టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి ఉన్న ఆ నేత… ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? పార్టీ పెద్దలకు.. ఆ ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ వచ్చిందా? దూరం రావడానికి దారితీసిన పరిణామాలేంటి? ఆ ఎమ్మెల్యే ఏ విషయంలో సతమతం అవుతున్నారు?
2014 ఎన్నికల్లో నర్సంపేటలో ఓడిపోయారు
ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఆయన గులాబీ శిబిరంలోనే ఉన్నారు. ఉద్యమ సమయంలో వరంగల్‌జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న నేతల్లో ఒకరు. 2014లో మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో.. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారు సుదర్శన్‌రెడ్డి.
సీఎం కేసీఆర్ పర్యటనలో జరిగిన ఘటనతో చర్చల్లోకి వచ్చారు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి నర్సంపేట నుంచి బరిలో దిగిన సుదర్శన్‌రెడ్డి.. గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. పార్టీ కార్యక్రమాలు.. అధికారిక ప్రోగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొంటున్నా.. ఇటీవల వరంగల్‌లో జరిగిన ఒక ఘటనతో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు ఈ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటన కావడంతో అంతా ఆయనవైపు చూశారు.
సీఎం పర్యటనలో ఎమ్మెల్యే కారు ఆపిన పోలీసులు!
తనకెలాంటి అవమానం జరగలేదని ఎమ్మెల్యే ప్రకటన
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో భద్రతా కారణాల రీత్యా చాలా మంది ప్రముఖల వాహనాలను దూరంగానే ఆపేశారు పోలీసులు. ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి కారును సైతం పోలీసులు ఆపారు. దీంతో కారు దిగి నడుచుకుంటూ వెళ్లారాయన. అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్‌రెడ్డి కారు ఆపడంతో ఆ సమయంలో సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. పోస్టులు హోరెత్తాయి. సీఎం పర్యటనలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. అవి కాస్తా రచ్చకు దారితీశాయి. చివరకు తనకెలాంటి అవమానం జరగలేదని.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.
పార్టీ పెద్దలు ఎమ్మెల్యేకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా?
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఏం చేస్తారని చర్చ!
ఆ ఘటన అలా ఉంటే.. టీఆర్‌ఎస్ పెద్దలను కలిసేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారట. అయితే ఆయనకు అపాయింట్‌మెంట్ రాలేదన్న ప్రచారం మొదలైంది. ఇటీవల వరంగల్‌లో జరిగిన పరిణామాల వల్లే ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందా అన్న చర్చ స్టార్టయింది. అంతేకాదు.. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మనస్తాపం చెందారట. దానిపైనే ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. సుదర్శన్‌రెడ్డి ఏం చేస్తారు? పార్టీ పెద్దలు కనికరించే వరకు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తారా? నిజంగానే పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ వచ్చిందా? అయితే ఆ దూరాన్ని పూడ్చేందుకు ఆయన ఏం చేస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోందట. టీఆర్‌ఎస్ వర్గాలు సైతం నర్సంపేట ఎమ్మెల్యే కదలికలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నాయట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.