆమె వాణీ బాణీ మారిపోతుందట. ఎదుట ఉన్నవారు ఎంతటి వారైనా అరే.. తురే.. ఏరా అని మాట్లాడేస్తారట. చాలా కాలం తర్వాత భర్త అధికారపార్టీలో ఉండటం.. పెద్ద పదవిలో కొనసాగుతుండటంతో ధనదాహాన్ని ఓ రేంజ్‌లో తీర్చుకుంటున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. మండలాల వారీగా అనుచరులను పెట్టుకుని మరీ కమీషన్లు ఫిక్స్ చేస్తున్నారట.
నాన్న కంటే కొడుకే ఎక్కువ తిరుగుతున్నాడట…!
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్న రీతిలో ఆ ప్రజాప్రతినిధి ధర్మపత్ని.. వారి కుమారుడు కూడా నియోజకవర్గంలో చెలరేగిపోతున్నారట. తండ్రి పదవిలో ఉండటంతో.. నియోజకవర్గంలో పెత్తనం తనయుడిది. నాన్న కంటే ఎక్కువగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారట. పెద్దాయన కూడా కొడుకును బాగా చూసుకోవాలని కేడర్‌కు చెప్పారట. దీంతో వారసుడి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారట అనుచరులు. పెద్దాయన అందుబాటులో ఉన్నా లేకున్నా.. అధికారులతో సమీక్షలు.. పనుల కేటాయింపు అన్నీ తల్లీకొడుకులే చూసుకుంటున్నారట. ఈ వైఖరి కారణంగా ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీకి చావుతప్పి కన్నులొట్టబోయింది. సమస్యలు వస్తున్నాయని తెలిసినా.. ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ అంటూ భార్య నుంచి వస్తున్న అదిరింపులను పెద్ద పదవిలో ఉన్న ఆ ప్రజాప్రతినిధి ఎన్నాళ్లు మన్నిస్తూ వస్తారో చూడాలి.