టీఆర్‌ఎస్‌లో ఆ నాయకుడు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారా? ఇప్పుడో.. అప్పుడో అని పదవి ఊరిస్తుంది తప్ప.. ఊరట దక్కడం లేదు. అధినేతతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని కాలం గడిపేస్తున్నారు. ఇప్పటికైనా ఆ అదృష్ట క్షణాలు దగ్గరపడ్డాయా? అధికారపార్టీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్!
2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత చర్చల్లో లేరు
సిరికొండ మధుసూదనాచారి. తెలంగాణ తొలి స్పీకర్. తెలంగాణ రాష్ట్ర సమితి-TRS ప్రారంభం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం.. పాలసీల రూపకల్పనలో ఆయనది యాక్టివ్ రోల్. ప్రస్తుత టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు. ఉద్యమ సమయం నుంచి గులాబీ బాస్ సీఎం కేసీఆర్ వెంట నడిచారు మధుసూదనాచారి. ముఖ్యమంత్రికి సన్నిహితమని పార్టీలో అందరికీ తెలుసు. మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన ఆయన.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పొలిటికల్ చర్చల్లో పెద్దగా లేరు. ప్రస్తుతం చేతిలో పార్టీ పదవి తప్ప.. చెప్పుకోవడానికి మరో పోస్ట్ లేదు. టీఆర్‌ఎస్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే సమయంలో మధుసూదనా చారి పేరు ప్రస్తావనకు వచ్చేది. కానీ.. పదవీయోగం దక్కేది కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకావడంతో మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు ఈ మాజీ స్పీకర్.
ఎమ్మెల్యే గండ్ర టీఆర్‌ఎస్‌లో చేరడంతో రాజకీయంగా ఇరకాటం!
2014 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మధుసూదనాచారి. సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అప్పట్లో తెలంగాణ తొలి స్పీకర్ అయ్యే అవకాశం దక్కింది. 2018 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి బరిలో దిగినా.. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. మారిన రాజకీయ పరిణామాలతో మధుసూదనాచారిపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికితోడు.. గండ్ర చేరికతో మాజీ స్పీకర్‌కు పొలిటికల్‌గా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీపై సిరికొండ గురి!
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారా? సీటు కన్ఫామా?
రాజకీయంగా మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న మధుసూదనాచారి కన్ను ఎమ్మెల్సీ పదవిపై పడింది. ఆ పోస్ట్ కోసం అవకాశం చిక్కినప్పుడల్లా సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను కలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో తన ప్రయత్నాలను స్పీడప్ చేశారట మాజీ స్పీకర్. ఈసారి తప్పకుండా అదృష్టం కలిసి వస్తుందని ఆయన అనుకుంటున్నారట. కరోనా కారణంగా ఈ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఎప్పుడు చేపడతారో క్లారిటీ లేదు. కాకపోతే సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా.. అక్కడ మధుసూదనాచారి కనిపిస్తుండటంతో.. ఆయన వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారా? లేక సీటు కన్ఫామ్ చేసుకున్నారా అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. మరి.. సిరికొండ వారిని ఈదఫా పదవీయోగం వరిస్తుందో లేదో చూడాలి.