ప్రస్తుతం దూరంగా ఉంటూనే అక్కడి వ్యవహారాలను చక్కబెడుతున్నారో మంత్రి. ఆయన అడుగుపెడితే మాత్రం ఆరడుగుల వ్యూహం తప్పదనే టాక్ ఉంది. అందుకే ఉపఎన్నిక జరిగే నియోజకవర్గంలో ఆ మంత్రి ఎంట్రీ ఎప్పుడన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆయనెవరో ఈస్టోరీలో చూద్దాం.
హుజురాబాద్‌లో వేగంగా పావులు కదుపుతోన్న టీఆర్‌ఎస్
హుజురాబాద్ ఉపఎన్నికపై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ఎన్నో ఉపఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఉన్న గులాబీపార్టీ.. ఈ ఉపపోరును మాత్రం సీరియస్‌గా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. హుజురాబాద్ బైఎలక్షన్ బాధ్యతలను మంత్రి హరీష్‌రావు, పార్టీ సీనియర్ నేత వినోద్ కుమార్‌కు అప్పగించింది టీఆర్‌ఎస్. మండలాల వారిగా నియమించిన ఇంచార్జీలు పార్టీ ఆదేశాల ప్రకారం తమ పని చేసుకుంటు వెళ్తున్నారు.
Read Also : కాబోయే భర్తతో రోబో బ్యూటీ తెగదెంపులు… ఇదే సాక్ష్యం…!
హుజురాబాద్ వెళ్లకుండానే ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం!
పార్టీ బాధ్యతలు అప్పగించడంతో రంగంలోకి దిగారు మంత్రి హరీష్‌రావు. హుజురాబాద్ నియెజకవర్గంలో చాపకింద నీరులా పార్టీ వ్యవహారాలను ఆయన చక్కబెడుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా చేరికలకు అధిక ప్రాధన్యం ఇస్తున్నారు హరీష్ రావు. ఈటల వెంట ఉన్న వారిని టిఆర్ఎస్ వైపునకు తీసుకువచ్చే ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు. హుజురాబాద్‌కు చెందిన పలువురు వచ్చి మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొంటున్నారు కూడా.
హుజురాబాద్‌లో ఎంట్రీ ఇస్తే ఇంకెలా ఉంటుందో అని చర్చ!
ఎన్నికలేవైనా హరీష్‌రావుదే కీలక బాధ్యత. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ ఆయన గురిపెట్టారు. ఆయన ఎటువంటి వ్యూహాలను ఉపఎన్నికలో అమలు చేస్తారన్నదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉపఎన్నిక ప్రచారంలో అప్పుడప్పుడు మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. దీంతో హుజురాబాద్‌లో హరీష్ కాలు పెట్టకుండానే రాజకీయ రచ్చ జరుగుతుంటే.. ఆయన ఎంట్రీ ఇస్తే వేడి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. ప్రస్తుతం ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధం వాడీవేడీగా సాగుతోంది.
రోజు రోజుకీ మారుతున్న పార్టీల ఎత్తుగడలు
టీఆర్‌ఎస్, బీజేపీలు ఈ ఉపఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. పోటాపోటీగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. రోజు రోజుకీ ఎత్తుగడలు మారిపోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ స్థాయిలో రాజకీయ వాతావరణం రంజుగా ఉండటంతో.. అధినేతలు ఎంట్రీ ఇస్తే ఇంకెలా ఉంటుందో అన్న చర్చ హుజురాబాద్‌లో ఉంది. మరి.. అధికారపార్టీ తరఫున హరీష్‌రావు ఎలాంటి గెలుపు వ్యూహం రచిస్తారో.. ఎప్పుడు అక్కడ అడుగుపెట్టి కేడర్‌లో ఇంకాస్త చురుకు పుట్టిస్తారో చూడాలి.