ఆ నియోజకవర్గానికి ఇంఛార్జ్ లేరు. ఆ పదవికోసం చాలామంది క్యూ కడుతున్నారు. మాకంటే మాకు ఇంచార్జ్ పదవి ఇవ్వాలని అధినేతకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నాయకులు?
సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ పదవి కోసం పోటీ..!
సత్తెనపల్లి నియోజకవర్గం ఇప్పుడు గుంటూరు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్. జిల్లాలో 17 నియోజకవర్గాలుంటే 16చోట్ల టీడీపీకి ఇంఛార్జ్‌లు ఉన్నారు. ఒక్క సత్తెనపల్లికి మాత్రమే ఇప్పటివరకూ తెలుగుదేశంపార్టీ ఇంఛార్జ్‌గా ఎవరినీ నియమించలేదు. గతంలో టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కోడెల మరణం తర్వాత సత్తెనపల్లి టీడీపీలో కొంత శూన్యం ఏర్పడింది. కోడెల కుటుంబానికి అండగా ఉంటానని చంద్రబాబు చెప్పడంతో సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్‌గా కోడెల కుమారుడు శివరాంను నియమిస్తారని అందరూ భావించినా అది జరగలేదు. దీంతో అందరి చూపులు సత్తెనపల్లిపై పడ్డాయి. మాకంటే మాకు ఇంఛార్జ్ కావాలని పోటీ పడుతున్నారు.
ఎవరిని ఇంఛార్జ్‌ను చేయాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదా?
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్‌గా తన కుమారుడు రంగారావును ప్రకటించాలని చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఒకసారి గెలిచి తర్వాత వ్యాపారాలకు పరిమితమైన ఆయన తిరిగి గెలవాలనుకుంటున్నారు. సత్తెనపల్లి సీటు కోసం వైవీ కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా ఎవరిని నియమించాలో చంద్రబాబుకు కూడా అర్థంకాని పరిస్థితి.
పదవి కోసం చంద్రబాబును కలిసిన నకరికల్లు నేత..!
గతంలో సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించిన నేతలు ఇప్పుడు మళ్లీ చంద్రబాబును కలుస్తున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ సీనియర్ నేత నాగోతు శౌరయ్య ఇటీవల చంద్రబాబును కలిశారు. మూడు దశాబ్దాలుగా టీడీపీలోనే ఉన్న తనకు సత్తెనపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారట. నియోజకవర్గంలోని నకరికల్లు మండలం తురకపాలేనికి చెందిన శౌరయ్య.. కోడెల అనుచరుడు. గతంలో సర్పంచిగా, నకరికల్లు ఎంపీపీగా కూడా పనిచేశారు.
సత్తెనపల్లి సీటుపై కన్నేసిన అబ్బూరు టీడీపీ నేత..!
సత్తెనపల్లిలో పోటీ చేసేందుకు అబ్బూరుకు చెందిన మన్నెం శివనాగమల్లేశ్వరావు కూడా ట్రై చేశారు. గతంలో కూడా సత్తెనపల్లి టికెట్ ఆశించిన ఈయన మరోసారి రంగంలోకి దిగారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా 8ఏళ్లు, టీఎన్.ఎస్.ఎప్.అధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేసిన మల్లేశ్వరరావు తనను అధిష్ఠానం గుర్తించాలని కోరుతున్నారట. గతంలో రెండుసార్లు అడిగినా దక్కని సీటును పార్టీని నమ్ముకున్న తనకు ఈసారైనా ఇవ్వాలని ఆయన వర్గీయులు అడుగుతున్నారట.
వేచి చూసే ధోరణిలో చంద్రబాబు..?
మొత్తానికి సత్తెనపల్లి నియోజకవర్గం కోసం టీడీపీలో పోటీ రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే ముగ్గురు నేతలు ఇంఛార్జ్ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఒకే నియోజకవర్గం కోసం ఎక్కువ మంది నేతలు పోటీ పడిన సందర్భాల్లో చివరి వరకు ఎవర్నీ ఫైనల్ చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు వేచి చూసే ధోరణి అవలంభించడం అలవాటే. ఎలాగూ ఎవర్నీ ఎంపిక చేయలేదు కదా అని.. ఇంకొందరు ఆశావహులు జాబితాలో చేరిపోతున్నారు.